బార్టీ x కొలిన్స్‌

ABN , First Publish Date - 2022-01-28T09:14:34+05:30 IST

సొంతగడ్డపై టైటిల్‌ దాహం తీర్చుకొనేందుకు ఆస్ట్రేలియా స్టార్‌ ఆష్లే బార్టీ అడుగు దూరంలో ఉంది.

బార్టీ x కొలిన్స్‌

టైటిల్ ఫైట్‌

సెమీస్‌లో స్వియటెక్‌కు షాక్‌

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌

నాలుగు దశాబ్దాల ఎదురుచూపులకు తెరదించడానికి టాప్‌ సీడ్‌ ఆష్లే బార్టీ ఒక్క మ్యాచ్‌ దూరంలో ఉంది. 42 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఫైనల్‌కు చేరిన తొలి స్థానిక మహిళా ప్లేయర్‌గా ఆష్లే బార్టీ నిలిచింది. బార్టీ ఈ టైటిల్‌ అందుకుంటే సొంతగడ్డపై క్రిస్‌ ఒనీల్‌ తర్వాత ట్రోఫీ సాధించిన రెండో క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది. మరోవైపు స్వియటెక్‌ను చిత్తుచేసిన కొలిన్స్‌ ఫైనల్లో బార్టీతో అమీతుమీకి సిద్ధమైంది.


మెల్‌బోర్న్‌: సొంతగడ్డపై టైటిల్‌ దాహం తీర్చుకొనేందుకు ఆస్ట్రేలియా స్టార్‌ ఆష్లే బార్టీ అడుగు దూరంలో ఉంది. ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో అద్భుత ప్రదర్శన చేస్తున్న టాప్‌ సీడ్‌ బార్టీ.. ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్‌ ఫైట్‌లో అమెరికాకు చెందిన డేనియల్‌ కొలిన్స్‌తో ఆష్లే అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్‌లో ఏడో సీడ్‌ ఇగా స్వియటెక్‌కు కొలిన్స్‌ షాకిచ్చి తుది పోరుకు చేరుకొంది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో బార్టీ 6-1, 6-3తో అన్‌సీడెడ్‌ మాడిసన్‌ కీస్‌ (అమెరికా)ను వరుస సెట్లలో ఓడించింది. ఈ క్రమంలో 1980లో వెండీ టర్న్‌బుల్‌ తర్వాత సొంతగడ్డపై గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరిన తొలి క్రీడాకారిణిగా నిలిచింది. 1978లో ఆస్ర్టేలియన్‌ ఓపెన్‌ నెగ్గిన క్రిస్‌ ఒనీల్‌ రికార్డుకు ఒక్క మ్యాచ్‌ దూరంలో ఉంది. గంటకుపైగా సాగిన పోరులో ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పైచేయి కనబర్చిన బార్టీ.. మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేసింది. తొలి సెట్‌ మొదటి గేమ్‌లోనే కీస్‌ సర్వీ్‌సను బ్రేక్‌ చేసిన బార్టీ 1-0తో ఘనంగా ఆరంభించింది. అదే జోరులో మరోసారి ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్‌ చేసి 6-1తో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక, రెండో సెట్‌లో కీస్‌ నుంచి పోటీ ఎదురైనా.. 4-2తో ముందంజ వేసిన ఆష్లే 6-3తో సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది. బార్టీ 20 విన్నర్లు కొడితే.. కీస్‌ 8 మాత్రమే వేసింది. 


కొలిన్స్‌ సంచలనం..:

అమెరికా ప్లేయర్‌ డేనియల్‌ కొలిన్స్‌ సంచలన విజయంతో తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌కు చేరుకొంది. 27వ సీడ్‌ కొలిన్స్‌ 6-4, 6-1తో స్వియటెక్‌ (పోలెండ్‌)పై అలవోకగా నెగ్గింది. తొలి సెట్‌ మొదటి మూడు గేమ్‌లోనే స్వియటెక్‌ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్‌ చేసిన కొలిన్స్‌ 3-0తో నిలిచింది. అయితే, స్వియటెక్‌ 4-5తో పోటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ, 10వ గేమ్‌లో సర్వీస్‌ను నిలబెట్టుకొన్న డేనియల్‌ 6-4తో సెట్‌ను సొంతం చేసుకుంది. ఇక, రెండో సెట్‌ను కూడా బ్రేక్‌ పాయింట్‌తో ఆరంభించిన కొలిన్స్‌.. ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా 6-1తో గెలిచి ఫైనల్లోకి అడుగుపెట్టింది. 7 ఏస్‌లు సంధించిన కొలిన్స్‌.. 27 విన్నర్లు కొట్టింది. మరోవైపు ఒక్క ఏస్‌ మాత్రమే వేసిన స్వియటెక్‌.. 12 విన్నర్లే కొట్టగలిగింది. ?

Updated Date - 2022-01-28T09:14:34+05:30 IST