Abn logo
Sep 26 2021 @ 00:40AM

చట్టాలు, హక్కులపై అవగాహన అవసరం

మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ, పక్కన సబ్‌కలెక్టర్‌ వి.అభిషేక్‌


ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ

పాడేరు, సెప్టెంబరు 25: గిరిజన హక్కులు, చట్టాలపై రెవెన్యూ అధికారులకు సంపూర్ణమైన అవగాహన ఉండాలని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ అన్నారు. రెవెన్యూ యంత్రాంగానికి శనివారం ఇక్కడ నిర్వహించిన చట్టాలపై అవగాహన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే రెవెన్యూ శాఖలోని తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, వీఆర్వోలు గిరిజనులకు సంబంధించిన చట్టాలు, హక్కులపై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పరచుకుంటే పాలనపరంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్నారు. ఈసందర్భంగా 1/70 చట్టం, పెసా చట్టం 1996, అటవీ హక్కుల చట్టం-2006, భూ సేకరణ చట్టం 1894, 2013, జాతీయ రహదారుల చట్టం 1956-2013, జనన, మరణాలు, ఏపీ భూ ఆక్రమణ చట్టం 1905, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్టం 1971, సర్వే హద్దుల చట్టం 1923, మ్యూటేషన్‌, రైస్‌ కార్డులు, ఐదో షెడ్యూలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. చట్టాలను సమర్థవంతంగా అమలు చేసి నిబంధనలు పాటిస్తే ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావన్నారు. గిరిజన ప్రాంతంలో స్వయం పరిపాలన, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం, పెసా గ్రామ సభల నిర్వహణ, వాటిలో చర్చించాల్సిన అంశాలను తెలిపారు. అలాగే గ్రామసభలకు సామాజిక సంస్థలపై ఆధిపత్యం ఉంటుందని, రెవెన్యూ అధికారులకు ఎటువంటి ప్రతిపాదనలు వచ్చినా గ్రామసభ తీర్మానం ఉందా? లేదా..? అనేది పరిశీలించాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్‌ కలెక్టర్‌ వి.అభిషేక్‌, సబ్‌ కలెక్టర్‌ ఏవో పి.శ్యామ్‌ప్రసాద్‌, విశ్రాంత ఎస్‌డీసీ టి.అప్పారావు, అటవీ హక్కుల విభాగం డీటీ జి.ఈశ్వరరావు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.