ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన

ABN , First Publish Date - 2022-07-04T06:24:36+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో బ్యాంకుల ప్రమేయం, వివిధ రకాల రుణాలు పొందే విధానం, కొత్తగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం తదితర అంశాలపై గ్రామీణ ప్రజలు, ఖాతాదారులకు అవగాహన కల్గించడానికి లీడ్‌ బ్యాంకు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేసింది.

ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన
ఎల్డీఎం శేషగిరిరావు

ఉమ్మడి జిల్లాలో 11 మండల కేంద్రాల్లో శిక్షణ

చిత్తూరు కలెక్టరేట్‌, జూలై 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో బ్యాంకుల ప్రమేయం, వివిధ రకాల రుణాలు పొందే విధానం, కొత్తగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించడం తదితర అంశాలపై గ్రామీణ ప్రజలు, ఖాతాదారులకు అవగాహన కల్గించడానికి లీడ్‌ బ్యాంకు ప్రత్యేక కార్యాలయాలను ఏర్పాటు చేసింది. తొలిదశలో 11 మండల కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. సెంట్రల్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ లిటరసీ (సీఎ్‌ఫఎల్‌) పేరుతో వీటిని పిలుస్తారు. తొలిదశలో పలమనేరు, పుంగనూరు, సదుం, మదనపల్లె, పీలేరు, రొంపిచెర్ల, కురబలకోట, గుర్రంకొండ, ములకలచెరువు, శ్రీకాళహస్తి, పాకాల మండలాలను ఎంపిక చేశారు. ఒక్కో కేంద్రానికి మూడు మండలాల చొప్పున తొలిదశలో 33 మండలాల్లో వివిధ కార్యక్రమాలను చేపట్టారు. ఉమ్మడి జిల్లాలో లీడ్‌ బ్యాంకుగా ఉన్న ఇండియన్‌ బ్యాంకు ఆధ్వర్యంలో వాలంటరీ ఇంటిగ్రేటెడ్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ (విఐడిఎస్‌) సంస్థ ద్వారా కార్యక్రమాలు జరుగుతాయి. ఖాతాదారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం, నగదు రహిత చెల్లింపులు చేయడంపై అవగాహన కల్పిస్తున్నామని లీడ్‌ బ్యాంకు మేనేజర్‌ శేషగిరిరావు తెలిపారు. సైబర్‌ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. బ్యాంకు ఖాతాలు లేనివారికి జన్‌ధన్‌ ఖాతాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. వివిధ రకాల రుణాలు ఎలా తీసుకోవాలి, బ్యాంకు వడ్డీ తదితర అంశాలపై  వివరిస్తున్నారని పేర్కొన్నారు.


Updated Date - 2022-07-04T06:24:36+05:30 IST