అవని లేఖర సరికొత్త రికార్డు... పారాలింపిక్స్‌లో రెండు పతకాలు...

ABN , First Publish Date - 2021-09-03T18:28:48+05:30 IST

భారత దేశ బంగారు బాలిక అవని లేఖర సరికొత్త రికార్డును

అవని లేఖర సరికొత్త రికార్డు... పారాలింపిక్స్‌లో రెండు పతకాలు...

టోక్యో : భారత దేశ బంగారు బాలిక అవని లేఖర సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. ఒకే పారాలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళా పారాలింపియన్‌గా ఘనత సాధించింది. ఆమె శుక్రవారం మహిళల 50ఎం రైఫిల్ 3పీ ఎస్‌హెచ్1 ఫైనల్‌లో కాంస్య పతకం సాధించింది. అంతకుముందు మహిళల 10ఎం ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ ఎస్‌హెచ్1 ఈవెంట్‌లో బంగారు పతకం పొందింది. 


స్టాండింగ్ పొజిషన్‌లో 15 షాట్స్ తర్వాత అవని 149.5 పాయింట్లు సాధించడంతో ఆమె 4వ స్థానానికి చేరింది. ప్రోన్ పొజిషన్‌లో ఆమె మూడు సిరీస్‌లు 50.8, 50.3, 48.4 రికార్డు చేసింది. మొత్తం మీద 149.5 పాయింట్లు సాధించింది. ఓవరాల్ స్టాండింగ్స్‌లో 6వ స్థానంలో నిలిచింది. స్టాండింగ్ పొజిషన్‌లో మొదటి రెండు సిరీస్ తర్వాత 4వ స్పాట్‌కు ఎగబాకింది. 3వ స్పాట్ కోసం ఉక్రెయిన్‌కు చెందిన ఇరినా షెట్నిక్‌తో పోరాడింది. అవని 10.5 పాయింట్లు సాధించగా, ఆమె ప్రత్యర్థి ఇరినా 9.9 మాత్రమే సాధించింది. దీంతో భారత దేశానికి కాంస్య పతకం ఖరారైంది. రజత పతకం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన ఝాంగ్ 10.3 పాయింట్లు సాధించగా, అవని 10.2 మాత్రమే సాధించగలిగింది. 


పందొమ్మిదేళ్ళ అవని స్వస్థలం జైపూర్. పారాలింపిక్స్‌లో ఆమె చక్కని ప్రతిభను కనబరిచింది. ఆమె టోక్యోలో పోటీ పడుతున్న మరొక ఈవెంట్ ఉంది. దీనిలో కూడా ఆమె ఓ పతకాన్ని సాధిస్తే, ఒకే పారాలింపిక్స్‌లో మూడు పతకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టిస్తుంది.


2012లో జరిగిన ప్రమాదంలో అవని వెన్నెముకకు గాయమైంది. ఈ పారాలింపిక్స్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిన తర్వాత అవని మాట్లాడుతూ, తన జీవితం ద్వారా అందరికీ స్ఫూర్తిని పంచాలని కోరుకుంటున్నానని చెప్పింది. అవని సాధించగలిగితే, మనం ఎందుకు సాధించలేమని ప్రతి ఒక్కరూ భావించాలని చెప్పింది. తాను సాధించిన పతకం కనీసం ఒకరినైనా ప్రేరేపించగలిగితే, అది తనకు చాలా గొప్ప విషయం అవుతుందని చెప్పింది.

 

Updated Date - 2021-09-03T18:28:48+05:30 IST