జాగ్రత్తలు పాటిస్తే మతిమరుపు దూరం : వీసీ

ABN , First Publish Date - 2022-09-28T05:29:33+05:30 IST

వృద్ధులు మతిమరుపు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన అవసరమని వైవీయూ వైస్‌ చాన్సలర్‌ మునగాల సూర్యకళావతి పేర్కొన్నారు.

జాగ్రత్తలు పాటిస్తే మతిమరుపు దూరం : వీసీ
ముఖ్య అతిధులను సత్కరిస్తున్న వైస్‌ ఛాన్సలర్‌ సూర్యకళావతి

కడప (ఎడ్యుకేషన్‌), సెప్టెంబరు 27 : వృద్ధులు మతిమరుపు పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృత అవగాహన అవసరమని వైవీయూ వైస్‌ చాన్సలర్‌ మునగాల సూర్యకళావతి పేర్కొన్నారు. వైవీయూ సైకాలజీ శాఖ అల్జీమర్స్‌ రిలేటెడ్‌ డిజార్డ్స్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్జీమర్స్‌ వ్యాధి మెల్లమెల్లగా జ్ఞాపకశక్తిని, ఆలోచనా నైపుణ్యాలను నాశనం చేసే ఒక కోలుకోలేని ప్రోగ్రెసివ్‌ బ్రెయిన్‌ డిజార్డర్‌ అన్నారు. భారతదేశంలో నాలుగు మిలియన్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఏదోక రకమైన మతిమరుపు కలిగి ఉన్నారని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కనీసం 44 మిలియన్ల మంది ప్రజలు చిత్తవైకల్యంతో జీవిస్తున్నారన్నారు. ఈ వ్యాధి ని ప్రపంచ ఆరోగ్య సంక్షోభంగా మార్చాలి, దీనిని తప్పనిసరిగా పరిష్కరించేలా పరిశోధనలు జరగాలని కోరారు. వైవీయూ కుల సచివులు డి. విజయరాఘవ ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతి మూడు సెకన్లకు ఒకరికి అల్జీమర్‌ సోకుతుందని, ఇది మిగతా వ్యాధుల కంటే సైలెంట్‌ కిల్లర్‌గా ప్రపంచాన్ని బాధిస్తోందన్నారు. 2050 నాటికి అల్జీమర్స్‌ వ్యాధి ఉన్న వారి సంఖ్య భారతదేశంలో మరో మూడు రెట్లు పెరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రిన్సిపల్‌ కృష్ణారెడ్డి మాట్లాడుతూ అల్జీమర్‌ సోకకుండా ఉండాలంటే మన మెదడును ఎప్పుడూ చైతన్యంగా ఉంచాలన్నారు. నో డిమెన్షియా నోఅల్జీమర్‌ అనే థీమ్‌తో కార్యక్రమాలు నిర్వహించాలని సైకాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, సదస్సు కన్వీనర్‌ కె.లలిత తెలిపారు. అనంతరం ముఖ్య అతిధులను వైవీయూ తరపున ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వైవీయూ పాలక మండలి సభ్యులు ఆచార్య పి.పద్మ, సైకాలజీ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-28T05:29:33+05:30 IST