మయన్మార్ పదవీచ్యుత ప్రధాని ఆంగ్‌సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు

ABN , First Publish Date - 2022-01-11T00:19:46+05:30 IST

మయన్మార్ పదవీచ్యుత ప్రధాని ఆంగ్‌సాన్ సూకీకి ఆ దేశ కోర్టు మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. వాకీ టాకీలను

మయన్మార్ పదవీచ్యుత ప్రధాని ఆంగ్‌సాన్ సూకీకి మరో నాలుగేళ్ల జైలు

నేపిటౌ: మయన్మార్ పదవీచ్యుత ప్రధాని ఆంగ్‌సాన్ సూకీకి ఆ దేశ కోర్టు మరో నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. వాకీ టాకీలను అక్రమంగా దిగుమతి చేసుకుని కలిగి ఉండడం, కరోనా వైరస్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి అభియోగాలు ఎదుర్కొంటున్న సూకీని దోషిగా తేల్చిన కోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించినట్టు మయన్మార్ ప్రభుత్వం తెలిపింది. ఆమెపై నమోదైన రెండు అభియోగాల్లో దోషిగా తేల్చిన కోర్టు గత నెలలో నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఇప్పుడు మరో నాలుగేళ్ల శిక్ష పడింది. 


గతేడాది ఫిబ్రవరిలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేసి అధికారాన్ని కైవసం చేసుకున్న సైన్యం నోబుల్ శాంతి బహుమతి విజేత అయిన 76 ఏళ్ల సూకీకి వ్యతిరేకంగా దాదాపు డజను కేసులు మోపింది. అధికార నేషనల్ లీగ్ ఫర్ డెమొక్రసీ పార్టీ సభ్యులను అరెస్ట్ చేసి జైలుకు పంపింది. సూకీపై మోపిన అన్ని అభియోగాలు రుజువైతే కనుక 100 సంవత్సరాల కంటే ఎక్కువగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఆమెపై మోపిన అభియోగాలను చట్టబద్ధం చేయడం ద్వారా తిరిగి రాజకీయాల్లోకి రాకుండా కుట్ర పన్నుతున్నారని సూకీ మద్దతుదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  


2020లో జరిగిన ఎన్నికల్లో సూకీ పార్టీ ఘన విజయం సాధించింది. అయితే, మిలిటరీ మాత్రం ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వస్తోంది. ఈ క్రమంలో గతేడాది సూకీని పదవీచ్యుతురాలిని చేసి అధికారాన్ని చేజిక్కించుకుంది. కాగా, కోర్టు విచారణకు సూకీ కోర్టు దుస్తుల్లోనే హాజరయ్యారు.

Updated Date - 2022-01-11T00:19:46+05:30 IST