Sep 19 2021 @ 11:15AM

ద‌ర్శ‌కుడు బాబీ వదిలిన 'సావిత్రి w/o స‌త్య‌మూర్తి' ట్రైల‌ర్.

సీనియ‌ర్ హాస్య‌న‌టి శ్రీ‌ల‌క్ష్మి యువ నటుడు పార్వ‌తీశం  జంట‌గా న‌టిస్తున్న చిత్రం సావిత్రి w/o స‌త్య‌మూర్తి. A1 మ‌హేంద్ర క్రియేష‌న్స్ ప‌తాకంపై గోగుల న‌రేంద్ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ వ‌ద్ద ద‌ర్శ‌క‌త్వ‌శాఖ‌లో ప‌నిచేసిన చైత‌న్య కొండ ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. హిలేరియ‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాబీ శ‌నివారం విడుద‌ల‌చేశారు. ఈ సంద‌ర్భంగా ట్రైల‌ర్ బాగుంద‌ని బాబీ అన్నారు. సినిమా విజ‌య‌వంతం కావాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.

అర‌వై ఏళ్ల సావిత్రి త‌న భ‌ర్త త‌ప్పిపోయాడ‌ని ఇర‌వై ఏళ్ల స‌త్య‌మూర్తి ఫొటోను పోలీసుల‌కు చూపించే స‌న్నివేశంతో ట్రైల‌ర్ వినోదాత్మ‌కంగా మొద‌లైంది. సీనియ‌ర్ సిటిజ‌న్స్ అంద‌రూ ఇర‌వై ఏళ్ల స‌త్య‌మూర్తిని అన్న‌య్య‌, పెద‌నాన్న,క్లాస్‌మేంట్‌ అంటూ చెప్ప‌డం న‌వ్విస్తుంది. స‌త్యమూర్తి లైఫ్‌లో ఇర‌వై ఏళ్ల వ‌య‌సులో ఏదో జ‌రిగింది అంటూ స‌స్పెన్స్‌ను జోడించారు. కామెడీ, స‌స్పెన్స్‌, రొమాన్స్ అంశాల‌తో ట్రైల‌ర్ విందుభోజ‌నంలా ఉంది. ప్రస్తుతం ఈ ట్రైలర్ అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ సినిమా మీద బాగానే అంచనాలను పెంచుతోంది.