ఔరా..మీరా!

ABN , First Publish Date - 2022-07-31T08:36:45+05:30 IST

అంచనాలను నిలబెట్టుకుంటూ కామన్వెల్త్‌ క్రీడల్లో భారత లిఫ్టర్లు అదిరిపోయే బోణీ కొట్టారు.

ఔరా..మీరా!

కామన్వెల్త్‌ క్రీడల రెండోరోజే భారత్‌ పతక బోణీ చేసింది.. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా మూడు పతకాలు కొల్లగొట్టింది.. వీటిలో స్వర్ణ పతకాన్ని లిఫ్టింగ్‌ క్వీన్‌, 27 ఏళ్ల మణిపురి ముత్యం మీరాబాయి చాను సాధించింది. మహిళల 49 కిలోల విభాగంలో పలు రికార్డులను తిరగ రాసిన ఆమె ఈసారి గేమ్స్‌లో మనకు తొలి పసిడి పతకం అందించింది..తోటి లిఫ్టర్లంతా నిర్ణీత బరువులెత్తేందుకే ఆపసోపాలు పడిన వేళ ఈ కేటగిరిలో డిఫెండింగ్‌ చాంపియన్‌ మీరాబాయి లక్ష్యం మేర అలవోకగా బరువులెత్తి కామన్వెల్త్‌ టైటిల్‌ను నిలబెట్టుకుంది.. అంతకుముందు మరో ఇద్దరు లిఫ్టర్లు సంకేత్‌ సర్కార్‌, గురురాజ పుజారి రజత, కాంస్యాలతో భారత శిబిరంలో ఆనందోత్సాహాలు నింపారు.


రికార్డులతో హోరెత్తించిన చాను

స్వర్ణం సాధించిన మణిపురి

ముత్యంమూడు పతకాలతో 

దుమ్మురేపిన లిఫ్టర్లు

సంకేత్‌కు రజతం..పూజారాకు కాంస్యం

కామన్వెల్త్‌ క్రీడలు


బర్మింగ్‌హామ్‌: అంచనాలను నిలబెట్టుకుంటూ కామన్వెల్త్‌ క్రీడల్లో భారత లిఫ్టర్లు అదిరిపోయే బోణీ కొట్టారు. శనివారంనాడు స్వర్ణ, రజత, కాంస్య పతకాలతో ముచ్చటగా మూడు పతకాలు సాధించారు. మహిళల 49 కిలోల విభాగంలో గత క్రీడల విజేత మీరాబాయి చాను తన పసిడి పతకాన్ని నిలబెట్టుకొంది. పురుషుల 55 కిలోలలో రజతంతో సంకేత్‌ సర్గార్‌ పతక ఖాతా తెరవగా.. అనంతరం 61 కేజీలలో గురురాజ పూజారి కాంస్యంతో రెండో పతకాన్ని అందించాడు.


రికార్డులు ఉఫ్‌..: 49 కి. కేటగిరిలో స్వర్ణం గెలిచే క్రమంలో టోక్యో ఒలింపిక్స్‌  రజత పతక విజేత మీరాబాయి నాలుగు రికార్డులను అలవోకగా తుడిచిపెట్టివేసింది. పోటీ ఆసాంతం అత్యంత ఆత్మవిశ్వాసంతో కనిపించిన ఆమె స్నాచ్‌లో 88 కేజీలు, క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 113 కిలోలతో మొత్తం 201 కేజీల బరువెత్తి మరోసారి కామన్వెల్త్‌ చాంపియన్‌గా ఆవిర్భవించింది. స్నాచ్‌లో తొలి ప్రయత్నంలో 84 కిలోలు ఎత్తిన భారత లిఫ్టర్‌ రెండో ప్రయత్నంలో 88 కేజీలను సులువుగా లిప్ట్‌ చేసింది.


 దాంతో తన వ్యక్తిగతతోపాటు జాతీయ రికార్డును సమం చేసింది. అలాగే కామన్వెల్త్‌ చాంపియన్‌షి్‌ప, కామన్వెల్త్‌ గేమ్స్‌ రికార్డును నమోదు చేసింది. మూడో ప్రయత్నంలో 90 కిలోలకు గురిపెట్టిన చాను సఫలం కాలేకపోయింది. స్నాచ్‌ ముగిశాక సమీప ప్రత్యర్థులకంటే చాను ఏకంగా 12కిలోల ఆధిక్యంతో తిరుగులేని స్థానంలో నిలిచింది. ఇక క్లీన్‌ అండ్‌ జెర్క్‌ తొలి ప్రయత్నంలో 109 కిలోలు ఎత్తిన మీరాబాయి రెండో ప్రయత్నంలో 113 కేజీలను అలవోకగా లిఫ్ట్‌ చేసింది.  దాంతో ఆమె కామన్వెల్త్‌ క్రీడల కొత్త రికార్డు సృష్టించింది. మూడో యత్నంలో 115 కిలోలు లక్ష్యం పెట్టుకున్నా..ఆ బరువును ఎత్తలేకపోయింది. ఇక 201 కిలోల టోటల్‌తో ఆమె కామన్వెల్త్‌ గేమ్స్‌ నయా రికార్డుతో పసిడి పతకం చేజిక్కించుకుంది. కామన్వెల్త్‌ క్రీడల్లో చానుకిది మూడో పతకం. గ్లాస్గోలో రజతం, గోల్డ్‌కో్‌స్టలో స్వర్ణం నెగ్గింది. మొత్తం 172 కేజీలతో (76+96కె.) మారిష్‌సకు చెందిన మారి హనిట్రా రజతం అందుకుంది. కెనడా లిఫ్టర్‌ హనా మొత్తం 171 కిలోలు (74+97కి.) కాంస్య పతకం దక్కించుకుంది. 


కేజీలో స్వర్ణం మిస్‌..: స్వర్ణ పతకమే లక్ష్యంగా బరిలో దిగిన మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల సంకేత్‌ క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 139 కిలోలు ఎత్తే క్రమంలో గాయపడ్డాడు. కుడి ముంజేతి గాయం కావడంతో అతడు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మొత్తం 248 కేజీలు (113కి.+135కి.) ఎత్తిన సాకేత్‌ పసిడి పతకాన్ని కేవలం ఒక కిలో తేడాతో కోల్పోయాడు. మలేసియాకు చెందిన మమ్మద్‌ అనిఖ్‌ 249 కిలోల బరువెత్తి కామన్వెల్త్‌ క్రీడల రికార్డు(107కి.+142కి.)తో స్వర్ణం ఎగరేసుకుపోయాడు. శ్రీలంక లిఫ్టర్‌ దిలంక ఇసురు కుమార మొత్తం 225 కి. (105కి.+120కి.) బరువుతో కాంస్య పతకం నెగ్గాడు. 


భళా..గురురాజ: పురుషుల 61 కి. కేటగిరీలో మొత్తం 269 కేజీలు (118కి.+151కి.) లిఫ్ట్‌ చేసిన కర్ణాటక లిఫ్టర్‌ గురురాజ పూజారి కాంస్యం చేజిక్కించుకున్నాడు. గత గోల్డ్‌కోస్ట్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో 56కి. విభాగంలో అతడు రజత పతకం సాధించడం విశేషం. అజ్నిల్‌ బిన్‌ (మలేసియా, 127+158=285కి.) గేమ్స్‌ రికార్డుతో స్వర్ణం, మోరియా బారు (పపువా న్యూగినీ, 121+152=273కి.) రజతం గెలిచారు.

Updated Date - 2022-07-31T08:36:45+05:30 IST