రూ. కోట్ల స్థలంపై కన్ను

ABN , First Publish Date - 2020-07-11T10:51:34+05:30 IST

ఐదేళ్ల కింద.. ఆగ్రోస్‌ జిల్లా కార్యాలయం, యంత్ర పరికరాల ఎగ్జిబిషన్‌ నగరంలోని ఆర్‌ఎస్‌ రోడ్డు సర్కిల్‌లో ఉండేది. రైతుల అద్దెకు

రూ. కోట్ల స్థలంపై కన్ను

మారుమూల ప్రాంతానికి యంత్ర పరికరాల ఎగ్జిబిషన్‌ తరలింపు

రైతులకు అందుబాటలో లేక నిరుపయోగం

బీటలువారిన షెడ్డు

 

కర్నూలు(అగ్రికల్చర్‌), జూలై  10: ఐదేళ్ల కింద.. ఆగ్రోస్‌ జిల్లా కార్యాలయం, యంత్ర పరికరాల ఎగ్జిబిషన్‌ నగరంలోని ఆర్‌ఎస్‌ రోడ్డు సర్కిల్‌లో ఉండేది. రైతుల అద్దెకు యంత్రాలు తీసుకొని వాడుకొనేవారు. కానీ నాయకులు కోట్ల విలువ చేసే ఆ స్థలంపై కన్నేశారు. అక్కడున్న భవనాలను కూల్చేశారు. యంత్ర పరికరాల ఎగ్జిబిషన్‌ను పందిపాడు వద్ద ఏర్పాటు చేశారు. దీనికి రూ. కోటిన్నర ఖర్చు చేశారు. అయితే ఈ ఎగ్జిబిషన్‌ అందుబాటులో లేకపోవడం వల్ల ఐదేళ్లయినా రైతులు ఆ వైపు పోవడం లేదు. రూ. కోటి దాకా ఖర్చు చేసి నిర్మించిన ఈ ఎగ్జిబిషన్‌ రైతులకు ఉపయోగపడటం లేదు. దీంతో యంత్రాలు నిరుపయోగమై తుప్పు పట్టిపోతున్నాయి. కాంట్రాక్టర్‌ నాసిరకంగా నిర్మించడంతో ఈ షెడ్‌ అప్పుడే బీటలు వారిపోయింది. 


గతంలో కర్నూలు నడిబొడ్డున ఆర్‌ఎస్‌ రోడ్డు సర్కిల్‌ వద్ద దాదాపు ఐదెకరాల విస్తీర్ణంలో ఆగ్రోస్‌ సంస్థ తన కార్యాలయాన్ని, యంత్ర పరికరాల ఎగ్జిబిషన్‌ను, విత్తనాలు నిల్వ చేసే గోదామును నిర్వహించింది. ఇది అందుబాటులో ఉండటం వల్ల రైతులు వ్యవసాయ పరికరాలు అద్దెకు తీసుకోడానికి క్యూ కట్టేవారు. 


విలువ రూ.100 కోట్ల పైనే..!

రైతులకు అవసరమైన యంత్రాల కేంద్రం, జిల్లా కార్యాలయం ఉన్న ఆగ్రోస్‌ ఐదెకరాల సొంత స్థలంపై నాయకుల కన్ను పడింది. ఏదో ఒక రూపంలో ఈ స్థలాన్ని కబ్జా చేయాలనుకున్నారు. దాదాపు రూ.100 కోట్లకు పైగానే దీని విలువ ఉంటుందని ఆగ్రోస్‌ సంస్థ అధికారులు తెలిపారు. రైతులకు చాలా అనుకూలంగా ఉన్న ఈ ఆగ్రోస్‌ సంస్థ కార్యాలయాన్ని, యంత్రాల నిల్వ కోసం నిర్మించిన భవనాలను నాయకుల ఒత్తిడితో కూల్చి వేశారు. కల్లూరు పారిశ్రామిక వాడలోని మూరుమూల ప్రాంతంలో దాదాపు రూ.50 లక్షలు ఖర్చు చేసి ఒక షెడ్డును నిర్మించారు. ఈ షెడ్డులో దాదాపు రూ.కోటి విలువ చేసే వ్యవసాయ పరికరాలను ఏర్పాటు చేశారు. అయితే ఇది బాగా దూరం కావడంతో రైతులు అక్కడికి వెళ్లలేకపోతున్నారు. ఆర్‌ఎస్‌ రోడ్డు సర్కిల్‌ సమీపంలోని స్థలంలో తమకు అనుకూలంగా ఉండేదని, తిరిగి అక్కడే  వ్యవసాయ యాంత్రీకరణ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. 


తీరని రైతుల అవసరాలు

జిల్లాలో రైతులు వ్యవసాయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా కూలీల కొరత ఉంది. అయితే చిన్న సన్నకారు రైతులు సొంతంగా యంత్రాలు కొనుక్కోలేరు. గతంలో ప్రభుత్వం అందుబాటులో అద్దెకు వ్యవసాయ పరికరాలను వినియోగించుకొనేవారు. ఇప్పుడు ఈ కేంద్రం దూరమైపోయింది. రైతు భరోసా కేంద్రాల వద్ద రైతులకు అవసరాలు తీరేలా అన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది కానీ ఇప్పటి దాకా అలాంటి ఏర్పాట్లు ఏమీ చేయలేదు. తిరిగి యంత్ర పరికరాల ఎగ్జిబిషన్‌ను యథా స్థానంలోకి మార్చే అఽధికారం తమకు లేదని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని ఆగ్రోస్‌ అధికారులు అంటున్నారు. 


 ఎండీ దృష్టికి సమస్యను తీసుకెళ్తాం - ఆగ్రోస్‌ జిల్లా మేనేజర్‌, వెంకటేశ్వరరెడ్డి: 

ప్రస్తుత యంత్ర పరికరాల ఎగ్జిబిషన్‌ రైతులకు అందుబాటులో లేని మాట వాస్తవమే. రైతులకు ఉపయోగకరంగా ఉండాలంటే మళ్లీ సొంత స్థలంలో ఏర్పాటు చేయాల్సిందే. ఈ విషయం రాష్ట్ర ఆగ్రోస్‌ సంస్థ ఎండీ దృష్టికి తీసుకెళ్తాం. 


కోట్ల రూపాయల స్థలంపై నాయకులు కన్నేశారు - జగన్నాథం, రైతు సంఘం జిల్లా నాయకుడు: 

కర్నూలు నగరం నడిబొడ్డున ఆగ్రోస్‌ సంస్థ సొంత స్థలంపై కొందరు నాయకులు కన్నేశారు. అందువల్లే ఆగ్రోస్‌ ఎగ్జిబిషన్‌ మారుమూల ప్రాంతానికి తరలిపోయింది. ప్రభుత్వం వ్యవసాయ యంత్రీకరణ అవసరాన్ని గుర్తించి ఆగ్రోస్‌ సంస్థ సొంత స్థలంలో ఈ కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేయాలి. లేకపోతే రైతులకు దీని వల్ల ఉపయోగం ఉండదు. 

Updated Date - 2020-07-11T10:51:34+05:30 IST