కరోనా టీకా వద్దంటే.. రూ.3 లక్షల జరిమానా..!

ABN , First Publish Date - 2021-12-10T23:41:26+05:30 IST

కొందరిలో మాత్రం ఇప్పటికీ మార్పు లేదు. కరోనా టీకాపై అపోహలతో వారు వ్యాక్సిన్లు వేసుకునేందుకు ముందుకు రావట్లేదు. ఇప్పటివరకూ ఇటువంటి వారికి నచ్చ చెబుతూ మార్పు కోసం వేచి చూసిన ప్రభుత్వాలు ప్రస్తుతం వారిపై కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి.

కరోనా టీకా వద్దంటే.. రూ.3 లక్షల జరిమానా..!

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌తో ముప్పు పొంచి ఉండటంతో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమయ్యాయి. ఓవైపు.. అంతర్జాతీయ విమానసర్వీసులపై ఆంక్షలు విధిస్తూనే మరోవైపు టీకాకరణ వేగవంతం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని కోట్ల మంది కరోనా టీకా తీసుకుని తమ ఆరోగ్యాన్ని రక్షించుకోవడంతో పాటూ తమ వంతు సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించారు. కానీ.. ఇదంతా చూసినా కూడా కొందరిలో మాత్రం మార్పు రావడం లేదు. కరోనా టీకాపై అపోహలతో వారు వ్యాక్సిన్లు వేసుకునేందుకు ముందుకు రావట్లేదు. ఇప్పటివరకూ ఇటువంటి వారికి నచ్చ చెబుతూ మార్పు కోసం వేచి చూసిన ప్రభుత్వాలు ప్రస్తుతం వారిపై కఠిన చర్యలకు పూనుకుంటున్నాయి. 


ఈ క్రమంలో ఆస్ట్రియా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా వెళుతోంది. 14 ఏళ్లు పైబడిన వారు కరోనా టీకా తీసుకునేందుకు నిరాకరిస్తే అటువంటి వారిపై ఏకంగా 3600 యూరోల జరిమానా విధించేందుకు యోచిస్తోంది. మన కరెన్సీలో చెప్పాలంటే ఇది దాదాపు రూ.3 లక్షలు. సగటు ఆస్ట్రియావాసి స్థితిగతులను బట్టి చూసినా ఇది ఎక్కువే. అంతేకాకుండా.. ఇటువంటి వారు టీకా తీసుకునే వరకూ ప్రతిమూడు నెలలకొకసారి ఈ స్థాయి ఫైన్ వేసేందుకు సిద్ధమవుతోంది. అయితే.. గర్భంతో ఉన్న మహిళలు, ఇతర ఆరోగ్య కారణాల రీత్యా టీకా తీసుకోలేని వారి విషయంలో మాత్రం మినహాయింపు ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగానే ఉంది. ఈ మేరకు ఆస్ట్రియా ఆరోగ్య శాఖ మంత్రి తాజాగా ప్రభుత్వ ఆలోచనను ప్రజలకు ఓ ప్రకటనలో తెలియజేశారు. దీంతో.. ఇది ఆస్ట్రియాలో పెద్ద చర్చకే దారి తీసింది. తాజా లెక్కల ప్రకారం..ఆస్ట్రియా జనాభాలో దాదాపు 68 శాతం మంది పూర్తి స్థాయిలో(రెండు డోసులు) కరోనా టీకా తీసుకున్నారు. 

Updated Date - 2021-12-10T23:41:26+05:30 IST