ఆంధ్రజ్యోతి(21-09-2021)
కేన్సర్ కణం శరీరం మీద దాడి చేసి ఆరోగ్యకరమైన కణాల మీద ఆధిపత్యం చలాయిస్తుంది. ఈ కణాలు అపరిమితంగా పెరిగిపోయి లింఫ్ నాళాలు, రక్తం ద్వారా మిగతా అవయవాలకు వ్యాపిస్తాయి. కేన్సర్‌కు వయసుతో నిమిత్తం లేదు. ఎవరికైనా, ఎప్పుడైనా ఈ వ్యాధి రావచ్చు. పిల్లల్లో కేన్సర్‌ను 80% మేరకు నయం చేసే వీలుంది. పెద్దల్లో తొలి దశలోనే కనుగొనడం కీలకం. కేన్సర్ చికిత్సలో వయసు, గ్రేడ్, స్టేజింగ్ ప్రాధాన్యం ఎక్కువ.
కేన్సర్ గురించి ముఖ్యమైన విషయాలు
కొన్నిసార్లు కేన్సర్ తొలి దశలో లక్షణాలు కనిపించవు. కేన్సర్ సోకిన అవయవాన్ని బట్టి పరీక్షలు మారుతూ ఉంటాయి. కేన్సర్ అంటువ్యాధి కాదు. గర్భాశయ ముఖద్వార కేన్సర్‌కు కారణమయ్యే హెచ్పివి వైరస్, లివర్ కేన్సర్‌కు దారితీసే హెపటైటిస్ బి, సి వైరస్లు అరక్షిత శృంగారం, రక్తమార్పిడిల ద్వారా సోకుతాయి. ఈ రెండు వైరస్లు సోకకుండా వ్యాక్సిన్లు ఉన్నాయి. వంశపారంపర్యంగా కేన్సర్ సోకే అవకాశాలు తక్కువే అయినా, ఈ వ్యాఽధి ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే, దగ్గరి సంబంధీకులకు రొమ్ము, థైరాయిడ్, పెద్దపేగు, పిత్తాశయ కేన్సర్లు కుటుంబసభ్యులకు వచ్చే ప్రమాదం ఎక్కువ.
పుట్టుమచ్చల్లో మార్పులు, నొప్పి లేకుండా పెరిగే గడ్డలు, నెలసరి మధ్యలో రక్తస్రావం, రొమ్ము నుంచి స్రావాలను అనుమానించాలి. అన్ని రకాల కేన్సర్లు తిరగబెట్టే అవకాశాలు ఉంటాయి. మద్యపానం, ధూమపానం, ఆహార పదార్థాల్లో రంగులు, రసాయనాలు, హార్మోన్లు వాడడం, అధిక బరువు, నీరు, వాతావరణ కాలుష్యం, క్రిమిసంహారాలకు గురవడం, ఎక్కువగా రేడియేషన్ సోకడం, తరచూ వేధించే ఇన్ఫెక్షన్లు కేన్సర్‌కు ప్రత్యక్షంగా, పరోక్షంగా దోహదం చేస్తాయి.
కేన్సర్‌ను చివరి దశకు చేరుకున్న తర్వాత గుర్తించడానికి కారణం ప్రారంభంలో అది ఇతరత్రా వ్యాధులను తలపించే లక్షణాలు కలిగి ఉండడమే. కాబట్టే ఊపిరితిత్తుల కేన్సర్‌ను క్షయ అనీ, బ్రెయిన్ కేన్సర్‌ను మైగ్రెయిన్ అనీ, అండాశయాల కేన్సర్‌ను గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనీ నెలల తరబడి తప్పుడు చికిత్సలతో తాత్సారం చేసి, కేన్సర్ ముదిరిన దశల్లో ఆస్పత్రులకు వస్తూ ఉంటారు.
మారే కేన్సర్ లక్షణాలు!
కేన్సర్ లక్షణాలు అవయవాన్నిబట్టి మారుతూ ఉంటాయి. రొమ్ములో కొత్త గడ్డలు కనిపించడం, గొంతు బొంగురుపోవడం, ఆకలి, బరువు తగ్గడం, మానని పుండు, కొత్తగా మచ్చ తలెత్తడం, ఉన్న మచ్చ పెరగడం, పులిపిరిలో మార్పులు, వాంతులు, అజీర్ణం, తెలుపు లేక అసాధారణ రక్తస్రావం, పొత్తి కడుపు, నడుము నొప్పులు, అజీర్ణంతో పాటు త్రేన్పులు, కడుపు ఉబ్బరం, తగ్గని జ్వరం. సాధారణ ఇన్ఫెక్షన్లలో కూడా ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే మందులకు లొంగకుండా లక్షణాలు రెండు వారాలకు మించి వేధిస్తున్నా, తీవ్రత పెరుగుతున్నా, తగ్గినట్టే తగ్గి, తిరగబెడుతున్నా తప్పనిసరిగా పరీక్షలు చేయించుకుని కేన్సర్ కాదని నిర్థారించుకోవడం అవసరం.
డాక్టర్ మోహన వంశీ,
చీఫ్ సర్జికల్ ఆంకాలజిస్ట్,
ఒమేగా హాస్పిటల్స్, హైదరాబాద్.
ఫోన్: 9848011421