వారిని సంతృప్తిపరచడమే నా కర్తవ్యం: అవంతిక మిశ్రా

తమిళ చిత్ర పరిశ్రమకు మరో ఉత్తరాది యువతి అవంతిక మిశ్రా పరిచయమవుతోంది. పూర్వాశ్రమం ఢిల్లీ అయినా బెంగుళూరులో విద్యాభ్యాసం పూర్తి చేసిన ఈ భామ ఎంతో శ్రమించి హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ముందుగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ అమ్మాయి... ఇపుడు కోలీవుడ్‌లో అడుగుపెడుతోంది. ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ పతాకంపై నిర్మాత ఆర్‌. రవీంద్రన్‌ నిర్మించిన ‘ఎన్న సొల్ల పోగిరాయ్‌’ చిత్రానికి హరిహరన్‌ దర్శకత్వం వహించారు. ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండగా, ఒక హీరోయిన్‌గా అవంతిక మిశ్రా నటిస్తోంది. విజయ్‌ టీవీ ఫేం అశ్విన్‌ హీరోగా నటించారు. అయితే అవంతిక నటించిన తొలి తమిళ చిత్రం విడుదల కాకుండానే మరికొన్ని చిత్రాల్లో ఆమె అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో ‘నెంజమెల్లాం కాదల్‌’, ‘డి బ్లాక్‌’ వంటి చిత్రాలున్నాయి. అలాగే, పలు తెలుగు చిత్రాలకు కూడా కమిట్‌ అయింది. 


తమిళం, తెలుగు భాషల్లో తన సినీ కెరీర్‌ గురించి ఆమె మాట్లాడుతూ.. ‘‘ఎన్నో మంచి పాత్రలను ఇచ్చి ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నటనలో నా ప్రతిభను నిరూపించుకునే పాత్రల కోసం ఎదురుచూస్తున్నాను. ముందుగా తెలుగు ప్రేక్షకుల అభిమానం పొందినందుకు సంతోషంగా ఉంది. అలాగే ప్రతిభకు పట్టంకట్టే విషయంలో తమిళ ప్రేక్షకులు అగ్రస్థానంలో ఉంటారు.. వారి ప్రేమాభిమానాలు కూడా కోరుకుంటున్నాను. సినిమాల్లో రాణించేందుకు భాష అడ్డం కాదు.. ఒక నటిగా అన్ని భాషల ప్రేక్షకులను సంతృప్తిపరచడమే నా కర్తవ్యం’’ అని తెలిపింది.

Advertisement