‘అమృతలత-అపురూప’ అవార్డుల ప్రదానం

ABN , First Publish Date - 2022-08-09T05:40:31+05:30 IST

తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో సోమవారం అమృతలత-అపురూప అవార్డుల ప్రదానోత్సవం

‘అమృతలత-అపురూప’ అవార్డుల ప్రదానం

రవీంద్రభారతి, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో సోమవారం అమృతలత-అపురూప అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ నవలా రచయిత్రి డా.పరిమళా సోమేశ్వర్‌కు అమృతలత అవార్డు ప్రదానం చేశారు. అపరూప అవార్డులను పద్య రచనలో మంథా భానుమతి, సాహితీ విమర్శలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి, బాలసాహిత్యంలో మంజులూరి కృష్ణకుమారి, కవిత్వంలో ఘంటసాల నిర్మల, సినీ, సంగీత సాహిత్య విశ్లేషణలో డా.రొంపిచర్ల భార్గవి, కధా రచనలో కోట్ల వనజాత, నృత్యంలో అనుపమ కైలాష్‌, సామాజిక సేవలో సాయిపద్మ, రంగస్థలంలో సురభి ప్రభావతి, కర్ణాటక సంగీతంలో సంగీత కళ, రాజ్యలక్ష్మికి ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన శాంతా బయోటెక్‌ అధినేత, పద్మభూషణ్‌ డా.కేఐ.వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిభను గుర్తించి గౌరవించడం అభినందనీయమని అన్నారు. రానున్న కాలంలో సాహిత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరముందని అన్నారు. విశిష్ట అతిథి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ జూలూరు గౌరీశంకర్‌ మాట్లాడుతూ ప్రతి రంగంలో ప్రతిభావంతులను గుర్తించి సత్కరించి అవార్డులు అందజేయడం అభినందనీయమని అన్నారు. ఒక కథ రాయాలన్నా, ఒక పాట రాయాలన్నా జీవితాన్ని అంకితం చేయాలని అన్నారు. రాసే సాహిత్యం సమాజానికి ఉపయోగపడాలని అన్నారు. సాహిత్యం, సంగీతం, కళారంగాల్లో మహిళల పాత్ర పెరగాలని ఆకాంక్షించారు. మహిళా రచనా రంగాన్ని ప్రోత్సహించాలని అన్నారు. ప్రముఖ నటి రోజారమణి, అవార్డు వ్యవస్థాపకురాలు, ప్రముఖ రచయిత్రి అమృతలత, శైలజాసుమన్‌ పురస్కార గ్రహీతలను సత్కరించి అభినందించారు. అవార్డు గ్రహీతలు మాట్లాడుతూ ప్రతిభను గుర్తించి పురస్కారాలు అందజేయడం ఆనందంగా ఉందని అన్నారు. 

Updated Date - 2022-08-09T05:40:31+05:30 IST