ఆగస్టు 16.. డెడ్‌లైన్‌

ABN , First Publish Date - 2022-05-25T09:14:21+05:30 IST

‘గుంటూరు నడిబొడ్డున మహ్మద్‌ అలీ జిన్నా పేరు వినపడటం ఈ దేశానికి అవమానం.

ఆగస్టు 16.. డెడ్‌లైన్‌

జిన్నా టవర్‌ పేరు మారుస్తారా.. లేదా?

ఆతర్వాత కూల్చేస్తే మాకు సంబంధం లేదు

బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ హెచ్చరిక

గుంటూరులో బీజేవైఎం ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు


గుంటూరు (సంగడిగుంట) మే 24: ‘గుంటూరు నడిబొడ్డున మహ్మద్‌ అలీ జిన్నా పేరు వినపడటం ఈ దేశానికి అవమానం. ఆగస్టు 16వ తేదీలోపు ఆ టవర్‌ పేరు మారిస్తే సరి. లేదంటే ఆతర్వాత దాన్ని కూల్చేస్తే బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు’ అని బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ హెచ్చరించారు. గుంటూరులో మంగళవారం భారతీయ యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సత్యకుమార్‌ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన 75 ఏళ్ల తర్వాత కూడా జిన్నా వంటి దుర్మార్గుడి స్మారక చిహ్నం ఇక్కడ ఉండటం అవమానకరంగా భావిస్తున్నామన్నారు. రంగులు మారిస్తే ఆత్మలు శాంతించవని, దాని పేరు కలాం లేదా జాషువా లేదా అమీద్‌లలో ఏదైనా పెట్టుకోమని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. అనంతరం బీజేవైఎం కార్యకర్తలు జిన్నాటవర్‌ వరకు ర్యాలీకి సన్నద్ధమయ్యారు. వారి ర్యాలీని శంకర్‌విలాస్‌ సెంటర్‌ వరకే పోలీసులు అనుమతించారు. అక్కడ ర్యాలీని అడ్డుకున్న పోలీసులకు, కార్యకర్తలకు, మధ్య తోపులాట జరిగింది. సత్యకుమార్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. శంకర్‌విలాస్‌ సెంటర్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంటున్న సమయంలోనే మహిళా మోర్చా నేతలు వేరే దారిలో వెళ్లి జిన్నాటవర్‌ ఫెన్సింగ్‌కు బీజేపీ జెండా కట్టారు. దానిని పోలీసులు వెంటనే తొలగించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వైసీపీ పాలన సాగుతోందని సత్యకుమార్‌ ధ్వజమెత్తారు. ఇగోయిజం, శాడిజం, ఫ్యాక్షనిజం కలిపితే జగన్‌ వచ్చారని కన్నా లక్ష్మీనారాయణ బీజేవైఎం సమావేశంలో విమర్శించారు. ఏపీలో జగన్‌ లిమిటెడ్‌ కంపెనీలు తప్ప.. ఎవ్వరూ వ్యాపారం చేసే పరిస్థితి లేదన్నారు. ఇసుక, గనులు, మద్యం వ్యాపారాలతో సంపదను ఏకీకృతంగా దోచుకుంటున్నారని విమర్శించారు.

Updated Date - 2022-05-25T09:14:21+05:30 IST