Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘అద్దంలో నీ ముఖం చూసుకున్నావా’ అని బాపు అన్నారు

‘‘నాకదో తుత్తి..’’ అంటూ టిపికల్‌ మేనరిజంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ‘మిస్టర్‌ కమెడియన్‌’.. ఏవీఎస్‌! జర్నలిస్టుగా కెరీర్‌ని ప్రారంభించి.. నటుడిగా మారి.. నిర్మాతగా, దర్శకుడిగా కొనసాగుతున్న బహుముఖ ప్రతిభాశాలి. 20-02-2012న జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’లో ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణతో తన అనుభవాలూ జ్ఞాపకాలూ పంచుకున్నారిలా...


ఆర్కే: ఎలా ఉంది మీ సినిమా జీవితం? ‘తుత్తి’గా ఉందా?

ఎవిఎస్‌-‘తుత్తి’గా ఉంది. అసంతృప్తిగా లేదు. సంతోషంగా ఉంది. ఇంకా ఎంతో సాధించాలని ఉంది. జీవితంలో కామాలతోనే బతకాలి అనేవారు ముళ్లపూడి. అలాగే బతుకుతున్నాను.

‘తుత్తి’ డైలాగ్‌కు ప్రేరణ ఎవరు?

ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నపుడు.. రోజూ తెనాలి నుంచి విజయవాడకు వెళ్లేవాణ్ని. ప్రయాణంలో నా పక్క కూర్చునే వ్యక్తి వింతగా మాట్లాడేవాడు. ఆసక్తిగా ఉండడంతో ఆ మాటలను అనుకరించాను. శుభలగ్నం సినిమాలో ‘ప్రశ్నావతారం’ కూడా మరోవ్యక్తి చలవే!

బాపూగారితో మీ అవినాభావ సంబంధం ఏమిటి? శ్రీనాథ కవిసార్వభౌమలో అవకాశం ఇచ్చారు కదా?

నేను మొదట నటించింది శ్రీనాథ కవిసార్వభౌమ సినిమాలో. కానీ, మొదట విడుదలయింది మిస్టర్‌ పెళ్లాం. జర్నలిస్టు కాకముందు సినిమా పిచ్చితో చెన్నై వెళ్లాను. ముందస్తు అనుమతి లేకుండా బాపు దగ్గరకు వెళ్లాను. ఆయన చిరాకులో ఉన్నారేమో! ‘ఎప్పుడైనా అద్దంలో నీ ముఖం చూసుకున్నావా?’ అనడంతో వెనుదిరిగాను. తర్వాత ఆయనే సినిమాఅవకాశం ఇవ్వడం నా అదృష్టం.

జర్నలిజం నుంచి సినిమాల్లోకి రావాలనే ఆలోచన ఎలా వచ్చింది?

ఘంటశాల వెంకటేశ్వరరావు మా మామ. ఆయన మా ఇంటికి వచ్చినపుడు ఆయనను చూడ్డానికి జనం ఎగబడేవారు. అది చూసి యాక్టర్‌ కావాలనుకున్నాను.

పునర్జన్మ పొందారు కదా?

అవును. మృత్యుముఖంలోకి వెళ్లి తిరిగి వచ్చాను. అప్పుడు నేను చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆసుపత్రిలో పడక మీద నుంచి రిమోట్‌ పట్టుకుని, నా చావు వార్త నేనే చూసుకున్నాను.

‘ఆయన పండించిన నవ్వులు ఉన్నాయి గానీ, ఆయన మన మధ్య లేరు’ అని చదువుకుని నవ్వుకున్నాను. ఆసుపత్రి నుంచి వచ్చిన తరువాత ఆ వార్తల మీద నా బ్లాగులో చమత్కరించుకున్నాను.

వ్యసనాలు?

మందు లేదు. సిగరెట్‌ లేదు. కేక్‌లో కోడిగుడ్డు వాడతారని అదీ తినను.

ఎవరూ బలవంత పెట్టలేదా?

‘శంకరాభరణం’ వచ్చిన తర్వాత తెనాలిలో ఒక ఫంక్షన్‌లో జంధ్యాల, సోమయాజులు, నేను కలిశాం.అప్పుడు నాకు తెలీకుండా నాతో మందు కొట్టించాలని వారు పందెం వేసుకుని, కూల్‌డ్రింక్‌లో కలిపి ఇచ్చారు. విశ్వనాథ్‌ సైగ చేయడంతో వారి పందేనికి ‘బలి’ కాలేదు. ఒకసారి చెన్నైలో చిరంజీవి కూడా తన జన్మదినాన నన్ను ఆటపట్టించారు. అప్పుడు కూడా నేను మందు ముట్టలేదు.

తెలిసి,తెలిసీ ఎందుకు దర్శకత్వం, నిర్మాణం వైపు మళ్లారు?

నిర్మాతగా చేతులు కాల్చుకున్నది నిజమే. ‘అంకుల్‌’ సినిమా పోయిందన్న బాధ కన్నా, తరుణ్‌ ‘అంకుల్‌’ సినిమా గురించి చెడుగా మాట్లాడడం ఎక్కువబాధ కలిగించింది. ఇక దర్శకత్వం సంగతి. పూర్వాశ్రమంలో జర్నలిస్టుగా ఉండడం వల్ల, బాధ్యతగా సందేశాత్మక చిత్రాలు తీశాను. రూమ్మేట్స్‌, కోతిమూక..అలా వచ్చినవే. వాటికి నంది అవార్డులు కూడా వచ్చాయి. కాబట్టి హిట్‌ అయిన సినిమా గొప్పదిగానూ, ఫ్లాప్‌ అయిన సినిమాను చెత్తదిగానూ ఎంచను.

మీరు కమెడియన్‌ సంఘం అధ్యక్షులు కదా?

కొత్త టెన్షన్‌లు పెట్టకండి సార్‌

బ్రహ్మానందానికి మీరు ఎందుకు భయపడతారు?

ఆయన్నుంచీ హాని లేకపోయినా, ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడాను. అలా నేను చేసుండకూడదు. ఎవరికో ఏదో జరిగితే నేను ముందుపడ్డాను.

బ్రహ్మానందం మీకు కొన్ని వేషాలు రాకుండా చేశారని.. మీకూ ఆయనకూ పడదనీ...

నేనలా అనను. అయితే.. ఆయన మహర్జాతకుడు. మా ఇద్దరి మధ్య చిన్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌. అయితే మళ్లీ కలిసిపోయాం. ఆయనకు వ్యతిరేకంగా పరిశ్రమలో కొందరు మాట్లాడారు.

రాజకీయ నాయకుడి పాత్ర విషయం..

చంద్రబాబు సీఎం గా ఉన్పపుడు నన్ను పార్టీలోకి పిలిచారు మంచి స్థానం ఇచ్చారు. చేరిన 14వరోజునే అధికార ప్రతినిధిని చేశారు

ఎమ్మెల్యేగా చేయాలని లేదా.

ఉందండీ! ఆ విషయాన్ని మా నాయకుడికి చెప్పలేకపోయాను. ఈ ‘షో’ ద్వారా తెలిస్తే మంచిది. 2004 లో తెనాలిటికెట్‌ అడగాలనుకుని ఆయన దగ్గరికి వెళ్లా. ‘సార్‌! మన పార్టీలో బ్రాహ్మణులకు, వైశ్యులకు మంచి అవకాశం కల్పిస్తే బాగుంటుంది’ అన్నాను. ‘మంచి బ్రాహ్మిన్‌పేరు చెప్పు’ అన్నారు. ‘మళ్లీ వస్తా సార్‌’ అని వచ్చేశాను. అవకాశం ఇస్తే, చేస్తాను. చూద్దాం మా నాయకుడేమంటారో!

మీ పిల్లలు..

కూతురు, కొడుకు. పెళ్లిళ్లు అయిపోయాయి. మా అల్లుడు సినీనటుడు. నువ్విలా, నందీశ్వరుడు, నిప్పు, ఇష్క్‌ సినిమాల్లో నటించాడు. కొడుకు యాడ్స్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు.

మీ లక్ష్యం..

అంతా ‘తుత్తి’గానే ఉంది. దర్శకుడిగా అనుకున్న విజయం సాధించాలని కోరిక.

Advertisement

సినీ ప్రముఖులుమరిన్ని...

Advertisement