ఆటో డెబిట్‌... ఆస్పత్రుల్లో డౌట్‌

ABN , First Publish Date - 2022-06-27T06:43:41+05:30 IST

అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడే వారిని ఆదుకునేందుకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.

ఆటో డెబిట్‌... ఆస్పత్రుల్లో డౌట్‌

ఆరోగ్యశ్రీ చెల్లింపులపై నెట్‌వర్క్‌ హాస్పిటల్స్‌లో అనుమానం  

నూతన విధానంతో ఇబ్బందులు

తప్పవంటున్న యాజమాన్యాలు 

ఇప్పటికే పేరుకుపోతున్న బకాయిలతో సతమతం 

తాజా నిర్ణయంతో మరింత భారం తప్పదంటున్న ఆస్పత్రులు 

పారదర్శకంగా లేకుంటే నెట్‌వర్క్‌ నుంచి తప్పుకుంటామని సంకేతాలు 


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) 

అనారోగ్య సమస్యలతో ఇబ్బందిపడే వారిని ఆదుకునేందుకు ఉద్దేశించిన ఆరోగ్యశ్రీ పథకంలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ప్రస్తుతం నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో అందించిన వైద్య సేవలకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే ఆయా ఆస్పత్రులకు చెల్లిస్తోంది. అయితే ఈ విధానంలో మార్పులకు యోచిస్తోంది. ఇప్పటివరకు ఆస్పత్రులకు చెల్లిస్తున్న మొత్తాలను...ఇకపై రోగుల ఖాతాల్లో జమ చేయాలని, ఆ తరువాత ఆటో డెబిట్‌ విధానంలో ఆస్పత్రుల ఖాతాలకు మళ్లించాలని భావిస్తోంది. దీనిపై నెట్‌వర్క్‌ పరిధిలోని ఆస్పత్రుల యాజమాన్యాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. 

ప్రస్తుత విధానంలోనే రోగులకు సంబంధించిన బిల్లులు సకాలంలో క్లియర్‌ కావడం లేదని, రూ.కోట్లలో పెండింగ్‌ వుండిపోవడంతో ఆర్థికంగా నష్టపోతున్నామని చెబుతున్నాయి. కొత్త విధానం వల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయనే అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. అంతేకాక ఆటో డెబిట్‌ ప్రక్రియకు బ్యాంకులు కొంత మొత్తాన్ని చార్జ్‌ చేసే అవకాశముందని, దానిని కూడా ఆస్పత్రులే భరించాల్సిన పరిస్థితి ఎదురవుతుందని ఆరిలోవ హెల్త్‌ సిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి యాజమాని పేర్కొన్నారు. 


బీజేపీ నేతల విమర్శలతోనే...

తాజా నిర్ణయం వెనుక రాష్ట్ర ప్రభుత్వం రాజకీయంగా లబ్ధి పొందే ఆలోచన వున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇతర రాష్ట్రాల మాదిరిగానే మన ప్రభుత్వమూ అమలుచేస్తోంది. అయితే గత కొద్దిరోజులుగా బీజేపీ నాయకులు ఆరోగ్యశ్రీ పథకంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆయుష్మాన్‌ భారత్‌లో భాగంగా కేంద్రం ఇస్తున్న నిధులను వినియోగించుకుంటూ, కనీసం ప్రధాని మోదీ ఫొటోను కూడా ముద్రించడం లేదంటూ ఆక్షేపిస్తున్నారు. బీజేపీ నేతల వాదన ప్రజల్లోకి బలంగా వెళితే రాజకీయంగా నష్టపోయే ప్రమాదముందని భావించిన ప్రభుత్వం ఇకపై ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా రోగులు వైద్య సేవలు పొందితే ఆ మొత్తాన్ని ఆస్పత్రులకు కాకుండా నేరుగా రోగుల ఖాతాల్లోకి జమ చేయాలని యోచిస్తోంది. దీనివల్ల ప్రభుత్వం తమ ఖాతాల్లో డబ్బు జమ చేసిందని రోగులకు తెలుస్తుందని, ఫలితంగా ప్రభుత్వ వ్యతిరేకత తగ్గుతుందని భావిస్తోంది. అంతేకాకుండా డిశ్చార్జ్‌ అయ్యే ముందు రోగి నుంచి కన్సెంట్‌ ఫారం స్వీకరించడం ద్వారా ప్రభుత్వంపై అనుకూలత పెరిగేలా చేయాలని చూస్తోంది. కేంద్రం ఇస్తున్న మొత్తాన్ని నేరుగా ఆస్పత్రులకు చెల్లించి, రాష్ట్ర ప్రభుత్వం అందించే మొత్తం రోగుల ఖాతాలకు జమ చేసేలా నిబంధనలు రూపొందిస్తున్నట్టు సమాచారం. 


ఇబ్బందులు తప్పవు

ఆరోగ్యశ్రీ పథకంలో వైద్య సేవలు పొందిన రోగులకు ప్రభుత్వం ఆస్పత్రులకు నేరుగా చెల్లించాల్సిన బిల్లుల క్లియరెన్స్‌కే అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇప్పుడు రోగి ఖాతాలోకి జమ చేసి, ఆటో డెబిట్‌ విధానంలో మళ్లీ ఆస్పత్రి ఖాతాలోకి జమ అంటే ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆస్పత్రుల యాజమాన్యాలు బెంబేలెత్తిపోతున్నాయి. రోగి నుంచి కన్సెంట్‌ ఫారం తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోందని, దీనివల్ల మరిన్ని ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొంటున్నాయి. ప్రస్తుత విధానంలోనే అనేక సాంకేతిక సమస్యలతో అవస్థలు పడుతున్నామని, మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేమని వాదిస్తున్నాయి. అయితే మార్పులకు సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు రూపొందించిన తరువాత తమ అభిప్రాయాన్ని గట్టిగా చెబుతామని ఓ ప్రైవేటు ఆస్పత్రి యజమాని పేర్కొన్నారు. గతంలో వున్న విధానాన్ని అనుసరిస్తేనే నెట్‌వర్క్‌లో ఉంటామని, లేకపోతే కష్టమని మరో ఆస్పత్రి అధినేత పేర్కొన్నారు. 

Updated Date - 2022-06-27T06:43:41+05:30 IST