Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పట్టింపేది?

twitter-iconwatsapp-iconfb-icon
పట్టింపేది?మట్టితో చదును చేసిన రాళ్లగూడ జోషికుంట చెరువు

  • చెరువులు, కుంటలు మింగేస్తున్నా చర్యలు తీసుకోని అధికారులు
  • ఔటర్‌ పక్కనే జోషికుంట చెరువు పూడ్చివేత 
  • ఫిర్యాదులు చేసినా స్పందన కరువు
  • సర్వీసు రోడ్డు పక్కనున్న కాల్వ మూసివేసి ఆక్రమణ 
  • ‘రియల్టర్‌’కు అధికాపార్టీ పెద్దల అండదండలు
  • ఆందోళనకు సిద్ధమవుతున్న గ్రామస్తులు 


శంషాబాద్‌, జనవరి 24 : ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటల ఆక్రమణలపై కఠినంగా వ్యవహరిస్తాం.. ఆక్రమణలు  కనిపిస్తే  కూల్చివేస్తాం... ఎంతటి వారైనా వదిలే ప్రసక్తి లేదంటూ.. ప్రభుత్వం రోజూ ప్రకటనలు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. బడా బాబులు చెరువులను చెరబట్టేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆక్రమణల వెనుక స్థానిక అధికార పార్టీ పెద్దల ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కారణంగానే ప్రజలు ఫిర్యాదులు చేసినా బుట్టదాఖలే చేస్తున్నారు. శంషాబాద్‌, రాళ్లగూడ ఔటర్‌ రింగురోడ్డుకు ఆనుకుని ఉన్న జోషికుంట చెరువు పరిస్థితి ఇది. ఇక్కడ కొందరు పెద్దలు చెరువును బహిరంగంగా పూడ్చివేస్తున్నా కనీసం దీన్ని ఆపే నాథుడే లేడు. కొందరు చెరువులో మట్టిపోసి చదును చేసి పూర్తిగా ఆక్రమిస్తున్నారు. బరితెగించి ఇంత బాహాటంగా చెరువును పూడ్చివేస్తున్నా రెవెన్యూ, ఇరిగేషన్‌ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ఫిర్యాదు చేస్తే ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కొద్దిరోజుల నుంచి ఇక్కడ పూడ్చివేత పనులు జరుగుతూనే ఉన్నాయి. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఔటర్‌ రింగురోడ్డు సర్వీసురోడ్డును ఆనుకొని ఉన్న జోషికుంట ఎఫ్‌టీఎల్‌పరిధిలోని భూమిని కబ్జా చేసేందుకు ముందుగా కొందరు రియల్టర్లు రంగంలోకి దిగారు. వీరికి స్థానిక అధికార పార్టీ పెద్దల అండ ఉండడంతో పక్కాగా ప్లాన్‌ చేశారు. ముందుగా చెరువు పక్కనే ఉన్న కొంత ప్రైవేటు భూమిని (ఇది కూడా బఫర్‌ జోన్‌లోనే ఉంది) రియల్టరు కొనుగోలు చేశారు. దానికి పక్కనే ఉన్న చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని భూమి కబ్జా చేసేందుకు రాత్రికి రాత్రి వందలాది భారీ టిప్పర్లతో మట్టి, రాళ్లుతెప్పించి కుప్పలుగా పోయించాడు. ఆ మరుసటిరోజు రాత్రి మట్టిని దాదాపు ఒక ఎకరం పాటు చదును చేశారు. ఈ విషయం గమనించిన బస్తీవాసులు ఇరిగేషన్‌, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు మొక్కుబడిగా అక్కడకు వచ్చి మట్టిలో కనిపించకుండా పోయిన ఎఫ్‌టీఎల్‌ హద్దురాళ్లను తిరిగి పాతించారు. అయితే మట్టిని మాత్రం తొలగించలేదు. ఆ ప్రయత్నం చేసినట్టుగా కూడా కనిపించలేదు. ఆక్రమణదారులు ఇప్పటికే దాదాపు 10అడుగుల ఎత్తున మట్టిపోసి చదును చేశారు. ఇందులో నిర్మాణాలు కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఏమాత్రం స్పందించడం లేదని రాళ్లగూడ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై చర్యలు తీసుకొని కుంటను కబ్జాకు గురి కాకుండా చూడాలని మండల తహసీల్దారు కార్యాలయంతోపాటు సంబంధిత కార్యాలయాల్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.  అయినా ఏ అధికారి సరిగా స్పందించలేదని, రియల్టర్లకు స్థానిక అధికార పార్టీ నేతల అండ ఉండడంతో అతనివైపు కన్నెత్తి కూడా చూడటం లేదంటున్నారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని గ్రామస్థులు హెచ్చరిస్తున్నారు. ఇదిలాఉంటే శంషాబాద్‌ పరిసర ప్రాంతాల్లో అనేక చెరువులు ఇలాగే ఆక్రమణలకు గురవుతున్నాయి. రాత్రికి రాత్రే వీటిని పూడ్చివేస్తున్నారు. ఇలా పూడ్చివేసి వెంటనే లేఅవుట్‌ చేసి అమ్మేస్తున్నారు. 


బఫర్‌జోన్‌లో ప్లాట్లు 

 జోషికుంట చెరువు విస్తీర్ణం 7.29 ఎకరాలుగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. కానీ ఇప్పుడు తాజాగా ఆ చెరువు 5 ఎకరాలు కూడ లేదని గ్రామస్తులు అంటున్నారు. ఈ కుంట ఇప్పటికే కొంతభాగం కబ్జాకు గురైంది. ప్రస్తుతం బఫర్‌జోన్‌లో ఉంది. 111 జీవోలో లేఅవుట్‌లకు ఎలాంటి అనుమతిలేనప్పటికీ కొందరు రియల్టర్లు సాహసించి బఫర్‌జోన్‌లో ప్లాట్లు తయారుచేస్తున్నారు. ఈమేరకు మున్సిపల్‌ అధికారులు కూడా తగు చర్యలు తీసుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓ వైపు కుంట స్థలాన్ని కబ్జాచేయడంతోపాటు మరో వైపుకు ఔటర్‌రింగు పక్కన సర్వీసురోడ్డుకు మధ్యలో ఏర్పాటు చేసిన కాల్వను  కూడ మూసివేశారు. సర్వీసురోడ్డుతోపాటు వెళ్లే వరదనీరు, కల్వర్టు నుంచి కుంటలోకి వచ్చే నీటిని కూడ రాకుండా మట్టితో పూర్తిగా మూసివేశారు. అధికారులు చర్యలు తీసుకోకుంటే జోషికుంట ఆనవాళ్లు కూడా పూర్తిగా లేకుండాపోయే ప్రమాదం ఉంది. కిందటి ఏడాది కురిసిన భారీ వర్షాలకు జోషికుంట పక్కన నిర్మించిన విల్లాలోని ఇండ్లలోకి భారీగా వరద నీరు చేరిన విషయం పాఠకులకు తెలిసిందే. కుంట నుంచి హిమాయత్‌సాగర్‌ జలాశయానికి వెళ్లే వరదకు కాలువ సరిగా లేకపోవడంతో నీరంతా ఇండ్లలోకి చేరింది. ఎఫ్‌టీఎల్‌ బఫర్‌ జోన్‌లలో భారీగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. వీటిమూలంగానే వరదనీరు ఇండ్లలోకి చేరే దారుణ పరిస్థితి నెలకొంది. భవిష్యత్తులో ఇలాగే జరిగితే మరింత దారుణమైన పరిస్థితి నెలకొంటుందని గ్రామస్తులు వాపోతున్నారు. 


అధికారులు చోద్యం చూస్తున్నారు

 రియల్టర్లు పెద్దపెద్ద వాహనాల్లో మట్టితెచ్చిన మట్టిని చెరువు సమీపంలో పోసి రెండు మూడురోజులపాటు చదును చేశారు. మొదటిరోజు మండల రెవెన్యూ, మున్సిపల్‌ కార్యాలయాలతోపాటు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాం. అప్పుడు స్పం దించిన అధికారులు ఏదో నామమాత్రంగా ఎఫ్‌టీఎస్‌ హద్దురాళ్లను వెలికి తీశారు. ముందే మట్టి పోయనీయకుండా చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంత దారు ణంగా ఉండేది కాదు. అధికారులు ఇప్పటికీ మట్టి తొలగించకుండా చోద్యం చూస్తున్నారు.

- విజయభాస్కర్‌రెడ్డి, రాళ్లగూడ


మట్టిని తొలగించాలి

అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదు. గ్రామస్తులమంతా వెళ్లి ఫిర్యాదు చేస్తే.. చాలా ఆలస్యంగా చర్యలు తీసుకునే దుస్థితి నెలకొనడం దారుణం. వెంటనే పోసిన మట్టిని తొలగించాలి.

- వంశీయాదవ్‌


అధికార పార్టీ వారే..

రియల్టర్లు అధికార పార్టీకి చెందిన వారే కావడంతో చర్యలు తీసుకోవడానికి అధికా రులు ముందుకు రావడం లేదు. ఇప్పటికైనా పోసిన మట్టిని తొలగించేలా చర్యలు తీసుకోవాలి. చెరువు భూమిని కబ్జా కాకుండా చూడాలి.

- మహిపాల్‌రెడ్డి 


చర్యలు తీసుకుంటున్నాం

చర్యలు తీసుకున్నాం.. మట్టిని కూడ తొలగిస్తాం. ఫిర్యాదు అందిన వెంటనే ఇరిగేషన్‌ శాఖ అధికారులకు సమాచారం అందించి ఎఫ్‌టీఎల్‌ హద్దురాళ్లను ఏర్పాటు చేయించాం. రెవెన్యూ సిబ్బందిని పంపి మట్టిని కూడ తొలగిస్తాం.

జనార్ధన్‌రావు, తహసీల్దార్‌ 


పోచారంలో గ్రామకంఠం భూమి కబ్జా

ఇబ్రహీంపట్నంరూరల్‌, జనవరి 24 : ఇబ్రహీంపట్నం మండలంలో భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారు. ప్రజాప్రతినిధుల అండదండలతో ఆక్రమణలకు పాల్పడుతున్నారు. నకిలీపత్రాలు సృష్టించి భూములను అమ్ముకుంటున్నారు. పోచారం గ్రా మంలో కోట్ల రూపాయల విలువ చేసే గ్రామకంఠం భూమిని కాజేయాలని ఓ రియల్‌ మాఫియా స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్కేచ్‌ వేసింది. దీంతో గ్రామస్థులు సోమవారం వారిని అడ్డుకున్నారు.  గ్రామంలో జాగీరుదారుల సంస్థానం(గడికోట) దాదాపు ఎకర స్థలంలో ఉండేది. వందల సంవత్సరాల క్రితం జాగీరుదారులు వదిలిపెట్టి వెళ్లిన ఆ స్థలం గ్రామకంఠం కింద పంచాయతీ ఆధీనంలో ఉంది. ఇప్పుడు దాని విలువ సుమారు రూ.5 కోట్ల విలువ చేస్తుంది. దీంతో దానిపై కొంతమంది గ్రామ ప్రజాప్రతినిధుల కన్నుపడింది. వీరి సహకారంతో కొందరు రియల్టర్లు ఆ స్థలానికి నకిలీపత్రాలను సృష్టించి అమ్మకాలు నిర్వహించారు. సోమవారం ఆ స్థలంలో కొందరు వెంచర్‌ చేయటానికి ప్రయత్నాలు సాగిస్తుండటంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామకంఠం భూమిని కబ్జాచేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ భూమిని గ్రామస్థులకు వాడుకలోకి తీసుకురావాలని వారు డిమాండ్‌ చేశారు.


నకిలీపత్రాలు సృష్టించి కబ్జా 

గ్రామపంచాయతీ ఆధీనంలో ఉన్న గ్రామకంఠం భూమికి నకిలీపత్రాలు సృష్టించి కబ్జా చేయడం దారుణం. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. గ్రామాన్ని కాపాడాల్సిన ప్రజాప్రతినిధులు కబ్జాలకు పాల్పడుతున్నారు.           

- కృపేష్‌, ఎంపీపీ 


అది గ్రామ కంఠంభూమి

పోచారం గ్రామంలో గ్రామకంఠం భూమిని కబ్జా చేశారు. విచారణ జరిపి కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం. ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాం.

- క్రాంతికుమార్‌, ఇన్‌చార్జి ఎంపీడీవోAdvertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.