శతాబ్దాల చరితకు సమాధి..!

ABN , First Publish Date - 2022-05-16T05:32:28+05:30 IST

ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి దక్షిణ భారతదేశంలో తొలితరం పాఠశాలలు మూతపడ్డాయి.

శతాబ్దాల చరితకు సమాధి..!

 నగరంలో మూతపడిన సీబీఎం, ఏవీఎన్‌ పాఠశాలలు  

సమీప జీవీఎంసీ పాఠశాలలకు విద్యార్థులు

ఎయిడెడ్‌ టీచర్లను వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

సొంతంగా టీచర్ల నియామకానికి ముందుకుకాని యాజమాన్యాలు 


(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)


ఎయిడెడ్‌ విద్యా సంస్థలపై ప్రభుత్వ అనాలోచిత నిర్ణయానికి దక్షిణ భారతదేశంలో తొలితరం పాఠశాలలు మూతపడ్డాయి. నగరంలో ఎంతో గుర్తింపు పొందిన సీబీఎం పాఠశాల, ఏవీఎన్‌ స్కూల్‌ ఇక విద్యాభ్యాసానికి దూరమైపోతున్నాయి. ఈ రెండు పాఠశాలలకు మే 5 చివరి పనిదినంగా మిగిలిపోయింది. ఇక్కడి ఎయిడెడ్‌ టీచర్లను ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేసిన ప్రభుత్వం విద్యాసంవత్సరం ముగిసే వరకు కొనసాగించింది. అయితే కొత్తగా టీచర్లను నియమించి, ప్రైవేటుగా కొనసాగించేందుకు అంగీరించని యాజమాన్యాలు మూసివేత నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటివరకు ఉచిత విద్య అందించిన చోట.... ఫీజులు వసూలుకు మనసు అంగీకరించడం లేదని  స్పష్టం చేశాయి. ప్రస్తుతం పాఠశాలలోని ఆరు నుంచి తొమ్మిదో తరగతి వరకు చదువుకునే విద్యార్థులను సమీప జీవీఎంసీ పాఠశాలలకు పంపాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు టీసీలు ఇవ్వడం, ఏయే పాఠశాలలకు పంపాలనే దానిపై విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.  


సీబీఎం పాఠశాల 

 నగరంతో శతాబ్దాల అనుబంధం కలిగిన పాఠశాల ఇది. కెనడియన్‌ బాప్టిస్టు మిషన్‌ 1836లో ఈ పాఠశాలను స్థాపించింది. ఆంగ్లేయుల పాలనలో దక్షిణ భారతంలో తొలి ఉన్నత పాఠశాలగా దీనికి విశిష్ట స్థానముంది. ఇక్కడ వేలాది మంది విద్యాభ్యాసం చేశారు. వన్‌టౌన్‌ హెడ్‌పోస్టాఫీసు సమీపంలో ఉన్న ఈ పాఠశాలలో ఒకప్పుడు సీటు దొరకడమే గగనం. విశాఖలో విద్యావ్యాప్తికి దోహదపడింది. స్వాతంత్య్రం తరువాత దీనికి ప్రభుత్వం గ్రాంట్‌ఇన్‌ ఎయిడ్‌ ఇచ్చింది. ఎక్కువమంది టీచర్లను నియమించి, సుమారు రెండువేల మంది విద్యార్థులకు ఇక్కడ ప్రవేశాలు కల్పించారు. ఇంతటి చరిత గల పాఠశాలలో 2004 తరువాత ఎయిడెడ్‌ టీచర్ల నియామకం లేక పతనం ప్రారంభమైంది. విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రస్తుతం వంద మంది మాత్రమే ఇక్కడ చదువుతున్నారు. నలుగురు ఎయిడెడ్‌ టీచర్లు ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ కావడంతో ..సీబీఎం చరిత్ర ముగిసిపోయింది. దీంతో ప్రస్తుత విద్యార్థుల్ని సమీప ఎంవీడీఎం పాఠశాలకు పంపాలని విద్యాశాఖ ప్రతిపాదించింది.


ఏవీఎన్‌ పాఠశాల..

నగరంలో 1860లో అప్పటి జిల్లా కలెక్టర్‌, మద్రాస్‌ ప్రెసిడెన్సీలో ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ స్కూల్స్‌ అలెగ్జాండర్‌గ్రాంట్‌, జమీందారు జీన్‌ గజపతిరావు, విద్యావేత్త సీవీ స్వామినాయుడు ఏవీఎన్‌ పాఠశాలను స్థాపించారు. అనంతరం అంకితం కుటుంబం దీనికి సాయమందించింది.  ఇక్కడ సీటు కావాలంటే పెద్దలు సిఫారసు చేయాల్సిన పరిస్థితులుండేవి. నోబెల్‌ గ్రహీత సీవీ రామన్‌, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, తదితర ప్రముఖులు ఇక్కడే చదువుకున్నారు. ఈ పాఠశాలలో సుమారు రెండు వేల మంది విద్యార్థులకు ఏటా విద్యాభ్యాసం అందేది. ప్రభుత్వం గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ టీచర్ల నియామకానికి స్వస్తి పలకడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ప్రస్తుతం 280 మంది విద్యార్థులున్నారు. పాఠశాలలో పనిచేస్తున్న 15 మంది ఎయిడెడ్‌ టీచర్లు ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లిపోయారు. దీంతో విద్యార్థుల్ని జీవీఎంసీ పాఠశాలలకు పంపి, పాఠశాలను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది. దీంతో శతాబ్దాలుగా లక్షలాదిమందితో అక్షరాలు దిద్దించిన పాఠశాల చరిత్ర కనుమరుగైపోయింది.



Updated Date - 2022-05-16T05:32:28+05:30 IST