నటరాజన్ ఫిక్సింగ్ చేశాడా..? షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-01-21T16:11:30+05:30 IST

టీమిండియా బౌలర్ నటరాజన్‌ ఫిక్సింగ్‌కు పాల్డడ్డాడనే అనుమానం కలుగుతోందంటూ ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వార్న్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. భారత బౌలర్ తంగరసు నటరాజన్ వేసిన నో బాల్స్‌పై తనకు..

నటరాజన్ ఫిక్సింగ్ చేశాడా..? షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు

కాన్‌బెర్రా: టీమిండియా బౌలర్ నటరాజన్‌ ఫిక్సింగ్‌కు పాల్డడ్డాడనే అనుమానం కలుగుతోందంటూ ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వార్న్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. భారత బౌలర్ తంగరసు నటరాజన్ వేసిన నో బాల్స్‌పై తనకు అనుమానాలున్నాయంటూ  వార్న్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాబా పిచ్‌లో జరిగిన నాలుగో టెస్టులో నటరాజన్ మొత్తం 7 నో బాల్స్ వేశాడని, వాటవల్ల ఆసీస్‌కు 6 పరుగులు లభించాయని వార్న్ అన్నాడు. అయితే ఆ నోబాల్స్ వేసే సమయంలో నటరాజన్ అడుగులు క్రీజు నుంచి చాలా దూరంగా పడ్డాడని, అదే తనకు అనుమానం కలిగిస్తోందని వార్న్ పేర్కొన్నాడు. అతడు వేసిన ప్రతి ఓవర్ తొలి బంతినే నోబాల్‌గా వేయడం మరింత అనుమానానికి తావిస్తోందని, మొత్తం నో బాల్స్‌లో 5 నోబాల్స్‌ ఇలానే వేశాడని,. వాటిని గమనిస్తే నటరాజన్ కావాలనే ఈ రకంగా నో బాల్స్ వేశాడేమో అనే అనుమానం కలుగుతోందని వార్న్ అభిప్రాయపడ్డాడు.


 ‘నటరాజన్ బౌలింగ్‌పై నాకు కొన్ని అనుమానాలున్నాయి. నటరాజన్ మొత్తం 7 నోబాల్స్ వేశాడు. ప్రతి నోబాల్ వేసేపట్టపుడు నటరాజన్ క్రీజుకు చాలా దూరంగా అడుగు వేశాడు. మేం అందరం కూడా నో బాల్స్ వేశాం. కానీ నటరాజన్ వేసిన నోబాల్స్‌లో 5 నోబాల్స్ ఓవర్ తొలి బంతే కావడం విచిత్రం’ అని వార్న్ అన్నాడు. 


ఇదిలా ఉంటే వార్న్ వ్యాఖ్యలపై భారతీయ క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆధారాలు లేకుండా, ఏ మాత్రం బాధ్యత లేకుండా వార్న్ ఆరోపణలు చేస్తున్నాడంటూ భారత క్రికెట్ ఫ్యాన్ అనేకమంది అతడిపై మండిపడ్డారు. ‘హేయ్ ముసలోడా.. టీమిండియా ఆటగాళ్లపై వేలెత్తి చూపడం మానుకో. భారత్‌కు తొలి సారిగా ఎంపికైన ఆటగాడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండు ఆలోచించుకో..’ అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 


మరో నెటిజన్ అయితే మరో అడుగు ముందుకేసి.. ‘నీకు, నీ తోటి ఆటగాళ్లు అనేకమందికి ఆటలోనే కాకుండా, బయట కూడా చెత్త పేరుంది. అలాంటి చెత్త బుద్ధితోనే భారతీయ క్రికెటర్ల గురించి ఆలోచించకండి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొకరైతే ‘ముందు మీ జట్టు సభ్యులకు సభ్యత నేర్పించు. గ్రౌండ్‌లో ప్రత్యర్థులతో ఎలా గౌరవంగా మెలగాలో నేర్పించుకో. ఆ తరువాత భారత క్రికెటర్ల విషయంలో మాట్లాడు. నటరాజన్ ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో నీకేం తెలుసు. అతడి పట్టుదల, కృషితో ఈ స్థాయికి చేరి అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటుతున్నాడు. అతడిపై ఆరోపణలు చేసే ముందు ఈ విషయాలు తెలుసుకో’ అంటూ కౌంటర్ ఇచ్చాడు.

Updated Date - 2021-01-21T16:11:30+05:30 IST