రొమ్ము క్యాన్సర్‌ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ABN , First Publish Date - 2022-05-06T21:11:49+05:30 IST

రొమ్ము క్యాన్సర్‌ రాకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి

రొమ్ము క్యాన్సర్‌ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఆంధ్రజ్యోతి(06-05-2022)

ప్రశ్న: రొమ్ము క్యాన్సర్‌ రాకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి?


- సునయన, హైదరాబాద్‌


డాక్టర్ సమాధానం: రొమ్ము క్యాన్సర్‌ మహిళల్లో అధికంగా వస్తుంది. కొంతమంది మగవాళ్లలోనూ రొమ్ము క్యాన్సర్‌ వచ్చినా, స్త్రీలతో పోలిస్తే వీరి సంఖ్య కేవలం ఒక శాతం మాత్రమే. జన్యు ఉత్పరివర్తనాలు, కొన్ని రకాల జన్యువులు వంశపారంపర్యంగా సంక్రమించడం, ఊబకాయం తదితర కారణాలు రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను పెంచుతాయి. జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చని శాస్త్రీయ పరిశోధనలు తెలుపుతున్నాయి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, మద్యపానం, ధూమపానాలకు దూరంగా ఉండడం, బరువు నియంత్రణలో ఉంచుకునేందుకు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మొదలైనవి అలవరచుకోవాలి. ఆహారంలో అధికంగా ప్రాసెస్‌ చేసినవాటిని తగ్గించి కాయగూరలు, ముడి ధాన్యాలు, పప్పులు, పండ్లు, గింజలు మొదలైనవి ఎక్కువగా ఎంచుకోవాలి. ముఖ్యంగా ఆకుకూరలను రోజూ తీసుకోవడం వల్ల వాటిలోని బీటా కెరోటీన్‌, ఫోలేట్‌, ల్యూటిన్‌ మొదలైన పదార్థాలు క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి. ఉల్లి, వెల్లుల్లి, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, ముల్లంగి మొదలైన కూరగాయలను కూడా తరచుగా తినాలి. పసుపు, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు తదితర సుగంధద్రవ్యాలలో క్యాన్సర్‌ ముప్పును తగ్గించే పదార్థాలు ఉంటాయి. ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూనే మహిళలు వైద్యుల సలహా మేరకు క్యాన్సర్‌ పరీక్షలు క్రమం తప్పకుండా చేయించుకోవడం ద్వారా రొమ్ము క్యాన్సర్‌ ఒకవేళ వచ్చినా, ముందుగానే పసిగట్టి తగిన చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్, వెల్‌నెస్ కన్సల్టెంట్

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

sunday.aj@gmail.comకు పంపవచ్చు)

Read more