Advertisement
Advertisement
Abn logo
Advertisement

మేధో హక్కుల చట్టంపై అవగాహన అవసరం

రాయపూర్‌ లా వర్సిటీ వీసీ డాక్టర్‌ వివేకానందనన్‌ 

సబ్బవరం, అక్టోబరు 23 : మానవ జీవితం మెరుగుపరచడంలో మేధో సంపత్తి హక్కుల చట్టం ప్రాముఖ్యత ఎంతో ఉందని, అందువల్ల ప్రతి ఒక్కరూ మేధో హక్కుల చట్టం గురించి తెలుసుకోవాలని రాయపూర్‌లోని హిదయతుల్లాహ్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వివేకానందనన్‌ తెలిపారు. సబ్బవరంలోని దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం మేధో సంపత్తి హక్కుల కేంద్రం ఆధ్వర్యంలో మూడవ ఆన్‌లైన్‌ ఐపీఆర్‌(ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ రైట్స్‌) జాతీయ స్థాయి క్విజ్‌ పోటీలు నిర్వహించింది. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలాం జ్ఞాపకార్థం నిర్వహించిన ఈ పోటీల ప్రారంభం అనంతరం వివేకానందనన్‌ మాట్లాడుతూ డాక్టర్‌ అబ్దుల్‌ కలాంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన భారతదేశ మిసైల్‌ మేన్‌ అని అన్నారు. దేశంలో అగ్ని, పృథ్వీ క్షిపణుల ఆవిష్కరణలో ఆయన కృషి వర్ణించలేనిదన్నారు. ఐఐటీలో ప్రొఫెసర్‌ పదవికి ఆయన తిరస్కరణకు గురయ్యారని, అలాంటిది ఆయనకు జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు 48 గౌరవ డాక్టరేట్‌లను ప్రదానం చేశాయన్నారు. మేధో సంపత్తి హక్కుల చట్టం ముఖ్య ఉద్దేశం ఆవిష్కర్తలకు మేధో సంపత్తి హక్కును అందించడమే కాదు, ప్రజలకు అందుబాటులో ఉండే సరసమైన సాంకేతికతలను అందించడం కూడా ముఖ్యమన్నారు. జపాన్‌ ప్రజలు నూతన ఆవిష్కరణలకు  అనుసరిస్తున్న ఎథిక్స్‌కు సంబంధించి తన అనుభవాలను పంచుకుంటూ జపాన్‌లో ఉన్నత స్థాయి నైతికత వల్ల వారి ఆర్థిక వ్యవస్థ పురోగమించిందన్నారు. అలాంటి ఎథిక్స్‌ మిగతా దేశాలు కూడా పాటించాలన్నారు. మేధో సంపత్తి హక్కులు, అభివృద్ధి పరస్పరం అనుసంధానమై ఉన్నాయని, నేటి పరిస్థితుల్లో స్థిరమైన అభివృద్ధి కోసం ఐపీఆర్‌ పాత్ర పట్ల ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. అంతకు ముందు వీసీ ప్రొఫెసర్‌ సూర్యప్రకాశ్‌ మాట్లాడుతూ దేశాభివృద్ధికి ఐపీఆర్‌ కీలక చోదకమన్నారు. టెక్నాలజీ అభివృద్ధి, ఆవిష్కరణల ప్రోత్సాహానికి ఐపీఆర్‌ చాలా ముఖ్యమన్నారు. కార్యక్రమంలో పలు వర్సిటీల నుంచి 42 బృందాలుగా విద్యార్థులు, రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కె. మధుసూదనరావు, చైర్‌పర్సన్‌ సెంటర్‌ ఫర్‌ ఐపీఆర్‌ డాక్టర్‌ పి.శ్రీసుధ, డాక్టర్‌ దయానందమూర్తి, జోగినాయుడు తదితరులు పాల్గొన్నారు. కాగా క్విజ్‌ పోటీలో విన్నర్‌గా హైదరాబాద్‌ సీఎఫ్‌ఏఐలో ఫోర్త్‌ ఇయర్‌ విద్యార్థులు అరిత్ర కుందా, దెబ్‌మలై సిన్హా, రన్నర్‌గా పుణే వర్సిటీ థర్డ్‌ ఇయర్‌ విద్యార్థులు ఆదిశ్రీసింగ్‌, ధరణి మద్దుల నిలిచారు.

Advertisement
Advertisement