పంద్రాగస్టుకు...పట్టాలందేనా?

ABN , First Publish Date - 2020-08-11T15:20:02+05:30 IST

సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం..

పంద్రాగస్టుకు...పట్టాలందేనా?

ఇళ్ల పట్టాల కోసం నిరుపేదల ఎదురుచూపులు

మండలాల్లో సిద్ధమవుతున్న లేఅవుట్లు

ప్రభుత్వం నుంచి స్పష్టత రావాలంటున్న అధికారులు

నాల్గోసారి అయినా పంపిణీ జరిగేనా..


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మూడుసార్లు వాయిదా పడి నాల్గోసారి ఆగస్టు 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రోజున పంపిణీ చేసేం దుకు నిర్ణయించినప్పటికీ ఇంకా సందిగ్ధం వీడలేదు. కన్వేయన్స్‌ డీడ్‌ల పంపిణీ విషయంలో సుప్రీంకోర్టులో ఇప్పటికే కేసు పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇంకా కోర్టులో ఆ వివాదం కొనసాగుతూనే ఉంది. దీనికితోడు రాష్ట్రంలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతోంది. దీంతో జిల్లాలో ఇళ్లపట్టాల పంపిణీకి సంబంధించి భూసేకరణ, లేఅవుట్ల ఏర్పాటు, లబ్ధిదారుల ఎంపిక వంటి కార్యక్రమాలు మందకొడిగా సాగుతున్నాయి.


నవరత్నాల పథకం అమలులో భాగం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 28 లక్షల మంది నిరుపేదలకు పట్టాలు పంపిణీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఈ ఏడాది మార్చి 25 ఉగాదినాడు పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ కరోనా వ్యాప్తి, భూము లు సిద్ధంగా లేకపోవడం వంటి కారణాలతో ఏప్రిల్‌ 14 అంబేడ్కర్‌ జయంతి రోజున పంపిణీ చేసేందుకు వాయిదా వేశారు. తదుపరి జూలై 8న వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి జయంతి రోజున పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ వాయిదా అనివార్యమైంది. ముఖ్యంగా పేదలకు పంపిణీచేసే ఇళ్లస్థల పట్టాలను ఐదేళ్ల తరువాత విక్రయించుకునే రీతిలో పట్టాను రిజిస్ర్టేషన్‌ చేయడానికి తహశీల్దార్లకే అధికారులు ఇస్తూ ఫిబ్ర వరి 12న జారీ అయిన జీవో నంబరు 44ను హైకోర్టు సస్పెం డ్‌ చేసింది. దీంతో పలు జీవోల మనుగడ ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్‌ చేసింది. ఈ నిబంధనలపై మరో పిల్‌ కూడా దాఖలైంది. అయితే సుప్రీంకోర్టులో ప్రభుత్వం వేసిన కేసు ఇంకా విచారణ కొనసాగుతోంది.


అయితే ప్రభుత్వం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోను ఆగస్టు 15న ఇళ్లస్థల పట్టాలు పంపిణీ చేయాలని కృతనిశ్చయంతో రెవెన్యూ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఆయా తహశీల్దార్‌ కార్యాలయాల పరిధిలో ఆగస్టు 15 నాటికి రెండు, మూడు లేఅవుట్లనైనా పక్కాగా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. మిగిలిన లేఅవుట్ల అభివృద్ధి, పంపిణీలు సాఫీగా చేయవచ్చనే ఆలోచనలో రెవెన్యూ అధికారులు ఉన్నారు. దీనిలో భాగంగా జిల్లావ్యాప్తంగా 5 వేల ఎకరాలకు పైగా ఇళ్లస్థల పట్టాల కోసం భూములను సేకరించి 1,667 లేఅవుట్లను సిద్ధం చేయా లని నిర్ణయించారు. గ్రామీణ, పట్టణాల్లో ఉన్న 3.08 లక్షల మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసేందుకు అధికారులు హడావుడిగా ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణాల్లో అయితే 24 వేల మందికి ప్లాట్లు పంపిణీ చేయడానికి నిర్ణయించారు. ఇక జిల్లాలో అల్లవరం మండలం బోడసకుర్రు, రాజ మహేంద్రవరం సమీపంలోని బొమ్మూరు టిడ్కో భవనాలను కొవిడ్‌కేర్‌ సెంటర్లుగా మార్పు చేయ డంతో టిడ్కో భవనాల ఫ్లాట్లకు ఎంపికైన లబ్ధిదారులకు పట్టాల పంపిణీ ప్రశ్నార్థకమే. ఈ విషయంపై అమలాపురం ఆర్డీవో ఎన్‌ఎస్‌వీబీ వంసతరాయుడు మాట్లాడుతూ పట్టాల పంపిణీకి రెవెన్యూ యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోందని చెప్పారు.


Updated Date - 2020-08-11T15:20:02+05:30 IST