మరో ఐదు బస్తీ దవాఖానాలు

ABN , First Publish Date - 2020-05-22T09:39:09+05:30 IST

జిల్లాలో బస్తీ దవాఖానాల ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలను ఉచితంగా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లా

మరో ఐదు బస్తీ దవాఖానాలు

రంగారెడ్డి జిల్లాలో నేటి నుంచి అందుబాటులోకి..

ప్రారంభించనున్న మంత్రి సబితారెడ్డి 


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : జిల్లాలో బస్తీ దవాఖానాల ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలను ఉచితంగా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోభాగంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో ఇప్పటికే 23 బస్తీ దవాఖానాలు కొనసాగుతుండగా.. నేడు మరో ఐదు ప్రారంభం కానున్నాయి. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ప్రతి ఐదు నుంచి పదివేల మందికి స్థానికంగానే వైద్య పరీక్షలు నిర్వహించి తగు చికిత్స, మందుల సరఫరా, ల్యాబ్‌ సదుపాయాలు తదితర సేవలను ఈ బస్తీ దవాఖానాల ద్వారా అందించనున్నారు. శుక్రవారం గ్రేటర్‌ హైదరాబాద్‌లో మొత్తం 43 బస్తీ దవాఖానాలు ప్రారంభం కానుండగా, వీటిలో ఐదు రంగారెడ్డి జిల్లా పరిధిలోనే ఉన్నాయి. రాజేంద్రనగర్‌ పరిధిలోని బుద్వేల్‌ జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీహాల్‌లో, సాహేబ్‌నగర్‌లోని వైదేహినగర్‌, సరూర్‌నగర్‌ పరిధిలోని లింగోజిగూడలో పరిధిలోని అధికారినగర్‌, లింగోజిగూడలో వార్డుపరిధిలోని డాక్టర్స్‌ కాలనీలోని కామేశ్వరరావ్‌నగర్‌, కొండాపూర్‌ వార్డు పరిధిలోని మసీద్‌బండ ప్రేమ్‌నగర్‌ కమ్యూనిటీ హాలులో బస్తీదవాఖానాలు ప్రారంభం కానున్నాయి. 


మంత్రి, ఎమ్మెల్యేల చేతుల మీదుగా..

రాజేంద్రనగర్‌ పరిధిలోని బుద్వేల్‌ జీహెచ్‌ఎంసీ కమ్యూనిటీల్‌ హాల్లో ఏర్పాటు చేసిన బస్తీలోని దవాఖానాను ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రారంభించనున్నారు. అలాగే సరూర్‌నగర్‌లోని కామేశ్వర్‌రావు కాలనీలో ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ఉదయం 10-45 గంటలకు ఆమె ప్రారంభిస్తారు. మిగతా బస్తీ దవాఖానాలను స్థానిక శాసన సభ్యులు సుధీర్‌రెడ్డి, అరికెపూడి గాంధీ ప్రారంభించనున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. 


బస్తీ దవాఖానాలో అందుబాటులో ఉండే వైద్య సేవలివే..

జిల్లాలో కొత్తగా ఏర్పాటవుతోన్న ఈ బస్తీ దవాఖానాల్లో డాక్టర్‌, నర్స్‌, సహాయకుడు ఉంటారు. ఓపీ, ప్రాథమిక ల్యాబ్‌ పరీక్షలు, గర్భిణులు, బాలింతలకు పరీక్షలు, టీకాలు వేయడం, కుటుంబనియంత్రణ కౌన్సెలింగ్‌, రక్తనమూనా పరీక్ష, బీపీ, షుగర్‌, కేన్సర్‌ పరీక్షలు, చిన్న చిన్న రోగాలకు చికిత్సలు, మందుల పంపిణీ చేస్తారు.


28కి చేరుకున్న సంఖ్య

జిల్లాలో ప్రస్తుతం 23 బస్తీ దవాఖానాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. మురికివాడలకు దగ్గరగా వీటిని ఏర్పాటు చేసి మెరుగైన వైద్య సౌకర్యాలను అందిస్తున్నారు. పది రకాల వైద్య సేవలు పొందుతున్నారు. నేడు మరో 5 బస్తీ దవాఖాలను ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం బస్తీ దవాఖానాల సంఖ్య 28కి చేరుకున్నాయి. 

Updated Date - 2020-05-22T09:39:09+05:30 IST