Abn logo
Jan 13 2021 @ 21:34PM

ఐపీఎల్ వల్లే ఆసీస్ టూర్లో గాయాలట!

సిడ్నీ: ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్లో ఉన్న భారత జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. గాయాల కారణంగా ఇరు జట్లకు సంబంధించిన చాలా మంది ఆటగాళ్లు సిరీస్‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఈ తరుణంలో సిరీస్‌లో వెలుగు చూస్తున్న గాయాలకు ఐపీఎల్ కారణం అయ్యుండొచ్చని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ అభిప్రాయపడ్డారు. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆలస్యంగా జరిగిన ఐపీఎల్ 13వ సీజన్.. ఇరు జట్లలోని చాలా మంది ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై ప్రభావం చూపి ఉండొచ్చని లాంగర్స్ అన్నాడు. ‘‘ఐపీఎల్ జరిగిన టైమింగ్ సరిగా లేదని అనుకుంటున్నా. ప్రస్తుతం మనం చూస్తున్న గాయాలపై దాని ప్రభావం ఉందేమో అని భావిస్తున్నా’’ అని లాంగర్స్ పేర్కొన్నాడు.


గాయాల కారణంగా మన జట్టులో స్టార్ ప్లేయర్లు చాలా మంది సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే. స్టార్ పేసర్లు మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, ఉమేష్ యాదవ్ ఇప్పటికే సిరీస్ నుంచి తప్పుకున్నారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ కూడా గాయాలతో బాధ పడుతున్నారు. తాజాగా మూడో టెస్టు హీరోలు ఛటేశ్వర్ పుజారా, రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారి, రిషభ్ పంత్ కూడా గాయాల పాలై నాలుగో టెస్టుకు అనుమానంగా మారారు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా బొటన వేలి గాయంతో నాలుగో టెస్టుకు దూరమైన విషయం తెలిసిందే. 


ఆస్ట్రేలియా జట్టులో కూడా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయం కారణంగా తొలి వన్డేకు, మూడు టీ20లకు దూరమయ్యాడు. తొలి రెండు టెస్టులకు కూడా దూరమైన వార్నర్.. మూడో టెస్టులో ఆడినా, పూర్తి ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించలేదు. ఈ క్రమంలో లాంగర్స్.. ఐపీఎల్ ప్రభావం ఉండొచ్చని చెప్పడం ప్రస్తుతం నెట్టింట్లో పెద్ద దుమారమే రేపుతోంది.

Advertisement
Advertisement
Advertisement