కమీషన్‌ కోసం రేషన్‌ డీలర్ల ఎదురుచూపు

ABN , First Publish Date - 2020-06-05T09:35:09+05:30 IST

తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన రేషన్‌ డీలర్లకు కమీషన్‌ విడుదల చేయడంలో ప్రభుత్వం ..

కమీషన్‌ కోసం రేషన్‌ డీలర్ల ఎదురుచూపు

నాలుగు విడతలుగా అందని వైనం

ఆర్థిక ఇబ్బందులతో సతమతం

రాష్ట్రవ్యాప్తంగా రూ.70 కోట్లు పెండింగ్‌ 


 (విశాఖపట్నం/ఆంధ్రజ్యోతి): తెల్ల రేషన్‌ కార్డుదారులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసిన రేషన్‌ డీలర్లకు కమీషన్‌ విడుదల చేయడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. కిలోకు రూపాయి వంతున కమీషన్‌ చెల్లించాల్సి ఉంది. డీలర్ల అంచనా మేరకు రాష్ట్ట్రవ్యాప్తంగా కమీషన్‌ రూపేణా నెలకు రూ.17 కోట్లు చెల్లించాల్సి ఉంది. సాధారణంగా ప్రతి నెల బియ్యం పంపిణీలో కిలోకు రూపాయి వంతున డీలర్లకు కార్డుదారులు చెల్లిస్తుంటారు. పంచదార అయితే అరకిలోకు రూ.10, కందిపప్పు ఇస్తే రూ.40లు చెల్లించేవారు. అప్పట్లో కార్డుదారులు చెల్లించే మొత్తం నుంచి కమీషన్‌ను డీలర్లు మినహాయించుకునేవారు. లాక్‌డౌన్‌ అమలుతో ప్రతి 15 రోజులకు ఒకసారి తెల్ల రేషన్‌కార్డులకు ఉచితంగా బియ్యం, కందిపప్పు/శనగలు ఇస్తున్నారు.


మార్చి 29న ప్రారంభించిన ఉచిత పంపిణీ ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు చేపట్టారు. ఈనెల 16న మరో విడత బియ్యం పంపిణీకి సన్నాహాలు చేస్తున్నారు. పంచదార తప్ప బియ్యం, కందిపప్పు/శనగలు ఉచితంగానే ప్రభుత్వం సరఫరా చేసింది. పంచదారకు మాత్రం డీలర్లు ముందుగా చెల్లింపులు చేశారు. మార్చి 29 నుంచి ఇప్పటి వరకు ఐదు పర్యాయాలు సరుకులు పంపిణీ చేస్తే ఒకసారి మాత్రమే కమీషన్‌ వచ్చింది. ఎప్పటికప్పుడు కమీషన్‌ విడుదల చేయాలని డీలర్లు జిల్లా స్థాయు నుంచి రాష్ట్రస్థాయిలో మంత్రి వరకు కలిసి విన్నవిస్తున్నారు. రేషన్‌డిపో నిర్వహణకు తీసుకునే షాపు అద్దె, విద్యుత్‌ బిల్లు, సహాయకుడికి వేతనం, మండల స్టాకు పాయింట్‌ నుంచి డిపోకు వచ్చే సరుకు అన్‌లోడింగ్‌కు కూలి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ నేపథ్యంలో కమీషన్‌ వెంటనే చెల్లించాలని డీలర్లు కోరుతున్నారు. 

Updated Date - 2020-06-05T09:35:09+05:30 IST