Advertisement
Advertisement
Abn logo
Advertisement

కృష్ణపట్నం పోర్టు భూముల కుంభకోణంలో అధికారుల సస్పెండ్

నెల్లూరు: జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు భూముల కుంభకోణంపై ఏబీఎన్ లో వచ్చిన కథనాలకు ఉన్నతాధికారులు స్పందించారు. చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నంలో రూ.50 కోట్ల కృష్ణపట్నం పోర్టు భూముల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తహసీల్దార్‌గా పనిచేసిన గీతావాణి, సీనియర్ అసిస్టెంట్ సిరాజ్, కంప్యూటర్ ఆపరేటర్ నవీన్ కుమార్‌లను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు ఉత్తర్వులు జారీ చేసారు. నెల్లూరు చిల్లకూరు మండలం, తమ్మినపట్నం రెవెన్యూ పరిధిలో కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్‌కు 2009లో అప్పటి ప్రభుత్వం 352 ఎకరాల భూమిని అప్పగించిన విషయం తెలిసిందే. అందులో సర్వే నెంబర్ 94/3లో 271 ఎకరాల దేవుని మాన్యం భూములున్నాయి. రైతుల భూములన్నీ సేకరించి కేపీసీఎల్‌కు అప్పగించారు. అప్పటి నుంచి అవి ఖాళీగా ఉండడంతో అధికారపార్టీ పెద్దల కన్ను పడింది. పోర్టుకు చెందిన  209 ఎకరాల భూములకు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ పోర్టుతో ఉన్న పేరును తొలగించారు. గ్రామంలో లేని, గుర్తు తెలియని 11 మంది పేర్లమీదకు మార్చారు. కొత్తగా సర్వే నెం. 327/382 హెచ్1 నుంచి 11 వరకు వెబ్ ల్యాండ్‌లో నకిలీ వ్యక్తుల పేర్లు సృష్టించారు. ఆ భూముల్లో కొన్నింటిని రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించారు. ఆడంగల్, పాస్ బుక్స్ కూడా సిద్ధం చేశారు.


వెంకటాచలం మండలానికి చెందిన రవికుమార్ ప్రభుత్వ వైద్యాధికారి ఆయన కుటుంబసభ్యులకు చెందిన భూములు తమ్మినపట్నం ప్రాంతంలో ఉన్నాయి. బంధువులు, కుటుంబసభ్యులకు చెందిన భూములు తనవేనంటూ గతంలో ఆయన పరిహారం పొందారు. అసలు నిర్వాసితులు మాత్రం నష్టపోయారు. రవికుమార్ పేరుమీద రూ. 60 లక్షలు, అతని భార్య శ్రీసుధ పేరుపై రూ. 60 లక్షలు పరిహారం పొందడంపై అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం పోస్టల్ కారిడార్ కింద అధికారులు మళ్లీ భూ సేకరణ మొదలెట్టారు. అసలు నిర్వాసితులు న్యాయం కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. ఇదే సమయంలో ఈ భారీ భూ కుంభకోణం వెలుగులోకి వచ్చింది.
Advertisement
Advertisement