Abn logo
Jul 24 2021 @ 18:26PM

ఆస్ట్రేలియాలో లాక్‌డౌన్‌పై నిరసనలు

సిడ్నీ : ఆస్ట్రేలియాలో కోవిడ్-19 కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం ఆంక్షలను పునరుద్ధరించింది. దీంతో వివిధ నగరాల్లో నిరసన వ్యక్తమవుతోంది. సిడ్నీ సహా అనేక నగరాల్లో శనివారం ప్రజలు వీథుల్లోకి వచ్చి లాక్‌డౌన్ ఆంక్షలను వ్యతిరేకించారు. రోడ్లపై బారికేడ్లను తోసేసి, ప్లాస్టిక్ సీసాలను, మొక్కలను విసిరేశారు. సిడ్నీలోని విక్టోరియా పార్క్ నుంచి సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని టౌన్ హాల్ వరకు పెద్ద ఎత్తున ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కోవిడ్-19 నిబంధనలను పట్టించుకోకుండా, కనీసం మాస్క్ ధరించకుండా వీరు వచ్చారు. తమకు స్వేచ్ఛ కావాలని నినాదాలు చేశారు. ‘‘ఫ్రీడం’’, ‘‘అన్‌మాస్క్ ది ట్రూత్’’ అనే నినాదాలతో ప్లకార్డులను ప్రదర్శించారు. 


నిరసనకారులు పోలీసులపైకి ప్లాస్టిక్ సీసాలు, ఇతర వస్తువులను విసరడంతో అనేక మందిని అరెస్టు చేశారు. ఈ నిరసనకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛ, శాంతియుత సమావేశం హక్కులను తాము గౌరవిస్తామని న్యూసౌత్ వేల్స్ పోలీసులు చెప్పారు. నిరసనకారులు ప్రజారోగ్యానికి సంబంధించిన ఆదేశాలను ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రజలందరి భద్రత, రక్షణకే తాము ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు.