Autumn బాంబు

ABN , First Publish Date - 2020-08-01T05:41:52+05:30 IST

భూగోళానికి ఆకురాలే కాలమొచ్చేసింది మళ్ళీ పూలకారు వస్తుందో లేదో అన్ని కాలాలూ ఆటంబాంబులా మారిపోయాయి శరదృతువుకు అర్థం మార్చి రాయాలి మృత్యుదూత....

Autumn బాంబు

భూగోళానికి ఆకురాలే కాలమొచ్చేసింది 

మళ్ళీ పూలకారు వస్తుందో లేదో 

అన్ని కాలాలూ ఆటంబాంబులా 

మారిపోయాయి

శరదృతువుకు అర్థం మార్చి రాయాలి 


మృత్యుదూత

నిర్గమకాండమై ఇంటింటికీ తిరుగుతోంది 

రేమండ్ ఫాదర్ మరణం 

అమృతవాణిని కుంగదీసింది 

ఏ ఆంక్షలనీ తట్టుకోలేని ఊసా మాస్టారు 

రాఫెల్ యుద్ధ విమానాల్లా 

దూసుకెళ్ళిపోయారు 


తెలిసినోళ్లు తెలియనోళ్లు 

కాళ్లకు పసరు లేపనంగా 

పూసుకుని తిరిగినోళ్ళు 

నమస్తే అన్నా అని రోడ్లెక్కి పలకరించినోళ్లు 

ఆసుపత్రి గీతాల ఆడిషన్లో

పాజిటివ్లుగా పాడుతున్నారు 


స్వేచ్ఛగా ఎగిరిన జ్ఞాపకాలకోసం 

మర్చిపోయిన సొంతూరికి 

వెళ్ళిరావాలి కాబోలు 

ఒకే పళ్ళెం ముందు కూర్చుని 

చాక్నా చేసుకున్న రోజులు 

గుప్పిళ్ళతో పాప్కార్న్ 

పంచుకున్న అనుభూతులు 

ఏక్ సాత్ బైటేలమై నవ్వుల పువ్వుల్ని 

పూయించిన క్షణాలు ఎప్పటికి తిరిగొస్తాయో

బిర్రబిగిసిన హిమానీనదాలు 

ఎప్పటికి కరిగిపోతాయో 


మంగళప్రద నివాళిని చావుగా చదవడం 

చావుకబుర్లు చల్లగా వినడం అలవాటయ్యాక 

చీలమండలకు గంటలు కట్టి గంతులేసే 

పోతురాజులు టిక్టాక్లయ్యారు 

శాలిబండ ముత్యాలమ్మ బోసిపోయింది 

ఉజ్జయిని మహంకాళి

సందట్లు ఆవిరైపోయాయి 


బేర్స్ ఇయర్స్ జాతీయ కట్టడం పరిమాణంలా 

ఖైరతాబాద్ గణేశుడు సైజు తగ్గి పరేషాన్ అయ్యాడు నిమజ్జనాలే లేక హుస్సేన్ సాగర్ నిలువునా నీరయ్యింది 

పాన్గాంగ్‌ సరస్సుకు 

పర్యాటకులు తగ్గిపోయినట్లు 

నిశ్శబ్ద ప్రేమజంటలు లేక 

టాంక్బండ్ మూర్చపోయింది


ఏ ముసుగులూ మనసులకు 

వేసుకోని జమానాలో 

రాత్ బజార్ రంగుల 

గాజులు షాపింగ్ కోసం

షెహన్షా దున్నపోతుల్లా 

ఎన్నిసార్లు బలాదూర్ తిరిగాం 


చేపమందు లైన్లలో కొర్రమీను 

పిల్లలమై ఈతలెలా కొట్టాం 

కుండలు నెత్తిన పెట్టుకుని చేసే నృత్యాలమై 

గుంపులుగా చేరిన బీబీకా ఆలావా 

ఊరేగింపులో గుండెలెలా బాదుకునేవాళ్ళం 


‘ఫూట్ లూస్ అండ్ ఫాన్సీ-ఫ్రీ’లో 

సింధీ కాలనీలు- గుజరాత్ గల్లీలు- 

పంజాబ్ బాగ్లు

కనబడితే చాలు నవ్వే కళ్ళయ్యేవి 

పార్సీగుట్టలు రంగురంగుల పతంగులయ్యేవి 

వీధులన్నీ హోళీ 

ఆలింగనాలుగా మారిపొయ్యేవి


పర్షియన్ పేరు పెట్టుకున్న షాదాబ్‌లో 

పూలుపూచే కాలాన్నని 

అర్ధవంతంగా చెప్పుకునే బహార్లో 

తిన్న హలీంలు-డబుల్ కా మీఠాలు- షామీలు-బిర్యానీలకు అప్పుడే 

అర్ధ సంవత్సరం కావొస్తోంది 


జాతికేదో తీర్చలేని బాకీపడ్డట్టు 

సిటీలు వాడి పారేసిన 

చేతి తొడుగులు పీపీటీలని 

ఊడ్చేసే ‘పారిశుధ్య’ చీపురులే గానీ 

జానీ-ఆన్ద-స్పాట్లలా వీధుల్లోకి 

అడుగుపెట్టే దేశభక్తుడేడీ!


తప్పెట్లోయ్ తాళాలోయ్ 

మనుషుల ఇంట్లో శవాలోయ్

జిబ్రాల్టర్రాక్ మీద మౌన బుద్ధుడులా 

ఇళ్లన్నీ మ్యూట్ బటన్లోయ్


మళ్ళీ పాంటూ చొక్కా వేసుకుని 

లంచ్ బాక్స్ పట్టుకుని 

ఆఫీసుకువెళ్ళే కలలు కనాలి

జనంలోకి చొరబడి పిచ్చాపాటి 

కబుర్లు చెప్పిరావాలి 

తోపుడుబండి కట్మిర్చీ బజ్జీలని 

కసాబిసా నమలాలి 

ఈ అనారోగ్య కవచాన్ని తీసివేసే 

ఆలోచనలు చెయ్యాలి



తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ 

95380 53030

(నిరంతరంగా సేవచేస్తున్న గుడ్

సమారిటన్లు దీప్తి దీపేజ్, శైలా తాళ్లూరి, ఆనంద్ కూచిభొట్ల గార్లకు)

Updated Date - 2020-08-01T05:41:52+05:30 IST