బంగారు బతుకులకు లాక్‌

ABN , First Publish Date - 2020-06-01T09:27:57+05:30 IST

యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. అన్నిరంగాలను

బంగారు బతుకులకు లాక్‌

పెళ్లిళ్ల వాయిదాతో ఆర్డర్లు కరువు 

రూపాయి ఆదాయం లేక అర్ధాకలితో అవస్థలు 

ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూపు


‘బంగారు’ బతుకులు చితికిపోతున్నాయి. కరోనా మహమ్మారి స్వర్ణకారుల జీవనాన్ని అతలాకుతలం చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా వివాహాది శుభకార్యాలు నిలిచిపోవడంతో ఆభరణాలు తయారు చేసేవారికి ఉపాధి కరువైంది. జనం బంగారం కొని ఆభరణాలు చేయించుకునే పరిస్థితి లేకపోవడంతో గోల్డ్‌స్మిత్‌ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆదాయం లేక అర్ధాకలితో అలమటిస్తున్నాయి.


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఎంతో మంది జీవితాలను అతలాకుతలం చేస్తోంది. అన్నిరంగాలను నిర్వీర్యం చేస్తోంది. కొవిడ్‌-19తో బంగారు ఆభరణాల తయారీ రంగానికి కోలుకోలేని దెబ్బతగిలింది. ఈ వ్యాపారంపై ఆధారపడి బతుకులు వెల్లదీస్తున్న ఎంతోమంది జ్యూవలర్స్‌తోపాటు కిందిస్థాయి సిబ్బంది, ఆభరణాలు తయారు చేసేవారి జీవన విధానం కుదేలైంది. లాక్‌డౌన్‌ కారణంగా అన్నిరకాల లావాదేవీలు నిలిచిపోయాయి. శుభకార్యాలు ఆగిపోవడంతో ఈ ఏడాది బంగారు కొనుగోళ్లు జరగడం  కష్టమేనంటున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నగల షోరూంలు, ఆభరణాలు తయారు చేసే కార్కాణాలు చాలా ఉన్నాయి. వేలాది మంది కార్మికులు ఇందులో పనిచేస్తున్నారు. షోరూముల్లోనూ వేలాదిమంది పనిచేస్తున్నారు. వీరంతా ఇప్పుడు ఉపాధి కోల్పోయి దుర్బర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.


లాక్‌డౌన్‌తో బంగారు తయారీ వ్యాపారిపై ఆధారపడి జీవిస్తున్న వేలాది మంది ఉపాధి కోల్పోయారు. జ్యువెలరీ షోరూంల యజమానులు ఎలాగోలా వ్యాపారం నెట్టుకొస్తుండగా.. ఆభరణాల తయారీదారులు, మిషన్‌ కట్టింగ్‌, పాలిష్‌ చేసేవారు, స్టోన్‌ సెట్టర్స్‌ జ్యువలరీ డిజైనర్స్‌, మిషిన్‌మెన్‌లు, ఇలా ఎంతో మంది పనిలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్లు గడవక పడరాని పాట్లు పడుతున్నారు. జనం బంగారు ఆభరణాలు చేయించుకునే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో బంగారం వ్యాపారానికి కష్టకాలం వచ్చిపడిందని స్వర్ణకారులు చెబుతున్నారు. ఏడాది వివాహాది శుభకార్యాలు లేవు. దీంతో బంగారానికి డిమాండ్‌ ఉండదు. బంగారం వ్యాపారానికి 2021లోనే కొంతమేరకు అవకాశాలు ఉంటాయని పేర్కొంటున్నారు. దీంతో తమ పరిస్థితి ఏమిటని స్వర్ణకారులు ఆందోళన చెందుతున్నారు. కరోనాతో పెళ్లిళ్లు చాలావరకు వాయుయిదా పడ్డాయి.


ఈ కారణంగా వస్తువుల తయారీకి ఆర్డర్‌ ఇచ్చేవారే కరువయ్యారు. లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు రెండు నెలలపాటు ఇళ్లకే పరిమితం కావడంతో.. చేతి నిండా పనిలేదు. కడుపు నిండా తిండి లేదు. అసలే, బడా సంస్థలు బంగారు ఆభరణాల విక్రయషోరూంలను తెరవడం, ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నట్లు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తుండటంతో దాదాపు 80 శాతం మంది ఆభరణాలను రెడీమేడ్‌ షోరూంలలో కొనుగోలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చిన్నచిన్న ఆభరణాలు, మరమ్మతులు చేస్తూ జీవనాన్ని వెళ్లదీసుకునే విశ్వబ్రాహ్మణులు లాక్‌డౌన్‌తో తీవ్రంగా నష్టపోయారు. అసలే పనులు అంతంత మాత్రం ఉండటం, షాపుల అద్దెలు, విద్యుత్‌ చార్జీలు చెల్లించాల్సి ఉండటంతో ఏమాత్రం ఆదాయ మార్గాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్‌ నుంచి మే, జూన్‌ మాసాల్లో పెద్దసంఖ్యలో వివాహాది శుభకార్యాలు జరగడంతో ఈ కాలంలోనే ఆభరణాల తయారీ ఆర్డర్లు పొంది కొద్దిగా ఆదాయాన్ని గడిస్తారు.


రెండు నెలల నుంచి బంగారం దిగుమతులు పూర్తిగా నిలిచిపోవడం, హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, జనరల్‌ బజార్లు మూసి ఉండటం, నాలుగు నెలల క్రితం తులం బంగారం ధర రూ.38 వేలు ఉండగా, ప్రస్తుతం రూ. 50 వేలకు చేరుకుంది. దీంతో మధ్యతరగతి వారు బంగారు ఆభరణాల తయారీకి పూర్తిగా దూరమయ్యారు. అటు సంపన్నులు భారీ పరిమాణంలో బంగారు ఆభణాలను బడా కంపెనీల వద్దనే కొనుగోలు చేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ ఆశాజనకంగా లేకపోవడం... షేర్‌ మార్కెట్‌లో తీవ్ర ఒడిదుడుకుల వల్ల మినిమమ్‌ గ్యారెంటీ ఉన్న బంగారాన్ని కిలోల చొప్పున కొనుగోలు చేసి ధనవంతులు ఇంట్లో నిల్వ చేయడం కూడా ధర విపరీతంగా పెరిగింది. ఇలా పలు కారణాల వల్ల ఆభరణాల తయారీపై ఆధారపడి జీవనాన్ని గడిపే వేలాది విశ్వబ్రాహ్మణ కుటుంబాల పరిస్థితి దారుణంగా మారింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో వివిధ వర్గాల వారికి ఆయా ప్రభుత్వం శాఖల ద్వారా పలు సహాయ సహకారాలు అందుతుండగా విశ్వబ్రాహ్మణులకు ఏర్పాటు చేసిన విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్‌ ఏమాత్రం స్పందన లేకపోవడంతో అసలు ఈ ఫెడరేషన్‌ అస్తిత్వంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


చితికిన జీవనం లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన చిరువ్యాపారులు

లాక్‌డౌన్‌ కారణంగా చిరు వ్యాపా రుల జీవనం చితికిపోయింది. కనీసం పూట గడవని పరిస్థితి నెలకొంది. లాక్‌డౌన్‌కు ముందు చిరు వ్యాపారులు చిన్నచిన్న వస్తువులు, బట్టలు, ఇతర సామాగ్రిని పట్టణాలు, పల్లెల్లో తిరిగి అమ్ముకొని పొట్టపోసుకునేవారు. అదేవిధంగా మాల్‌, ఇబ్రహీం పట్నం, కడ్తాల్‌, తుక్కుగూడలో జరిగే వారాంతపు సంతల్లోనూ వస్తువులు అమ్ముకొనే వారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం సంతలు జరగకపోవడంతో గతంలో తెచ్చిన వస్తువులు, పరికరాలు అమ్ము డుపోక అవస్థలు పడుతున్నారు. అదే విధంగా బడ్డీకొట్టు, చిరుతిళ్ల తయారీదారుల పరిస్థితీ దయనీయంగా మారింది. వివాహాల సమయంలో బనీన్లు, డ్రాయర్లు, చిన్నపిల్లల దుస్తులు, లుంగీలు, చీరలు అమ్మేవారమని, రోజంతా కష్టపడి రూ 250 నుంచి రూ.400 దాక చేతికందేదని చిరువ్యాపారులు అంటున్నారు. దాంతోనే ఇంటిని నెట్టుకొచ్చేవారమని, ప్రస్తుతం లాక్‌డౌన్‌తో ఎక్కడకు వెళ్లలేని పరిస్థితులు నెలకొనడంతో పూట గడవక అర్ధాకలితో అలమటి స్తున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు పండ్లు, పూలు, రెడీమేడ్‌ పాత దుస్తులు అమ్మి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేవారు. నేడు లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి వీధిన పడ్డారు. తమకు బ్యాంకులు కూడా రుణ సాయమందించవని, ప్రభుత్వమే మమ్ములను ఆదుకోవాలని చిరువ్యాపారులు కోరుతున్నారు.


చిరువ్యాపారులకు సాయమందించి ఆదుకోవాలి

చిరువ్యాపారులకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలందించి జీవనోపాధి కల్పించాలి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన వారి కుటుంబ ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి జిల్లా కలెక్టర్‌ రుణం అందించి ఆదుకోవాలి. నేడు ఉపాధిలేక వీధినపడిన వారిని గుర్తించి వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.                         

- కొప్పు సుకన్యబాష, యాచారం ఎంపీపీ 

Updated Date - 2020-06-01T09:27:57+05:30 IST