పంచుకున్నారు!

ABN , First Publish Date - 2022-08-01T08:44:43+05:30 IST

అనుకున్నదే జరిగింది. బార్‌ పాలసీ విషయంలో ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే నిజమైంది. రాజకీయ ఒత్తిళ్లు, హెచ్చరికలు, ప్రలోభాలు పనిచేశాయి. ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలు ‘సొమ్ము’ చేసుకుని, తమకు..

పంచుకున్నారు!

నామ్‌ కే వాస్తేగా బార్‌ లైసెన్స్‌ల వేలం 

‘అధికార’ నేతలు ఓకే అన్నవారికే 90ు

రాయలసీమ, ప్రకాశం జిల్లాలోనే పోటీ

మిగిలిన చోట్ల దాదాపుగా కనీస ధరే

కొత్తవారు రాకుండా ప్రలోభాలు, ఒత్తిళ్లు  

విశాఖ, బెజవాడ, గుంటూరుల్లో సిండికేట్‌

బెజవాడలో 52.. గుంటూరులో 54 లక్షలే

కోస్తాలో మరీ దారుణంగా బార్ల వేలం

రెండో రోజు కోటి దాటినవి 10 మాత్రమే

సర్కారుకు మొత్తం ఆదాయం 597 కోట్లు

సిండికేట్‌తో రూ.100 కోట్లకుపైగా నష్టం


అమరావతి, జూలై 31 (ఆంధ్రజ్యోతి): అనుకున్నదే జరిగింది. బార్‌ పాలసీ విషయంలో ‘ఆంధ్రజ్యోతి’ చెప్పిందే నిజమైంది. రాజకీయ ఒత్తిళ్లు, హెచ్చరికలు, ప్రలోభాలు పనిచేశాయి. ఎక్కడికక్కడ అధికార పార్టీ నేతలు ‘సొమ్ము’ చేసుకుని, తమకు కావాల్సిన వారికి లైసెన్స్‌లు దక్కేలా చేశారు. కొత్త వ్యాపారులు వేలంలో పాల్గొనకుండా చేశారు. ఆదివారం జరిగిన వేలంలో పోటీ నామమాత్రంగా సాగింది. ముందస్తు ప్రణాళికతో వేలంలో ధరలు పెంచకుండా చేసి, దాదాపు కనీస ధరలకే బార్ల లైసెన్సులు దక్కించుకున్నారు. మొత్తంగా 90 శాతం బార్లను అధికార పార్టీ పరోక్షంగా హస్తగతం చేసుకుంది. లైసెన్స్‌లు పొందినవారిలో వైసీపీ నేతలు కూడా ఉన్నారు. విజయవాడలో ఎక్సైజ్‌ శాఖ మంత్రి బినామీలు 5 బార్‌ లైసెన్స్‌లు దక్కించుకున్నట్టు సమాచారం.


ఈ మొత్తం ప్రక్రియలో పోటీలేకుండా చేయడంతో ప్రభుత్వానికి దాదాపు రూ.100 కోట్ల నష్టం జరిగింది. రెండు రోజుల వేలంలో రాయలసీమ, ఉమ్మడి ప్రకాశం జిల్లా మినహా కోస్తా అంతటా సిండికేట్‌ స్పష్టంగా కనిపించింది. ఆదివారం జరిగిన వేలంలో ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, రాజమండ్రి కార్పొరేషన్లలో జరిగిన వేలం తీరు చూస్తే అసలు ఇది వేలం పాటేనా అన్న సందేహం కలుగుతుంది. 110 బార్లు ఉన్న విజయవాడ కార్పొరేషన్‌లో రూ.50 లక్షల కనీస ధరతో ప్రారంభమైన వేలం రూ.52 లక్షలు దాటలేదంటే సిండికేట్‌ ఏ స్థాయిలో పనిచేసిందో అర్థమవుతుంది.


విచిత్రం ఏంటంటే విజయవాడను ఆనుకుని ఉండే తాడిగడప మున్సిపాలిటీలో ఓ బార్‌ లైసెన్స్‌కు రూ.97 లక్షల ధర పలకడం గమనార్హం. ఇక గుంటూరు జిల్లాలోనూ కనీస ధరకు కేవలం రూ.4లక్షలే అదనంగా పాడి, రూ.54 లక్షలతో బార్‌ లైసెన్సులు దక్కించుకున్నారు. అందులోనూ చాలామంది రూ.50 లక్షలతోనే లైసెన్సులు పొందారు. రాజమండ్రిలో 16 బార్లకు 19 దరఖాస్తులు రాగా చివరికి వేలంలో 16 మందే పాల్గొన్నారు. కనీస ధర రూ.50 లక్షలు కాగా రూ.56 లక్షల గరిష్ఠ ధరతో లైసెన్సులు పొందారు. కాగా అదే జిల్లా (తూర్పుగోదావరి)లోని నిడదవోలులో రూ.15 లక్షల కనీస ధర బార్‌ను రూ.73 లక్షలకు పాడారు. తూర్పుగోదావరి నుంచి నెల్లూరు వరకు సిండికేట్‌ వ్యవహారం స్పష్టంగా కనిపించింది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో పోటీలో లేకుండా ఉండేందుకు దరఖాస్తుదారులకు రూ.15 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది. జిల్లాలో ఓ ముఖ్య ప్రజాప్రతినిధికి రూ.80 లక్షలు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ రూ.35 లక్షల కనీస ధరను రూ.39 లక్షలు దాటకుండా చూసుకున్నారు. కాకినాడ కార్పొరేషన్‌లో 11 బార్లకు 18 దరఖాస్తులు వచ్చాయి.


రూ.20 లక్షల ఆఫర్‌తో ఏడుగుర్ని వేలంలో పాల్గొనకుండా చేశారు. దీంతో 35 లక్షల కనీస ధరతో ప్రారంభమైన వేలంలో ఒక్కరు మాత్రమే రూ.39 లక్షలు పాడగా, మిగిలిన 10 బార్లు రూ.37 లక్షలతోనే ఆగిపోయాయి. కాగా ఇదే జిల్లాలోని గొల్లప్రోలు నగర పంచాయతీలో రూ.15 లక్షల బార్‌ను ఏకంగా రూ.51 లక్షలకు పాడారు. నెల్లూరు కార్పొరేషన్‌లో కనీస ధర రూ.50 లక్షలు కాగా రూ.58 లక్షల గరిష్ఠ ధరకే బార్లు దక్కించుకున్నారు. నెల్లూరు జిల్లాలో కందుకూరులో మాత్రమే గరిష్ఠంగా రూ.1.30 కోట్ల ధర పలికింది. శనివారం జరిగిన వేలంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ ఇదే తంతు సాగింది. ముఖ్యంగా విశాఖపట్నం కార్పొరేషన్‌లో 128 బార్లుంటే గరిష్ఠంగా రూ.60 లక్షలే ధర పలికింది. దీంతో ఇక్కడ ఆదాయానికి భారీగా గండి పడింది.


ప్రకాశం, బాపట్ల టాప్‌

ఆదివారం జరిగిన వేలంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలో అత్యధికంగా రూ.1.47కోట్ల ధర పలికింది. దర్శిలోనూ స్వల్ప తేడాతో రూ.1.47 కోట్లు పాడారు. మార్కాపురంలోనే మరో బార్‌కు రూ.1.37 కోట్లు, బాపట్ల జిల్లాలోని అద్దంకిలో రూ.15లక్షల కనీసధర బార్‌ను రూ.1.37 కోట్లకు పాడారు. చీమకుర్తిలోనూ ఓ బార్‌ను రూ.1.07 కోట్లకు దక్కించుకున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడి బార్‌కు రూ.99 లక్షలు ధర పలికింది. ఏలూరు కార్పొరేషన్‌లో 10 బార్లకు 14 మంది పోటీపడగా గరిష్ఠ ధర రూ.91 లక్షలు పలికింది. కాగా ఒంగోలులో 15 బార్లకు జరిగిన వేలంలో కనీస ధర రూ.35 లక్షలు కాగా గరిష్ఠంగా రూ.39 లక్షలు మాత్రమే పాడారు.


రేపల్లెలో రూ.35 లక్షల ధర ఉన్న బార్లను రూ.37 లక్షలకే చేజిక్కించుకున్నారు. తెనాలిలో కనీస ధర రూ.35 లక్షలు కాగా గరిష్ఠంగా రూ.65 లక్షల ధర పలికింది.  నర్సరావుపేటలో కనీస ధర రూ.35లక్షలు ఉండగా, అత్యధికంగా రూ.51లక్షలు పాడారు. బాపట్లలో కనీసధర రూ.35 లక్షలకు గాను రూ.41 లక్షల గరిష్ఠ ధర దక్కింది. మొత్తమ్మీద శనివారం జరిగిన వేలంలో కోటికి పైగా ధర పలికిన బార్లు 41ఉంటే, ఆదివారం 10 మాత్రమే ఉన్నాయి.


మొత్తం ఆదాయం 597 కోట్లు 

రెండు రోజుల్లో మొత్తం 838 బార్లకు వేలం నిర్వహించగా నాన్‌ రిఫండబుల్‌ రిజిస్ర్టేషన్‌ చార్జ్‌, వేలం, దరఖాస్తుల రుసుములు, లైసెన్సు రుసుములు అన్నీ కలిపి ఎక్సైజ్‌ శాఖకు రూ.597కోట్ల ఆదాయం  వచ్చింది. కోస్తాలో 494 బార్లకు వేలం నిర్వహించగా జగ్గయ్యపేట, విజయవాడల్లో ఒక్కో బార్‌ మిగిలిపోయాయి. 492 బార్లకు కలిపి రూ.338 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. ఎక్కడికక్కడ సిండికేట్‌ కావడంతో ధరలు పెరగకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. తొలి రోజు 323 బార్లకు రూ.258 కోట్లు రావడంతో రెండోరోజు 494 బార్లకు రూ.400 కోట్లకు పైగా వస్తుందని భావించారు. కానీ సిండికేట్‌ వ్యవహారంతో ఎక్సైజ్‌ శాఖకు పెద్ద షాకే తగిలింది. వేలం ప్రారంభమయ్యాక ఎంతసేపైనా ధర స్థిరంగా ఉండటంతో దాదాపు కనీస ధరలకే కట్టబెట్టాల్సి వచ్చింది. ఫలితంగా ప్రభుత్వానికి రూ.వంద కోట్లకు పైగా నష్టం వచ్చింది.


ఎన్నికలున్నా తక్కువ ధరలకే

మద్యం షాపులు ప్రైవేటు పరిధిలో ఉంటే బార్లకు పెద్దగా లాభాలుండవు. కానీ ఇప్పుడు షాపులు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున బార్లకు లాభాలు పెరిగాయి. కరోనా సమయంలో బార్లు దెబ్బతిన్నా అనంతరం పుంజుకున్నాయి. పైగా వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయంలో విపరీతమైన వ్యాపారం ఉంటుంది. అం దువల్లే మొదట్లో 840 బార్లకు ఏకంగా 1672 మంది దరఖాస్తుకు నమోదు చేసుకున్నారు. అనంతరం ఒత్తిళ్లతో చివరికి 1158మందే బరిలో మిగిలారు. వారిలోనూ చాలామందిని వివిధ మార్గాల్లో వేలం నుంచి తప్పించడంతో తక్కువ ధరలకే లైసెన్స్‌లు దక్కించుకున్నారు. మొత్తంగా ఈ వేలం ప్రక్రియ చూస్తే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లలో నామమాత్రంగా జరిగింది. ఈమాత్రం దానికి వేలం పాట ఎందుకన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ఎప్పుడూ బార్లకు వేలం నిర్వహించలేదు.


పాలసీ సమయంలో రెన్యువల్‌ విధానం మాత్రమే ఉండేది. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే బార్లపై కన్నేసింది. ఎప్పుడెప్పుడు పాలసీ ముగుస్తుందా అని ఎదురు చూసిన నేతలకు తాజా పాలసీ కాసులు కురిపించింది. దరఖాస్తు నుంచి వేలం వరకు అంతా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా జరుగుతుందన్న ఎక్సైజ్‌ ప్రకటనలు కార్యరూపం దాల్చలేదు. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వారీగా బార్లకు దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలు అధికార నేతలకు చేరాయి. కొత్తవారు పోటీకి రాకుండా చేయడంలో నేతలు, సిండికేట్లు సఫలమయ్యారు. సామదానభేద దండోపాయాలను ప్రయోగించారు. దీంతో చాలామంది వెనకడుగు వేశారు. 

Updated Date - 2022-08-01T08:44:43+05:30 IST