అవయవాతీతం

ABN , First Publish Date - 2022-07-04T06:34:55+05:30 IST

తల పాదాలను బతిమాలింది స్థానభ్రంశం సాధ్యమైంది మెదడు మోకాళ్లను వేడుకొంది విధులు విలోమమయ్యాయి...

అవయవాతీతం

తల

పాదాలను బతిమాలింది

స్థానభ్రంశం సాధ్యమైంది

మెదడు 

మోకాళ్లను వేడుకొంది

విధులు విలోమమయ్యాయి

గుండె

తొంటి ఎముకతో బేరం కుదుర్చుకుంది

ధమనులూ సిరలూ పెళుసుబారాయి

కళ్లు

నడినెత్తికి వల వేశాయి 

చూపులు ఆకాశానికి దఖలు పడ్డాయి

నాలుక

నరాలతో కూడబలుక్కొని నీలుక్కుపోయింది

మాటలు రంగూ రుచీ వాసనా కోల్పోయాయి

గొంతు

స్వరపేటికతో విడాకులు తీసుకుంది

నినాదాలు నీరసించి నిద్రలో జోగుతున్నాయి

వెన్నెముక

ముప్ఫైమూడు పూసలతో ఊసులు మానేసింది

కనిపించిన కుర్చీకల్లా ఒంగి-లొంగి సలాం చేస్తోంది


చిన్ని బొజ్జ

చెరువులా విస్తరిస్తూనే ఉంది

బురదనీటి మూట బరువెక్కుతూనే ఉంది


మనిషిప్పుడు

అవయవాతీతమైన అశాంతితో రగిలిపోతున్నాడు!

ఎమ్వీ రామిరెడ్డి

98667 77870


Updated Date - 2022-07-04T06:34:55+05:30 IST