మాల్దీవులకు ఆసీస్‌ బృందం

ABN , First Publish Date - 2021-05-07T10:18:24+05:30 IST

ఐపీఎల్‌ వాయిదా పడడంతో విదేశీ క్రికెటర్లంతా స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు.

మాల్దీవులకు ఆసీస్‌ బృందం

న్యూఢిల్లీ: ఐపీఎల్‌ వాయిదా పడడంతో విదేశీ క్రికెటర్లంతా స్వస్థలాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఇందులో భాగంగా ఆటగాళ్లు, ఇతర సిబ్బందితో కూడిన 40 మంది సభ్యుల ఆసీస్‌ బృందం గురువారం మాల్దీవులు చేరుకుంది. కాగా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు స్వదేశానికి బయలుదేరగా, న్యూజిలాండ్‌ క్రికెటర్లు శుక్రవారం వెళ్లనున్నారు. కొవిడ్‌ దృష్ట్యా భారత్‌ నుంచి రాకపోకలపై ఈనెల 15 వరకు ఆస్ట్రేలియా ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధించిన విధించిన సంగతి తెలిసిందే. దీంతో తమ ఆటగాళ్లతో పాటు సిబ్బంది మాల్దీవులు చేరుకున్నారనీ, ఆసీస్‌ వచ్చేందుకు అనుమతి లభించేదాకా అక్కడే ఉంటారని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) ప్రకటించింది.


భారత ప్రయాణాలపై దక్షిణాఫ్రికా ఎటువంటి ఆంక్షలు విధించకపోవడంతో మొత్తం 11 మంది సఫారీ ఆటగాళ్లు జొహాన్నెస్‌బర్గ్‌ వెళ్లే విమానాల్లో పయనమయ్యారు. న్యూజిలాండ్‌ టెస్ట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సహా నలుగురు టెస్ట్‌ ఆటగాళ్లు ఈనెల 11న నేరుగా లండన్‌ వెళ్లనుండగా.. మిగతా వారు ఈ నెల 7న స్వదేశానికి వెళ్లనున్నట్టు న్యూజిలాండ్‌ క్రికెట్‌ తెలిపింది. విలియమ్సన్‌, పేసర్‌ కైల్‌ జేమిసన్‌, స్పిన్నర్‌ శాంట్నర్‌తోపాటు ఫిజియో టామీ సీమెక్‌ లండన్‌ బయల్దేరే వరకు ఢిల్లీలోనే మినీ బయోబబుల్‌లో ఉండనుండగా.. కివీస్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ స్వదేశం వెళ్లనున్నాడు. 


హస్సీ, బాలాజీని ఎయిర్‌ అంబులెన్స్‌లో:

కరోనా బారినపడిన చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాటింగ్‌ కోచ్‌ మైక్‌ హస్సీ, బౌలింగ్‌ కోచ్‌ లక్ష్మీపతి బాలాజీని ఎయిర్‌ అంబులెన్స్‌లో ఢిల్లీ నుంచి చెన్నైకి తరలించారు. ‘హస్సీ, బాలాజీ ఇద్దరికీ ఎలాంటి కొవిడ్‌ లక్షణాలు లేవు. అయినా, చెన్నైలో మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించగలమనే ఉద్దేశంతోనే తరలించాం’ అని సీఎ్‌సకే అధికారి ఒకరు తెలిపాడు. 

Updated Date - 2021-05-07T10:18:24+05:30 IST