ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై మండిపడ్డ తస్లీమా నస్రీన్

ABN , First Publish Date - 2021-06-22T20:19:55+05:30 IST

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై మండిపడ్డ తస్లీమా నస్రీన్

న్యూఢిల్లీ : పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళలపై అత్యాచారాలు పెరగడానికి కారణం వారు దుస్తులు ధరించే తీరేనని ఆయన చేసిన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల యూజర్లతోపాటు అనేక మంది ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్ కూడా ఆయనపై విరుచుకుపడ్డారు. 


తస్లీమా నస్రీన్ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘ఓ మగాడు తక్కువ దుస్తులు ధరిస్తే, మహిళలు రోబోలు కాని పక్షంలో, ఆ మగాడు ధరించిన తక్కువ దుస్తుల ప్రభావం మహిళలపై ఉంటుంది’’ అని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ అర్ధ నగ్న ఫొటోను ఈ ట్వీట్‌తోపాటు తస్లీమా నస్రీన్ జత చేశారు. 


ఇమ్రాన్ ఖాన్ ఓ వెబ్ న్యూస్ సర్వీస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఓ మహిళ చాలా తక్కువ దుస్తులు ధరిస్తే, పురుషులు రోబోలు కాని పక్షంలో, ఆ మహిళ ధరించిన తక్కువ దుస్తుల ప్రభావం పురుషులపై ఉంటుందని చెప్పారు. ఇది సామాన్యంగా అర్థమయ్యే విషయమని తెలిపారు. ఇమ్రాన్ ఏప్రిల్‌లో కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఓ ప్రశ్నకు సమాధానం చెప్తూ, తాను పరదా సంప్రదాయం గురించి మాట్లాడుతున్నానన్నారు. పాకిస్థాన్‌లో పూర్తిగా ప్రత్యేక తరహా సమాజం ఉందన్నారు. వారి జీవన విధానం ప్రత్యేకమైనదని తెలిపారు. సమాజంలో ఓ స్థాయికి టెంప్టేషన్‌ను పెంచితే, ఈ చిన్న పిల్లలంతా వెళ్లడానికి దారి ఏదన్నారు. దీని పర్యవసానం సమాజంలోనే ఉందన్నారు. మనం నివసించే సమాజంపైనే ఇది చాలా వరకు ఆధారపడి ఉంటుందన్నారు. 


ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై పాకిస్థాన్ ముస్లిం లీగ్ అధికార ప్రతినిధి మరియం ఔరంగజేబ్ కూడా ఘాటుగా స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ అసలు స్వరూపం బయటపడిందన్నారు. 


Updated Date - 2021-06-22T20:19:55+05:30 IST