అరబిందో ఫార్మా లాభం రూ.520 కోట్లు

ABN , First Publish Date - 2022-08-12T09:52:54+05:30 IST

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికాని (క్యూ1)కి అరబిందో ఫార్మా రూ.520.5 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది.

అరబిందో ఫార్మా లాభం   రూ.520 కోట్లు

క్యూ1లో 32% తగ్గిన ప్రాఫిట్‌ జూ ఆదాయం రూ.6,236 కోట్లు


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికాని (క్యూ1)కి అరబిందో ఫార్మా రూ.520.5 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.770 కోట్లతో పోలిస్తే 32.4 శాతం తగ్గినట్లు కంపెనీ వెల్లడించింది. కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం 9.4 శాతం  పెరిగి రూ.5,702 కోట్ల నుంచి రూ.6,236 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయంలో పరిశోధన, అభివృద్ధిపై చేసిన ఖర్చు వాటా కూడా ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే సమీక్షా త్రైమాసికానికి 6.3 శాతం నుంచి 5 శాతానికి పరిమితమైంది. జూన్‌ త్రైమాసికంలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌ అండ్‌ డీ)కి కంపెనీ రూ.310 కోట్లు వెచ్చించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా సంతృప్తికర ఫలితాలను ప్రకటించగలిగినట్లు అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కే నిత్యానంద రెడ్డి తెలిపారు. స్పెషాలిటీ ఔషధాల అభివృద్ధిపై కంపెనీ దృష్టి భవిష్యత్తు వృద్ధికి దోహదం చేయగలదన్నారు. 


ఫార్ములేషన్ల విక్రయాలు

త్రైమాసిక సమీక్షా కాలంలో ఫార్ములేషన్ల విక్రయాలు 9 శాతం వృద్ధితో రూ.4,890 కోట్ల నుంచి రూ.5,329 కోట్లకు చేరాయి. అమెరికాలో ఫార్ములేషన్ల విక్రయాలు 10.8 శాతం పెరిగి రూ.2,681 కోట్ల పెంచి రూ2,971 కోట్లకు పెరిగాయి. వర్థమాన మార్కెట్లలో ఫార్ములేషన్ల విక్రయాల్లో అత్యధిక వృద్ధి నమోదైంది. ఈ మార్కెట్లలో ఫార్ములేషన్ల విక్రయాలు 31 శాతం పెరిగి రూ.430.6 కోట్లకు చేరాయి. అమెరికా ఫార్ములేషన్ల మార్కెట్లోకి గత త్రైమాసికంలో కంపెనీ 5 ఇంజెక్టబుల్స్‌తో సహా మొత్తం 7 ఔషధాలను విడుదల చేసింది. 


యూగియా పునర్‌ వ్యవస్థీకరణ ప్రతిపాదన వాయిదా

ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అనుబంధ సంస్థ యూగియా ఫార్మా స్పెషాలిటీస్‌ లిమిటెడ్‌ను పునర్‌వ్యవస్థీకరించే/వేరు చేసే ప్రతిపాదనను కంపెనీ బోర్డు వాయిదా వేసింది. స్వతంత్ర డైరెక్టర్‌ కమిటీ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అరబిందో వెల్లడించింది. వాటాదారుల విలువను పెంచే అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదనను పక్కన పెట్టినట్లు తెలిపింది. భవిష్యత్తులో తగిన సమయంలో ఈ ప్రతిపాదనను బోర్డు మళ్లీ పరిశీలిస్తుందని పేర్కొంది. యూగియా ఫార్మా అంకాలజీ స్టెరైల్‌/ఇంజెక్టబుల్స్‌, హార్మోనల్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది.  

Updated Date - 2022-08-12T09:52:54+05:30 IST