లక్ష్యం 34.42 లక్షల మొక్కలు

ABN , First Publish Date - 2022-05-24T05:25:15+05:30 IST

ఎనిమిదో విడత హరితహారం కోసం మెదక్‌ జిల్లాలో అధికారులు సిద్ధమవుతున్నారు.

లక్ష్యం 34.42  లక్షల మొక్కలు
నర్సరీలోని మొక్కలు

మెదక్‌ జిల్లాలో ఎనిమిదో విడతహరితహారానికి సర్వం సిద్ధం 

469 నర్సరీల్లో 61 లక్షల మొక్కల పెంపకం

ప్రతి నర్సరీలో 23 రకాల మొక్కలు

మొత్తం 21 ప్రభుత్వ శాఖలకు టార్గెట్‌ 


ఆంధ్రజ్యోతిప్రతినిధి, మెదక్‌, మే 23:  ఎనిమిదో విడత హరితహారం కోసం మెదక్‌ జిల్లాలో అధికారులు సిద్ధమవుతున్నారు.  ఇప్పటికే  అవసరమైన మొక్కలను సిద్ధం చేశారు. ఈ సారి జిల్లాలో 34.42 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా ఎంచుకున్నారు. మొత్తం 469 నర్సరీల్లో 61 లక్షల మొక్కలను   పెంచుతున్నారు. ప్రతి నర్సరీలో 23 రకాల మొక్కలను అందుబాటులో ఉంచారు.  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమాన్ని  విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికలు రూపొందించింది గతేడాది 35.47 లక్షల మొక్కలు నాటారు. ఇందులో 94 శాతం మొక్కలు బతికినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కలు చాలా వరకు కనుమరుగయ్యాయి. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యమే దీనికి కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హరితహారంలో భాగంగా ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఏపుగా పెరిగాయి. మొత్తం 21 ప్రభుత్వ శాఖలకు టార్గెట్‌ ఇచ్చారు. ఇందులో జిల్లా, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 23 లక్షల మొక్కలు, అటవీశాఖకు 4 లక్షల మొక్కలు,  మెదక్‌ మున్సిపాలిటీకి 1.50 లక్ష లు, తూ ప్రాన్‌, నర్సాపూర్‌, రామాయంపేట పురపాలక సంఘాలకు లక్ష మొ క్కల చొప్పున నాటాలని లక్ష్యంగా పెట్టారు. మిగిలిన ప్రభుత్వశాఖలు 5వేల నుంచి 30వేల మొక్కలు నాటే విధంగా ప్లాన్‌ చేశారు. 


ప్రతి మండలంలో బృహత్‌ పల్లె ప్రకృతి వనాలు

హరితహారంలో భాగంగా పల్లెప్రకృతి వనాలను గ్రామాల నుంచి మండలాలకు విస్తరిస్తున్నాయి. ఇప్పటి వరకు ప్రతి గ్రామ పంచాయతీలో ఎకరా స్థలంలో పల్లెప్రకృతి వనాన్ని ఏర్పా టు చేశారు. గతేడాది జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున బృహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనాలకు 3 నుంచి 10 ఎకరాల స్థలాన్ని కేటాయించనున్నారు. అయితే ప్రతి మండలంలో 5 బృహత్‌ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రభుత్వ స్థలాలను గుర్తించే పనిలో రెవెన్యూ అధికారులు నిమగ్నమయ్యారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనాలకు అనువైన స్థలాలను తహసీల్దార్‌, ఎంపీడీ వోలు పరిశీలన చేస్తున్నారు. 


Updated Date - 2022-05-24T05:25:15+05:30 IST