ICC Women's World Cup: ఏడోసారి వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్!

ABN , First Publish Date - 2022-04-03T19:35:28+05:30 IST

ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 71 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది.

ICC Women's World Cup: ఏడోసారి వరల్డ్ కప్ గెలిచిన ఆసీస్!

క్రైస్ట్‌చర్చ్: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 71 పరుగుల తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ను ఓడించి విశ్వవిజేతగా నిలిచింది. దీంతో ఏడోసారి వరల్డ్‌కప్ గెలిచిన జట్టుగా ఆసీస్ నిలిచింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 357 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్‌  285 పరుగులకే కుప్పకూలింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన కంగారు జట్టుకు ఓపెనర్లు హీలీ(170), హేనెస్(68) శుభారంభం ఇచ్చారు. తొలి వికెట్‌కు ఈ ద్వయం ఏకంగా 160 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. ఆ తర్వాత గార్డ్నర్‌తో కలిసి హీలీ 156 పరుగులు జోడించింది. ఇలా వరుసగా రెండు భారీ భాగస్వామ్యాలు రావడంతో ఆసీస్‌కు ఎదురులేకుండా పోయింది. దాంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 356 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో అన్యా ష్రబ్సోల్ 3 వికెట్లు తీస్తే.. సోఫియాకు ఒక వికెట్ దక్కింది. 


అనంతరం 357 పరుగుల భారీ ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే ఆసీస్ బౌలర్లు భారీ దెబ్బ తీశారు. కేవలం 38 పరుగులకే ఓపెనర్లు ఇద్దరిని పెవిలియన్ చేర్చారు. ఆ తర్వాత కెప్టెన్ హీతర్, స్కీవర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో జట్టు స్కోర్ 86 పరుగుల వద్ద హీతర్(27) ఔటైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన జోన్స్(20), సోఫియా(22) కొద్దిసేపు ఆస్ట్రేలియా బౌలర్లను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే, ఒకవైపు వికెట్లు పడుతున్న మరోవైపు స్కీవర్‌ చక్కని ఇన్నింగ్స్ ఆడి శతకం(148) బాదింది. కానీ వరుస విరామాల్లో వికెట్లు పారేసుకున్న ఇంగ్లండ్ జట్టు 43.4 ఓవర్లలో 285 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో స్కీవర్‌ అజేయంగా 148 పరుగులు చేయడం విశేషం. ఆసీస్ బౌలర్లలో కింగ్, జాన్సెస్ తలో 3 వికెట్లు.. మెగాన్ రెండు.. మెగ్రాత్, గార్డ్నర్ చెరో వికెట్ పడగొట్టారు. 170 పరుగులు చేసిన ఆసీస్ బ్యాటర్ అలీస్సా హీలీ 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచింది. అలాగే టోర్నీ మొత్తంలో 509 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచి 'ప్లేయర్ ఆఫ్ ది సీరిస్' అవార్డు కూడా ఎగరేసుకుపోయింది హీలీ.    

Updated Date - 2022-04-03T19:35:28+05:30 IST