Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

వీఎంఆర్‌డీఏ భూములు వేలం

twitter-iconwatsapp-iconfb-icon
  వీఎంఆర్‌డీఏ భూములు వేలం

ఐదు ప్రాంతాల్లో స్థలాలు గుర్తింపు

అమ్మకానికి ప్రకటన...

రాష్ట్ర ఖజానాకు

నెల రోజుల్లో రూ.400 కోట్ల సమీకరణకు యత్నం

వచ్చే నెల 15న ఈ-వేలం


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) నెల రోజుల్లో రూ.400 కోట్లు సమీకరించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు జమ చేసే యత్నం చేస్తోంది. ఇందుకోసం నగరం నలుమూలలా వున్న విలువైన భూములను బల్క్‌(గుత్త)గా అమ్మడానికి సిద్ధమైంది. అది కూడా ఇంతకు ముందులా నేరుగా కాకుండా...ఆన్‌లైన్‌లో ఈ-వేలం వేస్తోంది. వేలంలో ఎవరెవరు వున్నారో తెలుసుకునే అవకాశం పాటదారులకు ఉండదు. అంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతుంది.

వారం రోజుల క్రితమే భీమిలి మండలంలోని కాపులుప్పాడ, చిట్టివలస, విశాఖ గ్రామీణ మండలంలో మధురవాడ, పరవాడ మండలంలో ఈ.బోనంగిలో భూముల వేలానికి వీఎంఆర్‌డీఏ ప్రకటన జారీచేసింది. తాజాగా బుధవారం మరో ప్రకటన ఇచ్చింది. ఈసారి ఐదు ప్రాంతాల్లో భూములను వేలానికి పెట్టగా అందులో మూడు విశాఖ నగరంలో శరవేగంతో అభివృద్ధి చెందుతున్న మధురవాడలోనే ఉన్నాయి. ఇంకో రెండు స్థలాలు అనకాపల్లి జిల్లా కేంద్రానికి అతి సమీపానున్న తుమ్మపాలలో ఉన్నాయి. ఈ ఈ-వేలం అంతా వీఎంఆర్‌డీఏ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ‘కొనుగోలు’ పోర్టల్‌ ద్వారా నిర్వహిస్తున్నారు.


అప్‌సెట్‌ ధర నిర్ణయం ఇలా... 

వీఎంఆర్‌డీఏ భూముల విక్రయానికి వేలం నిర్వహించేటప్పుడు కొన్ని నిబంధనలు అమలు చేస్తోంది. గతంలో ఆ ప్రాంతంలో భూమి విక్రయిస్తే...ఆనాడు అత్యధికంగా పలికిన ధరను, ప్రస్తుత మార్కెట్‌ ధరను పరిగణనలోకి తీసుకొని ధర నిర్ణయిస్తుంది. దానికంటే తక్కువకు పాడితే కుదరదు. అంతకంటే ఎక్కువకే తీసుకోవలసి ఉంటుంది. అంటే గతంలో కంటే ఎక్కువే రావాలి. 

ప్రస్తుతం నగరం, శివార్లలో భూముల ధరలు బాగా పెరిగిపోయాయి. సామాన్యులు కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు వీఎంఆర్‌డీఏ విక్రయించేవి కూడా ఒక్కటి మాత్రమే వేయి గజాలలోపు ఉంది. మిగిలినవన్నీ వేల గజాలలో ఉన్నవే. అందులో ఒక్క బిట్‌ కొనాలన్నా కోట్ల రూపాయలు ఉండాల్సిందే. అంటే ఇవి బిల్డర్లకు, ధనవంతులకు ఉద్దేశించినవే. ఎకరాల లెక్కన ప్రకటన ఇచ్చినా...దానికి గజాల లెక్కనే ధర నిర్ణయించారు. కొన్న భూమిలో ఒకవేళ లేఅవుట్‌ వేస్తే...అందులో దాదాపుగా 40 శాతం రహదారులు, సామాజిక అవసరాలకు వదిలేయాలి. మిగిలిన 60 శాతం భూమినే భవన నిర్మాణాలకు ఉపయోగించుకోవాలి. అంటే ఆ 40 శాతం భూమి ధరను మిగిలిన 60 శాతానికి సర్దుబాటు చేసుకోవలసి ఉంటుంది. మధురవాడలో మొత్తం నాలుగు బిట్లు అమ్మకానికి పెట్టారు. గజం ధర రూ.40 వేలు నిర్ణయించారు. అందులో 934 గజాల బిట్‌ అతి చిన్నది. దానిని కొనుగోలు చేయాలంటే...కనీసం రూ.4 కోట్లు ఉండాలి. బుధవారం నుంచి దరఖాస్తులు స్వీకరించి, సెప్టెంబరు 15న ఈ-వేలం వేస్తామని వీఎంఆర్‌డీఏ అధికారులు ప్రకటించారు.ఈ-వేలానికి పెట్టిన భూములు, వాటి ధరల వివరాలు.... 

------------------------------------------------------------------------------------------------

ప్రాంతం              విస్తీర్ణం ఎకరాల్లో       గజాలలో         గజం విలువ

---------------------------------------------------------------------------------------------------

మధురవాడ          0.193 ఎకరాలు          934.12          రూ.40 వేలు

మధురవాడ          1.755 ఎకరాలు          8,404.2          రూ.40 వేలు

మధురవాడ          0.832 ఎకరాలు          4,026.88         రూ.40 వేలు

మధురవాడ          0.87 ఎకరాలు           4,200           రూ.40 వేలు

కాపులుప్పాడ         1.66 ఎకరాలు           8,034.4          రూ.29 వేలు

చిట్టివలస            3.55 ఎకరాలు          17,182            రూ.13 వేలు

ఈ.బోనంగి (పరవాడ) 0.87 ఎకరాలు          4,200            రూ.10 వేలు

ఈ.బోనంగి (పరవాడ) 4.5 ఎకరాలు           21,780            రూ.10 వేలు

తుమ్మపాల           3.96 ఎకరాలు         19,166.4           రూ.8 వేలు

తుమ్మపాల           6.00 ఎకరాలు         29,040           రూ.8 వే లు

-------------------------------------------------------------------------------------------------


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.