బతుకు బాటపై వేలం వేట

ABN , First Publish Date - 2022-04-18T05:02:25+05:30 IST

ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 103 మత్స్యకార సహకార సంఘాలు ఉన్నాయి.

బతుకు బాటపై వేలం వేట

  1. మత్స్యకారులకు శాపంగా జీవో 217
  2. చెరువుల్లో చేపలపై కోల్పోతున్న హక్కు 
  3.  జీవో రద్దు కోసం ఆందోళనలకు శ్రీకారం 
  4.  నేడు మత్స్యకారుల పోరు నిరసన 

దశాబ్దాల తరబడి చెరువులు, కాలువలు, రిజర్వాయర్లలో చేపలు వేటాడి జీవించే   మత్స్యకారులు ఇకపై రోడ్డున పడనున్నారు. ఇప్పటిదాకా చెరువుల్లో చేపల వేట సాగించే అవకాశం మత్స్యకార సహకార సంఘాలకే ఉండగా తాజాగా ప్రభుత్వం తెచ్చిన జీవో  217 ఇప్పుడు మత్స్యకారులకు  శాపంగా మారనుంది. ఇకపై నూరు ఎకరాలకు పైబడి చెరువులు, రిజర్వాయర్లలో చేపలను పట్టాలంటే.. వేలం పాటల్లో ఎవరైనా పాల్గొనవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ జీవోను గత సంవత్సరం ఆగస్టు 18న ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి పూనం మాలకొండయ్య జారీ చేశారు. దీంతో వేలం కోసం నిర్వహించే టెండర్లలో మత్స్యకార సహకార సంఘాలతోపాటు ఎవరైనా పాల్గొనవచ్చు. ఆనలైన పద్ధతిలో వేలం పాట నిర్వహించనున్నారు. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన 217 జీవో ప్రకారం కొత్త పద్ధతిని గత సంవత్సరం నుంచి నెల్లూరు జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు. ఇకపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇదే పద్ధతిలో చేపల వేట కోసం వేలం పాట నిర్వహించనున్నారు.  ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై జిల్లాలోని మత్స్యకార సంఘాలు తీవ్ర ఆందోళన చెందుతున్నాయి. దశాబ్దాలుగా తాము చెరువుల్లో చేపల వేట సాగిస్తూ జీవనోపాధి పొందుతున్నామని.. ఇకపై రాజకీయ నాయకులు, బడా వ్యాపారుల చేతుల్లోకి వెళితే తమ పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

కర్నూలు(అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 16: ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 103 మత్స్యకార సహకార సంఘాలు ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 50వేల కుటుంబాలు చెరువుల్లో, జలాశయాల్లో చేపల వేటను కొనసాగిస్తూ జీవనోపాధి పొందుతున్నాయి. ప్రభుత్వం తాజాగా జారీ చేసిన జీవో.217 ప్రకారం ఇకపై బడా వ్యాపారులు, రాజకీయ నాయకులకే చేపల వేట అధికారం దక్కనుంది. ఈ పరిస్థితిని నివారించేందు కోసం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాలోని మత్స్యకారులు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 18వ తేదీ నుంచి ఆందోళనబాట పట్టనున్నారు. మొట్టమొదటి సారిగా కర్నూలు జిల్లా నుంచే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. కర్నూలులో చేపడుతున్న మత్స్యకార హోరు నిరసన కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో విజయవంతం చేసేందు కోసం టీడీపీతోపాటు బీజేపీ, వామపక్ష, జనసేన, కాంగ్రెస్‌ పార్టీల నేతలు కర్నూలుకు తరలివస్తున్నారు. టీడీపీ నుంచి బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. 

జీవో 217తో మత్స్యకారుల్లో ఆందోళన

దశాబ్దాల తరబడి మత్స్యకారులు చెరువులు, జలాశయాల్లో చేపలను పెంచుకుంటూ అవి పెద్దయ్యాక.. వేసవి కాలంలో వాటిని పట్టుకుని జీవనోపాధి పొందుతున్నారు. ఇప్పటి దాకా మత్స్యకారులు కోస్తా జిల్లాల నుంచి చేప పిల్లలను తెచ్చి చేసి చెరువుల్లో విడిచి పెద్ద చేసేవారు. పెద్దవి అయ్యాక వాటిని పట్టుకుని జీవనోపాధి పొందుతున్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చెరువులు, జలాశయాల్లో కోస్తా జిల్లాల నుంచి నాణ్యమైన వివిధ రకాల చేపల పిల్లలను తెప్పించి చెరువులు జలశయాల్లో వదిలే కార్యక్రమం చేపట్టింది. వైసీపీ అధికారంలోకి రాగానే మత్స్యకార సంఘాలకు ఎటువంటి నిధులు అందించలేదు. దీంతో మరోదారి లేక చేపల వేట సాగించేందుకు ఆయా సంఘాల సభ్యులు తలాకొంత మొత్తాన్ని జమ చేసుకొని కొస్తా జిల్లాలకు వెళ్లి చేప పిల్లలను తెచ్చుకొని చెరువుల్లో పెంచుకుంటున్నారు. తద్వారా వచ్చిన ఆదాయాన్ని పొందుతూ జీవనం సాగిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఈ చెరువుల్లో చేపల         వేటను సాగించేందుకు కొత్త విధానాన్ని అమల్లోకి        తెచ్చింది. గత సంవత్సరం ఆగస్టు  18న జీవో.217 తీసుకొచ్చింది. ఈ జీవో ప్రకారం చెరువులు, జలాశయాల్లో  చేపలు పట్టాలంటే.. ఇకపై నిర్వహించే వేలం పాటల్లో ఆర్థిక స్థోమత ఉన్న ఎవరైనా పాల్గొనవచ్చు. 

జీవో 217ను  వ్యతిరేకిస్తున్నాం

 వేలం పాటల్లో ఆర్థిక స్థోమత ఉన్న వారే చేపల వేట అధికారాన్ని దక్కించుకో నున్నారు. దీంతో నిరుపేదలైన మత్స్యకారుల నోట్లో మట్టి పడనుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల హోరు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాం. అన్ని రాజకీయ పార్టీల నాయకులు మా ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరుకుంటున్నాం.

-  వెంకటేశ్వర్లు, మత్స్యకారుల సంక్షేమ సంఘం రాయలసీమ ఇనచార్జి 

కొత్త జీవో వల్ల మత్స్యకారులకే ప్రయోజనం 

ఇప్పటిదాకా మత్స్యకారులకు చేపల వేట వల్ల పెద్దగా ప్రయోజనం కలిగేది కాదు. దళారులే ఎక్కువ లాభపడేవారు మరోవైపు చెరువుల మరమ్మతులకు ఎటువంటి నిధులు లేని పరిస్థితి నెలకొనేది. ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే జీవో.217ను అమల్లోకి తెచ్చింది. వేలం పాట ద్వారా లభించే ఆదాయంలో 30 శాతం సహకార సంఘాల సభ్యులకు అందనుంది. దీంతోపాటు చెరువుల అభివృద్ధికి నిధులు సమృద్ధిగా లభిస్తాయి.

- శ్యామల, మత్స్యకార శాఖ డీడీ


 మత్స్యకారుల పొట్ట కొట్టదు: సోమిశెట్టి 

 నేటి ధర్నాకు టీడీపీ సంపూర్ణ మద్దతు 

కర్నూలు(అగ్రికల్చర్‌), ఏప్రిల్‌ 17: మత్య్సకారుల పొట్టకొట్టవద్దని కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం అధ్యక్షుడు సోమి శెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఆదివారం నగరంలోని టీడీపీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ మత్స్యకారులు చెరువులు, జలాశయాల్లో తరతరాలుగా చేపల వేటను కొనసాగిస్తున్నారని, గత ప్రభుత్వాలు ఏనాడూ వారి ఉపాధిని కాలరాసేందుకు చర్యలు తీసుకోలేదని సోమిశెట్టి అన్నారు.   ప్రభుత్వం కొత్తగా జీవో.217ను అమల్లోకి తెచ్చారని ఆరోపించారు. ఈ జీవో ప్రకారం మత్స్యకారులు చెరువులు, జలాశయాల్లో చేపల వేటను కొనసాగించే అవకాశం లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం కర్నూలులో జరిగే మత్య్సకారుల ధర్నాకు టీడీపీ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ ధర్నాకు బీసీ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర, కాకినాడ మాజీ ఎమ్మెల్యే కొండబాబు, జిల్లాలోని ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గాల పార్టీ ఇనచార్జిలు ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి మత్స్యకారులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2022-04-18T05:02:25+05:30 IST