ఏయూ అధికారుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2020-11-29T06:03:49+05:30 IST

కోర్టులో ఉన్న, తమది కాని స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు దిగిన ఏయూ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.

ఏయూ అధికారుల అత్యుత్సాహం
వివాదస్పద నిర్మాణాలను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ

ఇరిగేషన్‌ శాఖ స్థలంలో గోడ నిర్మాణానికి యత్నం

అదే స్థలంలో గతంలో దుకాణాలు తొలగించిన జీవీఎంసీ

తాజా నిర్మాణాలపై నిలదీసిన దుకాణదారులు

ఎమ్మెల్యే వెలగపూడి జోక్యంతో వెనక్కు తగ్గిన అధికారులు

విశాఖపట్నం, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): కోర్టులో ఉన్న, తమది కాని స్థలంలో నిర్మాణాలు చేపట్టేందుకు దిగిన ఏయూ అధికారుల తీరు తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. వి వరాల్లోకి వెళితే.. ఏయూ ఇంజనీరింగ్‌ కళాశాల రహదారిలో నీటి పారుదలశాఖకు చెందిన స్థలంలో కొంతమంది చిన్న షెడ్లు వేసుకుని వ్యాపారాలు సాగిస్తున్నారు. వీటిని ఆక్రమణ లుగా చెబుతూ జీవీఎంసీ అధికారులు గత నెలలో కూల్చివేశారు. దీనిపై దుకాణదారులు కోర్టుకు వెళ్లడంతో ప్రక్రియ నిలిచిపోయింది. అయితే, ఈ నిర్మాణాలకు ఆనుకుని ఉన్న ఫుట్‌పాత్‌ పక్కన గోడ నిర్మాణానికి ఏయూ ఇంజనీరింగ్‌ అధికారులు శనివారం పూనుకున్నారు. ఇప్పటికే కోర్టులో ఉన్న, వివాదం నడుస్తున్న స్థలంలో ఏయూ అధికారులు గోడ నిర్మాణానికి పూనుకున్న విషయాన్ని తెలుసుకున్న దుకాణదారులు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అక్కడికి చేరుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. కోర్టులో వివాదం నడుస్తున్న స్థలంలో నిర్మాణాలు ఎలా చేపడతారంటూ ఎమ్మెల్యే అధికారులను నిలదీశారు. నిర్మాణాలను చేపడుతు న్న ఏయూ అధికారులను వ్యాపారులు, ఎమ్మెల్యే అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ఏ యూ అధికారులు పనులను మధ్యలోనే నిలిపివేయడంతో గొడవ సద్దుమణిగింది. 


ఎవరి మెప్పు కోసమో...?

-ఎమ్మెల్యే వెలగపూడి

ఈ విషయమై ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ గోడ నిర్మాణం విషయంలో యూనివర్సిటీ అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్‌ ఆదేశాలతో నిర్మాణాలు చేపడుతున్నట్టు కొంతమంది అధికారులు చెప్పారని, దీనిపై కలెక్టర్‌తో మాట్లాడితే విషయం తన దృష్టికి రాలేదని చెప్పారన్నారు. ఎవరి మెప్పు కోసం ఏయూ అధికారులు ఇదంతా చేస్తున్నారో చెప్పాలన్నారు. 


Updated Date - 2020-11-29T06:03:49+05:30 IST