‘ఆటో’ను వీడని చిప్‌ కొరత

ABN , First Publish Date - 2021-12-02T06:17:28+05:30 IST

సెమీకండక్టర్‌ చిప్‌ల కొరత ఆటోమొబైల్‌ కంపెనీలను వెంటాడుతోంది. ఈ సమస్యతో నవంబరు నెలలోనూ మారుతీ సుజుకీ........

‘ఆటో’ను వీడని చిప్‌ కొరత

నవంబరులోనూ 

భారీగా తగ్గిన విక్రయాలు 


న్యూఢిల్లీ : సెమీకండక్టర్‌ చిప్‌ల కొరత ఆటోమొబైల్‌ కంపెనీలను వెంటాడుతోంది. ఈ సమస్యతో నవంబరు నెలలోనూ మారుతీ సుజుకీ, హ్యుండయ్‌ మోటార్‌ ఇండియా సహా పలు కార్ల కంపెనీల అమ్మకాలకు గండిపడింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే మార్కె ట్‌ అగ్రగామి సంస్థ మారుతీ సుజుకీ అమ్మకాలు 18 శాతం తగ్గి 1,17,791 యూనిట్లకు పడిపోయాయి. హ్యుండ య్‌ మోటార్‌దీ ఇదే పరిస్థితి. ఆ కంపెనీ కార్ల అమ్మకాలూ ఏకంగా 24 శాతం తగ్గి 37,001 యూనిట్లకి చేరాయి. హోండా కార్స్‌ ఇండియా కంపెనీకి నవంబరులో నిరాశ తప్పలేదు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే కంపెనీ కార్ల అమ్మకాలు గత నెల 9,990 నుంచి 5,457 యూనిట్లకు పడిపోయాయి. ఎంజీ మోటార్‌ విక్రయాలు కూడా 40 శాతం క్షీణించాయి. 


టాటా మోటార్స్‌కు ఊరట

టాటా మోటార్స్‌కు మాత్రం నవంబరు నెల బాగానే కలిసొచ్చింది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే గత నెల కంపెనీ వాహనాల అమ్మకాలు 38 శాతం పెరిగి 29,778 యూనిట్లకి చేరాయి. మహీంద్రా అండ్‌ మహీం ద్రా కంపెనీ అమ్మకాలూ గత ఏడాది నవంబరుతో పోలిస్తే ఏడు శాతం పెరిగాయి. టయోటా కిర్లోస్కర్‌ కంపెనీ దేశీయ అమ్మకాలైతే గత నెల ఏకంగా 53 శాతం దూసుకుపోయాయి. నిస్సాన్‌ ఇండియా కంపెనీ కార్ల అమ్మకాలు ఇదే కాలంలో 1,017 నుంచి 2,651 యూనిట్లకు చేరాయి. 


ద్విచక్ర కంపెనీలకూ నిరాశే

కాగా నవంబరు నెల అమ్మకాలు టూ వీలర్‌ కంపెనీలనూ నిరాశపరిచాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ అమ్మకాలు ఏకంగా 29 శాతం, బజాజ్‌ ఆటో అమ్మకాలు 20 శాతం పడిపోగా హీరో మోటోకార్ప్‌ 41 శాతం, హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ విక్రయాలు 35 శాతం పడిపోయాయి. 

Updated Date - 2021-12-02T06:17:28+05:30 IST