దొడ్డిదారిన... మరొకరి వద్దకు వెళ్లొద్దు

ABN , First Publish Date - 2022-05-21T06:45:00+05:30 IST

భీమిలి నియోజకవర్గానికి చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు మరో నియోజక వర్గానికి వెళ్లి మంత్రులను కలుస్తున్నారని తెలుస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు.

దొడ్డిదారిన... మరొకరి వద్దకు వెళ్లొద్దు
శుక్రవారం మండల పరిషత్‌ సమావేశంలో మాట్లాడుతున్న ముత్తంశెట్టి శ్రీనివాసరావు

ఇతర నేతలను కలుస్తున్న భీమిలి ప్రజా ప్రతినిధులు, నేతలకు ముత్తంశెట్టి హితవు

నియోజకవర్గ సమస్యలు నేను పరిష్కరించగలను

నేను భీమిలి నుంచే పోటీ చేస్తా

మరోచోటకు వెళతానన్న ప్రచారాన్ని నమ్మొద్దు


భీమునిపట్నం, మే 20: భీమిలి నియోజకవర్గానికి చెందిన వైసీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు మరో నియోజక వర్గానికి వెళ్లి మంత్రులను కలుస్తున్నారని తెలుస్తోందని, ఇది మంచి పద్ధతి కాదని మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం జరిగిన భీమిలి మండల పరిషత్‌ సాధారణ సర్వసభ్య సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ...దొడ్డి దారినో...దొంగచాటుగానో మరొకరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. తనకు రాష్ట్రంలో అందరూ తెలిసిన వారేనని, సమస్యలను పరిష్కరించగలనని చెప్పారు. పార్టీలో బొత్స, పెద్దిరెడ్డి తప్ప మిగిలిన వారందరూ తనకు జూనియర్లేనని గుర్తుంచుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ తనను ఇక్కడ పార్టీ ఇన్‌చార్జిగా నియమించారని, ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించగలనన్నారు. ప్రొటోకాల్‌ను తాను కచ్చితంగా ఫాలో అవుతానని, మరో నియోజకవర్గంలో సమస్యలు తన దృష్టికి వచ్చినా అక్కడ నాయకుడితోనే చెబుతానన్నారు. ఇతర నియోజకవర్గాల ప్రజా ప్రతినిధులు కూడా ప్రొటోకాల్‌ సిస్టమ్‌ ఫాలో కావాలని కోరుతున్నానన్నారు. భీమిలి నియోజకవర్గంలోని సమస్యలు తానే పరిష్కరిస్తానని, ఎవరి వద్దకూ వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. అవసరమైతే నేరుగా జగన్‌ వద్దకు సమస్యను తీసుకువెళ్లగలనన్నారు. 


భీమిలిలోనే ఉంటా...

ఈసారి తాను మరోచోటకు వెళ్లిపోతానని, పార్టీకి చెందిన కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు తెలుస్తోందని, అది నిజం కాదన్నారు. భీమిలి విడిచిపెట్టి తాను ఎక్కడికీ వెళ్లనని, రాజకీయాల్లో ఉన్నంతవరకూ ఇక్కడి నుంచే పోటీచేస్తానన్నారు. రాజకీయంగా తనకు జన్మనిచ్చింది భీమిలియేనన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా పనిచేస్తానని, రాష్ట్రంలో భీమిలిని నంబర్‌వన్‌గా ఉంచాలన్నదే తన కోరికన్నారు. పదవుల కన్నా అభివృద్ధే ముఖ్యమన్నారు. 


కోరాడ సంఘటనను తప్పుగా రాశారు

కోరాడలో రైతు భరోసా సభ నిర్వహించలేదన్న ముత్తంశెట్టి, అక్కడ రైతు వ్యక్తిగత సమస్య వివరించారని, దాంతో తరువాత మాట్లాడదామని చెప్పానన్నారు. వార్తలు తప్పుగా రాస్తే ప్రజా సమస్యలు పరిష్కారం కావన్నారు. సమస్యలకు భయపడి వెన్నుచూపే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు.  

Updated Date - 2022-05-21T06:45:00+05:30 IST