వాటి మీద దృష్టి పెట్టి.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే!

ABN , First Publish Date - 2022-04-26T17:27:35+05:30 IST

రొమ్ము కేన్సర్‌ పట్ల అవగాహన పెరిగిన తర్వాత, రొమ్ముల మీద ధ్యాస పెరిగింది. అయితే వ్యాధుల నుంచి కాపాడుకోవడమే కాకుండా, వాటి ఆకారాన్నీ, అందాన్నీ కాపాడే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి

వాటి మీద దృష్టి పెట్టి.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే!

ఆంధ్రజ్యోతి(26-04-2022)

రొమ్ము కేన్సర్‌ పట్ల అవగాహన పెరిగిన తర్వాత, రొమ్ముల మీద ధ్యాస పెరిగింది. అయితే వ్యాధుల నుంచి కాపాడుకోవడమే కాకుండా, వాటి ఆకారాన్నీ, అందాన్నీ కాపాడే జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.


బ్రాసరీలు: చాలా మంది చిన్న సైజు బ్రాసరీ ధరిస్తే రొమ్ములు ఆకర్షణీయంగా కనిపిస్తాయని అనుకుంటారు. కానీ నిజానికి ఇలాంటి బిగుతైన బ్రాసరీల వల్ల లేత చర్మం ఒరుసుకుపోయి పుండ్లు, బొబ్బలు ఏర్పడతాయి. అలాగే ఛాతీ ఒత్తుకుపోయి, గుండెల్నిండా ఊపిరి పీల్చుకునే పరిస్థితి కూడా ఉండదు. అలాగే బిగుతైన బ్రాలతో వెన్ను నొప్పి కూడా వేధిస్తుంది. కాబట్టి కచ్చితమైన కొలతలతో బ్రాసరీ సైజును లెక్కించి, సరైనదే ఎంచుకోవాలి.


నిపుల్‌ హెయిర్‌: హార్మోన్లలో హెచ్చుతగ్గుల వల్ల కొందరు మహిళల్లో చనుమొనల మీద మందపాటి వెంట్రుకలు మొలుస్తాయి. అయితే వాటిని తొలగించినా మళ్లీ మళ్లీ మొలుస్తూనే ఉంటాయి. పైగా తొలగించే ప్రయత్నం చేసిన ప్రతిసారీ నొప్పిని ఓర్చుకోవలసి వస్తుంది. కాబట్టి ఆ సున్నిత చర్మం మరింత పాడవకుండా ఉండాలంటే, వెంట్రుకల గురించిన చింత మాని, వాటిని అలాగే వదిలేయడం మేలు.


సపోర్ట్‌: ఏరోబిక్స్‌, స్కిప్పింగ్‌, జంపింగ్‌ జాక్స్‌ లాంటి వ్యాయామాల్లో రొమ్ములకు తగిన సపోర్టింగ్‌ బ్రాలను ధరించాలి. లేదంటే కుదుపులకు రొమ్ముల్లోని కణజాలం డ్యామేజ్‌ అవుతుంది. అలాగే వాటి స్థానం నుంచి కిందకు జారతాయి కూడా! కాబట్టి వ్యాయామాలు చేసేటప్పుడు తప్పనిసరిగా స్పోర్ట్స్‌ బ్రా ధరించాలి.


నిద్ర: కొంతమందికి బోర్లా పడుకుని నిద్రపోయే అలవాటు ఉంటుంది. ఇలాంటి భంగిమలో పడుకోవడం వల్ల రొమ్ముల ఆకారం దెబ్బతింటుంది. వీలైనంత వరకూ వెల్లకిలా లేదా పక్కకు ఒత్తిగిలి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. అలాగే నిద్రించే సమయంలో బ్రాసరీలు ధరించకూడదు.

Updated Date - 2022-04-26T17:27:35+05:30 IST