KTR ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా.. ప్రతి దానికి ధర్నా చేస్తే ఎలా..!?

ABN , First Publish Date - 2022-03-22T20:19:43+05:30 IST

KTR ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా.. ప్రతి దానికి ధర్నా చేస్తే ఎలా..!?

KTR ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నా.. ప్రతి దానికి ధర్నా చేస్తే ఎలా..!?

హైదరాబాద్ సిటీ/నేరేడ్‌మెట్‌ :ఈ రోజు జవహర్‌నగర్‌లో ధర్నా ఎందుకు చేశారు? ప్రతి దానికి ధర్నా చేస్తే ఎలా?’ అంటూ మంత్రి కేటీఆర్‌ కార్యాలయం నుంచి ఓ వ్యక్తి మాట్లాడుతున్నట్లుగా ఉన్న ఓ ఫోన్‌కాల్‌ ఆడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. సరైన సమయంలో పింఛన్లు రాకపోవడంతో జవహర్‌నగర్‌ కార్పొరేషన్‌లో దివ్యాంగులు, కాంగ్రెస్‌ నాయకులు కార్పొరేషన్‌ ముందు రోడ్డుపై ధర్నాకు దిగారు. ధర్నా ముగిసిన అనంతరం దివ్యాంగుల హక్కుల రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోనార్క్‌ దుర్గాప్రసాద్‌కు ఫోన్‌కాల్‌ రావడంతో ఎవరు మీరు అని ప్రశ్నించారు. 


దీంతో ‘నేను కేటీఆర్‌ కార్యాలయం నుంచి మాట్లాడుతున్నా.. ధర్నా ఎందుకు చేపట్టారు?’ అని దుర్గాప్రసాద్‌ను ఒకరు ప్రశ్నించారు. దీంతో సకాలంలో పింఛన్‌లు అందడంలేదని దుర్గాప్రసాద్‌ సమాధానం ఇచ్చారు. ‘మార్చి నెల కదా అడిట్‌ జరుగుతోంది, అందుకే ఆలస్యం అవుతుంది.. ప్రతి దానికి ధర్నా చేస్తే ఎలా?’ అని ఫోనులో అవతలి వ్యక్తి సమాధానం ఇచ్చారు. మీ పేరు చెప్పండి అని దుర్గాప్రసాద్‌ కోరడంతో తనపేరు రాజశేఖర్‌రెడ్డి అని చెప్పి, ధర్నాలు చేయకండి అని అన్నారు. ధర్నాతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడటంతో  పోలీసులు, మున్సిపల్‌ కమిషనర్‌ జ్యోతిరెడ్డి దివ్యాంగులకు నచ్చచెప్పడంతో ధర్నా విరమించారు. కాంగ్రెస్‌ నాయకులు ప్రసాద్‌గౌడ్‌, ధనమ్మ, సరిత,శ్రీనివాస్‌, దివ్యాంగుల హక్కుల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-22T20:19:43+05:30 IST