Abn logo
Mar 1 2021 @ 01:14AM

అవేం చులకనైన పాత్రలు కావు!

చర్చలతో, రచ్చలతో, వివిధ రకాల సమీక్షలతో హల్‌చల్‌ చేస్తూ అందరి దృష్టిలో పడినది రచయిత కొలకలూరి ఇనాక్‌ రాసిన ‘వృద్ధి’ కథ. జాన్‌సన్‌ చోరగుడిగారు ‘‘ఇనాక్‌ ‘వృద్ధి’ కథ - వినవలసిన పాట, చదివేదికాదు’’ అని అంటే (వివిధ: 01.02.2021), దానికి వ్యతిరేకంగా ‘వృద్ధి’ కథ-బొత్తిగా, అవాస్తవికమైన కథ అని శ్రీ మొలకలపల్లి కోటేశ్వరరావు తన గొంతును వినిపించారు (వివిధ: 15.02.2021). 


నేటి పల్లెల నేపథ్యంలో చూస్తే దళితవాడల్లో ఎదుగుబొదుగూలేని, ‘వృద్ధి’కి నోచుకోని బలహీనజనులు ఇంకా ఉన్నారు. పైకి కనిపించేవన్నీ నిజదృశ్యాలు కావు. పట్టణాల్లో దళితులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నది వాస్తవమే, హర్షించదగ్గ అంశమే. కానీ మెరిసేదంతా బంగారమే కాదు కదా!


రచయిత దృష్టి కోణంలో చూస్తే ‘వృద్ధి’ కథలో తల్లీకూతుళ్ళ పాత్రలు- అంత చులకనైనవి కావు. తేలికైనవి కావు. వారిని సోమరితనానికి తిరుగు బోతుతనానికి చిహ్నాలుగా చూడకూడదు. వారు చిందరవందరైన బతుకులకు బాధితులు-ప్రతీకలు.


తల్లి లింగి పాత్రకు పదమూడోఏట పెళ్ళి అవుతుంది. పద్నాలుగో ఏటికే భర్త మరణిస్తాడు. అప్పటికే గర్భవతి. భర్తపోయిన మూణ్ణెళ్ళకు కూతురు సౌందర్య పుడుతుంది. అంత చిన్నవయస్సులో తల్లిగా, ఎదుగుబొదుగులేని బతుకులో ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూస్తుంది. పురుషాధిక్య సమాజంలో కాయకష్టం చేసుకుంటూ, ఏ మగపురుగు తననూ బిడ్డనూ కుట్టకుండా కాపాడుకొని వస్తుంది. తనను తాను నమ్ముకొని బిడ్డను సాకిందంటే సామాన్య విషయం కాదు. లింగి బతుకును అంత తేలికగా నెట్టుకొచ్చిం దంటామా? కూతురు సౌందర్య తల్లి పోషణ, రక్షణలో ఎదిగింది. అమ్మ చేతిలో గుట్టుమట్టుగా పెరిగిన సౌందర్య పరిగెత్తి పోతున్న రైలును ఎక్కే జమాల్సుగాడ్ని ఇష్టపడి పెళ్ళిచేసుకుంటుంది. పెళ్ళయిన రెండోరోజు పోతున్న రైలులో అందరూ చూస్తుండగా చక్రాల కిందపడి మరణిస్తాడు. ఏ అచ్చటా ముచ్చటా నోచుకోని అభాగ్యురాలుగా నిలిచిన సౌందర్య బతుకులో విషాద ఛాయలేవి ఉండమంటామా?


వాళ్ళిద్దరూ పనీపాటా లేకుండా, కడుపునిండా తినడం, కంటినిండా నిద్రపోవడం, సరదాకోసం గుంటూరుకు పోవడం, సినిమాలు చూడటం, విధవరాండ్రకు వచ్చే పెన్షన్‌ నాలుగువేల రూపాయలను పొందటం, ఆ డబ్బులతోనూ చౌకధరల బియ్యమూ ఇంటి సరుకులతోనూ నెల గడపటం... ఇది వాళ్ళ జీవితం కదా! కథలో చెప్పింది కూడా ఇదే! అయితే భరించలేని కష్టాలు కన్నీళ్ళు వాళ్ళ కళ్ళల్లో లేమంటామా?


‘‘ఎప్పుడన్నా, ఎవడన్నా మరీ వెంటబడుతుంటే బిచ్చగాడికి బియ్యం వేసినట్లు, ఊ కొట్టి వాడి కక్కుర్తి తీర్చి వీళ్ళ కుతి తీర్చుకునేవాళ్ళు’’ వంటి చిత్రీకరణలో రచయిత చూపిన ‘కోణం’ తప్పుదారిది అని విమర్శించారు. ప్రధానంగా రచయిత ఒక ప్రాంతాన్ని, ఒక సామాజిక వర్గాన్ని కథావస్తువుగా తీసుకోవడం వల్ల ఇంత వ్యతిరేకత నెలకొంది. అదే ఫలనా ప్రాంతమని చెప్పకుండా, సామాజికవర్గం లేకుండా కేవలం ‘పాత్రల’తోనే నడిపించే వుంటే మరోరకంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యేవని నా అభిప్రాయం. ఈ తల్లీకూతుళ్ళ పాత్రలు ఆశలన్నీ ఆవిరైపోయిన మనసులుకు, ఏదారిన బతుకులకు ప్రతినిధులు. తేరగావస్తున్న డబ్బులతో జల్సాలు చేసే బరితెగించిన అల్పబుద్ధి మనుషులు కారు. ‘స్త్రీల’ పట్ల అగౌరవంగా, వారి మనోభావాలను దెబ్బతీసేంత విధంగా రచయిత ఏమీ రాయలేదు.


గతంలో తీవ్ర విమర్శలకులోనైన కొన్ని రచనలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమౌతుంది. తమిళ రచయిత శ్రీ పెరుమాళ్‌ మురగన్‌ ‘‘అర్ధనారీశ్వరుడు’’ నవల ఎంత దుమారం లేపిందో అందరికి యెరుక. ఈ నవలలో చివరన భర్త ఆదరణను, ప్రేమను వదిలి వెళ్ళిన భార్య ‘‘అమ్మతనం’’ కోసం కట్టుబాట్లను వదులుకొని తెగిస్తుంది. తెలుగు రచయిత నామిని సుబ్రమణ్యం నాయుడు రాసిన నవల ‘‘మూలింటామె’’ కూడా విపరీత విమర్శలకు లోనైంది. అందులోని ‘వసంత’ పాత్ర భర్త ఉండగానే పరపురుషుడి సంబంధం పెట్టుకొని ఎదిగిన తీరు మహిళల మనోభావాలను దెబ్బతీనేవిధంగా ఉందని రచయితను విమర్శించారు. స్త్రీ అంతరంగిక హృదయావిష్కరణగా చలం రాసిన ‘మైదానం’లో రాజేశ్వరి పాత్ర కూడా అప్పట్లో సంచలన విమర్శలను ఎదుర్కొన్నది. ఇనాక్‌ ‘వృద్ధి’ కథ దళితుల చైతన్యాన్ని, శ్రమ సంస్కృతినీ, ఆత్మాభిమాన్నీ, ఆత్మగౌరవాన్ని అవమానించే కథ కాదని పాఠకుడిగా చెప్పగలను. యదార్థవాది లోకవిరోధి.... వాస్తవిక సమాజంలో వాస్తవమైన పాత్రలతో వాస్తవంగా చెప్పిన ‘వృద్ధి’ కథ ఎప్పటికీ వర్ధిల్లుతుంది. 


ఇదేం ‘వృద్ధి’? ఎవరి ‘వృద్ధి’? అని విమర్శించుకుంటూ పోతే ఎలా? ఇప్పుడు నిజానికి వృద్ధి అసలు ఎందులో ఉంది?- సామాజిక వృద్ధి? ఆర్థిక వృద్ధి? రాష్ర్టాభివృద్ధి? దేశాభివృద్ధి? ఇందులో ఎందులోనైనా నిజంగా ఆవ గింజంతైనా ‘వృద్ధి’ ఉందా? చిన్నప్పటి నుంచి చదువుతూనే, రాస్తూనే ఉన్నాం ‘‘భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం’’ అన్న వాక్యాన్ని. ఇప్పుడున్న మనమంతా కనుమరుగయ్యేంత వరకు ఆ మాట కనపడుతూనే, వినబడు తూనే వుంటుంది. ‘వృద్ధి’లో లోపాలను, ‘వృద్ధి’మాటున దాగిన వక్రబుద్ధులను మట్టుబెట్టాలంటే ముందు మనిషి ‘బుద్ధి’ పరిణతి చెందాలి. అప్పుడే ‘సమావృద్ధి’ని చూడచ్చు. ‘సమాభివృద్ధి’ని కూడా సాధించవచ్చు.

చిట్టి

Advertisement
Advertisement
Advertisement