మహిళల ప్రపంచకప్.. చివరి వరకు పోరాడి ఓడిన భారత్

ABN , First Publish Date - 2022-03-19T21:27:38+05:30 IST

ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నేడు జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు చివరి ఓవర్ వరకు పోరాడి ఓడింది.

మహిళల ప్రపంచకప్.. చివరి వరకు పోరాడి ఓడిన భారత్

ఆక్లాండ్: ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నేడు జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు చివరి ఓవర్ వరకు పోరాడి ఓడింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు యస్తిక భాటియా (59), కెప్టెన్ మిథాలీ రాజ్ (68), హర్మన్ ప్రీత్ కౌర్ (57, నాటౌట్) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 277 పరుగులు భారీ స్కోరు సాధించింది. 


అనంతరం 278 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్‌ బ్యాటర్లపై భారత బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు. చెమటోడ్చినప్పటికీ వికెట్లు పడగొట్టడంలో విఫలమయ్యారు. ఎలాంటి తొట్రుపాటు లేకుండా జోరుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ విజయం దిశగా దూసుకెళ్లింది. ఓపెనర్లు రేచల్ హేన్స్ (43), అలీసా హేలీ (72) తొలి వికెట్‌కు 121 పరుగులు జోడించి మంచి పునాది వేశారు. అలీసా హేలీ (72), ఎల్లీస్ పెర్రీ (28) పరుగులు చేశారు.


మరీ ముఖ్యంగా కెప్టెన్ మెగ్ లానింగ్ అద్భుత ఆటతీరుతో జట్టును ముందుండి నడిపించింది. 97 పరుగుల వద్ద మేఘనా సింగ్‌కు దొరికిపోయి మూడు పరుగుల తేడాతో సెంచరీ చేజార్చుకుంది. ఆమె అవుటైన తర్వాత మ్యాచ్ కొంత ఉత్కంఠగా మారింది. విజయం భారత్‌వైపు మొగ్గింది. చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 6 బంతుల్లో 8 పరుగులు అవసరం కావడం, ఆసీస్ వికెట్ కోల్పోయిన ఒత్తిడిలో ఉండడంతో భారత్ విజయం తప్పదని భావించారు. దీనికితోడు చివరి ఓవర్ అనుభవజ్ఞురాలైన జులన్ గోస్వామి వేస్తుండడంతో ఆశలు మరింత ఎక్కువయ్యాయి.


అయితే, క్రీజులో ఉన్న బెత్ మూనీ తొలి బంతినే బౌండరీకి తరలించి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకుంది. ఆ తర్వాతి బంతికి రెండు పరుగులు పిండుకున్న మూనీ.. మూడో బంతికి ఫోర్ కొట్టి జట్టును సెమీస్‌కు చేర్చింది. భారత అభిమానులకు ఆశాభంగమైంది. ఆడిన ఐదు మ్యాచుల్లోనూ విజయం సాధించిన ఆస్ట్రేలియా 10 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, ఐదు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలు మాత్రమే సొంతం చేసుకున్న భారత్ నాలుగు పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. అద్భుత బ్యాటింగ్‌తో జట్టును సెమీస్‌కు చేర్చిన ఆసీస్ కెప్టెన్ మెగ్ లానింగ్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

Updated Date - 2022-03-19T21:27:38+05:30 IST