Abn logo
Sep 21 2021 @ 16:33PM

Australia vs India: చిత్తుగా ఓడిన టీమిండియా

మాకే: ఆస్ట్రేలియాతో ఇక్కడి హరప్ పార్క్‌లో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు దారుణంగా ఓడిపోయింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేశారు. 226 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా మరో 9 ఓవర్లు  మిగిలి ఉండగా ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. రేచల్ హేన్స్ అజేయంగా 93 పరుగులు చేయగా, అలిస్సా హీలీ 77, కెప్టెన్ మెగ్ లానింగ్ 53 (నాటౌట్) పరుగులు చేసి జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించారు. వన్డేల్లో ఆస్ట్రేలియాకు ఇది వరుసగా 25వ విజయం. 


అంతకుముందు భారత జట్టు ఇన్నింగ్స్ పడుతూ లేస్తూ సాగింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 107 బంతుల్లో 3 ఫోర్లతో 63 పరుగులు చేయగా, యస్తికా భాటియా 35, వికెట్ కీపర్ రిచా ఘోష్ 32, గోస్వామి 20 పరుగులు చేశారు. మిగతా వారిలో ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. కాగా, ఈ మ్యాచ్‌తో మిథాలీ రాజ్ తన కెరియర్‌లో 20 వేల పరుగులు పూర్తిచేసుకుంది. అంతేకాదు, ఈ మ్యాచ్‌లో 63 పరుగులు చేసిన మిథాలీకి వన్డేల్లో ఇది వరుసగా ఐదో అర్ధ సెంచరీ. అంతకుముందు ఆమె 75 (నాటౌట్), 59, 72 (ఇంగ్లండ్‌పై), 79 (సౌతాఫ్రికాపై) పరుగులు చేసింది. కాగా, ఈ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీసి భారత ఇన్నింగ్స్‌ను దెబ్బకొట్టిన డార్సీ బ్రౌన్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

ఇవి కూడా చదవండిImage Caption