చైనా వెట్ మార్కెట్లు ప్రపంచానికి ముప్పు : ఆస్ట్రేలియా ప్రధాని

ABN , First Publish Date - 2020-04-03T22:05:22+05:30 IST

చైనాలోని వెట్ మార్కెట్లు ప్రపంచ ఆరోగ్యానికి, సంక్షేమానికి మహా ముప్పు అని ఆస్ట్రేలియా

చైనా వెట్ మార్కెట్లు ప్రపంచానికి ముప్పు : ఆస్ట్రేలియా ప్రధాని

మెల్‌బోర్న్ : చైనాలోని వెట్ మార్కెట్లు ప్రపంచ ఆరోగ్యానికి, సంక్షేమానికి మహా ముప్పు అని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ఆరోపించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ), ఐక్య రాజ్య సమితి (యూఎన్ఓ) వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. ప్రాణాంతక కరోనా వైరస్ వెట్ మార్కెట్‌లోనే ఆవిర్భవించిందని భావిస్తున్న నేపథ్యంలో వీటిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


చైనాలోని వూహన్‌లో ఉన్న ఓ వెట్ మార్కెట్‌లో కరోనా వైరస్ మహమ్మారి మొదలైందని అందరూ విశ్వసిస్తున్నారు. ఇది గత ఏడాది డిసెంబరులో మొదటిసారి కనిపించింది. ఇది జంతువుల నుంచి మనుషులకు సోకింది. వెట్ మార్కెట్లలో తాజా మాంసం, చేపలు, వాటి సంబంధిత ఉత్పత్తులు, త్వరగా పాడైపోయే వస్తువులు అమ్ముతారు. మాంసం, చేపలు వంటివాటిపై తరచూ నీళ్ళు పోస్తూ ఉండటం వల్ల ఈ మార్కెట్లలో నేల పూర్తిగా తడిగా ఉంటుంది. అందుకే వీటిని వెట్ మార్కెట్లు అంటారు.


ప్రధాని స్కాట్ మారిసన్ ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ చైనాలోని వెట్ మార్కెట్లు నిజంగా చాలా చాలా ముఖ్యమైన సమస్య అని తెలిపారు. అవి ఎక్కడ ఉన్నా పెను సమస్య అన్నది వాస్తవమని చెప్పారు. ఈ వైరస్ మొదట చైనాలో ప్రారంభమైందని, తర్వాత ప్రపంచాన్ని చుట్టేసిందని అన్నారు. ప్రపంచ ఆరోగ్యం దృష్ట్యా ఈ మార్కెట్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైనా చేయవలసిన అవసరం ఉందని తాను భావిస్తున్నట్లు తెలిపారు. 


మారిసన్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. అంతర్జాతీయ సంస్థలు తప్పనిసరిగా చైనా వెట్ మార్కెట్లపై దృష్టి సారించాలన్నారు. ఇది ప్రపంచానికి పెను సవాలు అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇతర అంతర్జాతీయ సంస్థలు కొంత సమయాన్ని వెచ్చించి, దృష్టి సారించవలసిన విషయమని తాను భావిస్తున్నానన్నారు. ఇటువంటి ప్రదేశాలు, కేంద్రాల వల్ల మిగిలిన ప్రపంచ ఆరోగ్యం, సంక్షేమాలకు ఎదురవుతున్న పెను ముప్పు మనకు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. 


ఆస్ట్రేలియా ప్రకటించిన తాజా వివరాల ప్రకారం నమోదైన కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 5,358 కాగా, 28 మంది ప్రాణాలు కోల్పోయారు.


Updated Date - 2020-04-03T22:05:22+05:30 IST