ఆటోలో పోయాయ్‌... వాట్సాప్‌తో దొరికాయ్‌

ABN , First Publish Date - 2022-01-25T18:20:03+05:30 IST

చేజార్చుకున్న నగలను వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ఓ వ్యాపారి తిరిగి పొందిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. స్థానిక వెప్పేరికి చెందిన నగల వ్యాపారి మహిపాల్‌ ఈ నెల 17న ఆటోలో సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు

ఆటోలో పోయాయ్‌... వాట్సాప్‌తో దొరికాయ్‌

                             - కుదువ దుకాణంలో లభ్యమైన నగలు


పెరంబూర్‌(చెన్నై): చేజార్చుకున్న నగలను వాట్సాప్‌ గ్రూప్‌ ద్వారా ఓ వ్యాపారి తిరిగి పొందిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. స్థానిక వెప్పేరికి చెందిన నగల వ్యాపారి మహిపాల్‌ ఈనెల 17న ఆటోలో సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌కు వెళ్లాడు. అక్కడ దిగిన తర్వాత తన ప్యాంట్‌ జేబులో ఉంచిన 365 గ్రాముల నగలు కనిపించకపోవడంతో పెరియమేడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో, నగలు తీసుకున్న వారు వాటిని నగలు, కుదువ పెట్టే దుకాణాల్లో విక్రయించే అవకాశముందని గ్రహించిన మహిపాల్‌, నగరం, చుట్టుపక్కల జిల్లాల్లోని నగల దుకాణాల యజమానులకు వాట్సాప్‌ ద్వారా నగల వివరాలు, ఫొటోలు పంపించి, సమాచారం తెలిస్తే ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో, పురుషవాక్కం షణ్ముగరాయర్‌ రోడ్డులోని ఓ నగల కుదువ దుకాణానికి వెళ్లిన రమేష్‌ అనే వ్యక్తి కొన్ని నగలు విక్రయించేందుకు యత్నించాడు. వాటిని పరిశీలించిన యజమాని, వాట్సాప్‌లో మహిపాల్‌ పంపిన నగలుగా గుర్తించి అతడికి సమాచారమిచ్చాడు. మహిపాల్‌, పెరియమేడు పోలీసులు దుకాణం వద్దకు చేరుకొని రమేష్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, రోడ్డు పక్కన దొరికిన నగలను తన సోదరి జ్యోతి, సోదరి కుమార్తెకు భాగాలుగా పంచి ఇచ్చారని రమేష్‌ పేర్కొన్నాడు. దీంతో, రమేష్‌, జ్యోతి సహా నలుగురిపై కేసు నమోదుచేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు.

Updated Date - 2022-01-25T18:20:03+05:30 IST