ఇదెక్కడి ఆచారం.. షూలో డ్రింక్ పోసుకుని తాగిన ఆసీస్ ఆటగాళ్లు!

ABN , First Publish Date - 2021-11-15T23:14:31+05:30 IST

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా తొలి

ఇదెక్కడి ఆచారం.. షూలో డ్రింక్ పోసుకుని తాగిన ఆసీస్ ఆటగాళ్లు!

దుబాయ్: ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన ఆస్ట్రేలియా తొలి టీ20 ప్రపంచకప్‌ను తమ ఖాతాలో వేసుకుంది. విజయానంతరం ఆటగాళ్ల సంబరాలకు అంతేలేకుండా పోయింది. ఈ క్రమంలో వారు చేసిన ఓ పని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.


సంబరాల్లో భాగంగా తమ బూట్లను విప్పేసిన ఆటగాళ్లు వాటిలో డ్రింక్స్ పోసుకుని గటగటా తాగేశారు. ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాకయ్యారు. వారేం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. తేరుకోవడానికి వారికి చాలాసేపు పట్టింది. 


నిజానికి ఆస్ట్రేలియన్లకు ఇదొక ఆచారం. దీనిని ‘షూయి’ అంటారు. 18వ శతాబ్దంలో జర్మనీలో మొదలైంది. అయితే, ఆస్ట్రేలియాలో మాత్రం బాగా పాపులర్ అయింది. ఇటీవల ఆస్ట్రేలియన్ రైడర్ జాక్ మిల్లర్, ఫార్ములా వన్ డ్రైవర్ డేనియల్ రెకిర్డో ఇలా షూలో డ్రింక్స్ పోసుకుని తాగి అందరి దృష్టిని ఆకర్షించారు.


ఆ తర్వాత చాలామంది దీనిని అనుసరిస్తున్నారు. అయితే, ఇలా తాగడం చాలా ప్రమాదకరమని ఆస్ట్రేలియాకు చెందిన ఏబీసీ పత్రిక ఓ కథనాన్ని వెలువరించింది. బూట్లలో బ్యాక్టీరియాతోపాటు, ఇతర పరాన్న జీవులు ఉంటాయని, బూట్లలో ఆల్కహాల్ పోసుకుని తాగినప్పుడు దాంతోపాటు అవి పొట్టలోకి చేరుతాయని హెచ్చరించింది.



Updated Date - 2021-11-15T23:14:31+05:30 IST