హాజరుకు కుస్తీ

ABN , First Publish Date - 2022-08-17T06:46:33+05:30 IST

ఉదయం 9 గంటలు.. ఏ స్కూలు ముందు చూసినా సెల్‌ఫోన్‌ పట్టుకుని ఉపాధ్యాయులు సెల్ఫీలు దిగుతున్నారు..

హాజరుకు కుస్తీ
హైస్కూల్‌లో సెల్‌ ఫోన్లతో కుస్తీ పడుతున్న ఉపాధ్యాయులు

టీచర్లకు అటెండెన్స్‌ కష్టాలు


ఉదయం 9 గంటలు.. ఏ స్కూలు ముందు చూసినా సెల్‌ఫోన్‌ పట్టుకుని ఉపాధ్యాయులు సెల్ఫీలు దిగుతున్నారు.. ఇదేంటని.. ఆంధ్రజ్యోతి ప్రశ్నించగా అసలు కథ తెలిసింది.. ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా సీఎల్‌ వేస్తామని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేయడంతో అంతా ఇలా చేశారు. ప్రభుత్వ చర్యలతో ఉపాధ్యాయులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.. కక్కలేక మింగలేక కుస్తీలు పడుతున్నారు.. ప్రభుత్వ ఆదేశాలు తూ..చ తప్పకుండా పాటించేందుకు విద్యా బోధన పక్కన పెట్టి ఆపసోపాలు పడుతున్నారు.. మంగళవారం ఉపాధ్యాయులకు ఎదురైన సంఘటనే దీనికి ఉదాహరణ. 


రాజమహేంద్రవరం/కోరుకొండ, ఆగస్టు 16 :  ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులంతా ఉదయం 9 గంటలలోపు, మధ్యాహ్నం 4 గంటలు తరువాత ప్రభు త్వం రూపొందించిన ప్రత్యేక యాప్‌లో వారి అటెం డెన్స్‌ను నమోదు చేయాలి.. ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ పూటకు సెలవు  పెట్టుకోవాల్సి ఉంటుందని స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనరేట్‌ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. దీంతో మంగళవారం ఉదయం 8.55 గంటల నుంచే ఉపాధ్యాయులు హాజరు నమోదు చేసుకునేందుకు సెల్‌ఫోన్లతో కుస్తీ పట్టారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు  2 లక్షల మంది ఉపాధ్యా యులు ఇదే పని లో ఉండడం వల్ల సర్వర్లు మొరా యించాయి. వేల మంది ఉపాధ్యాయులు సర్వర్లు పని చేయక తీవ్ర ఒత్తి డికి గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఉదయం నుంచే ఈ కొత్త ప్రక్రియ అమల్లోకి తెచ్చింది. మధ్యా హ్నం 11.30 గంటల వరకు చాలా చోట్ల సర్వర్లు పని చేయక ఉపాధ్యాయులు హాజ రు నమోదు చేయలేదు. చివ రకు పాత యాప్‌ల్లోనే కొందరు హాజరు నమోదు చేశారు. కొంత మంది సెల్ఫీలు తీసుకుని మండల స్థాయి అధికా రులకు పంపారు. ఇదీ మం గళవారం ప్రతి పాఠశాలలో కనిపించిన సీన్‌..


హాజరుకు.. జీతానికి అనుసంధానం..


 ప్రతి ఉపాధ్యాయుడు ఉదయం 9 గంటల్లోపే యాప్‌లో అటెండెన్స్‌ వేయాలి. ఎందుకంటే హాజరుకు, జీతానికి ప్రభుత్వం అనుసంధానం చేస్తోంది. హాజరు తక్కువైతే జీతం కోత వేస్తారు. పైగా  క్యాజ్‌వల్‌లీవులు, ఇతర లీవులను పట్టించుకోకుండా కేవలం ఎర్న్‌లీవులను మాత్రం కోత వేస్తామని ఇప్పటికే ప్రకటించడంతో ఉపాధ్యాయ వర్గాలకు ఇబ్బందిగా మారింది.  మూడు నెలల కిందట రిమ్స్‌ అనే యాప్‌ను అమలులోకి తెచ్చారు. దానిని తీసేసి సిమ్స్‌ అనే యాప్‌ను తెచ్చారు. రిమ్స్‌ కొంత వరకూ పనిచేసేదని, సిమ్స్‌  పనిచేయడం లేని పలువురు ఉపాధ్యాయులు వాపోయారు.  ప్రతి ఉపాధ్యాయుడు 9గంటలలోపే పాఠశాలకు వెళ్లి తన సెల్‌ఫోన్‌లో సెల్ఫీ తీసుకుని, ఈయాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి. మంగళవారం జిల్లాలో గంటల తరబడి పట్టుపట్టినా అవ్వలేదని కొందరు వాపోయారు. 


32,498 మంది ఉపాధ్యాయులు..


ఉమ్మడి జిల్లాల్లో 32,498 మంది ఉపాధ్యాయులు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్నారు. ప్రభుత్వం కొత్తగా స్కూల్‌ అటెండెన్స్‌లో టీచర్‌ అటెండెన్స్‌ ప్రవేశపెట్టింది.ఈ మేరకు కాంప్లెక్స్‌ హెచ్‌ఎం తన పరిధిలో ఉన్న ఉపాధ్యాయులందరినీ ఆయా పాఠశాలల పరిధిలో ముందు రిజిస్ర్టేషన్‌ చేయా లి. ఆపై ఉపాధ్యాయులందరూ వారు పనిచేస్తున్న పాఠశాలల్లో యాప్‌ ఓపెన్‌ చేసి ఫేస్‌ రికగ్నిషన్‌ ద్వారా హాజరు నమోదు చేయాలి. అయితే మొత్తం టీచర్లు అందరూ యాప్‌లో రిజిస్ర్టేషన్‌ అయ్యారు. పాఠశాల ఆవ రణలో నిలబడి కొత్త యాప్‌లో హాజరునమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉపాధ్యాయు లంతా మంగళవారం పాఠశాల ఆవరణలో చెట్ల కింద సెల్‌ఫోన్‌తో కుస్తీ పడటం పలువురిని ఆశ్చర్యపరిచింది. అయితే మంగళవారం ఉదయం సర్వర్‌ పనిచేయలేదు.  ఈ విధానం మార్చి పాత పద్ధతిని కొనసాగించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.మరో పక్క యాప్‌లో హాజరు నమోదుకు టీచర్లు దూరంగా ఉండాలని ప్యాప్టో పిలుపు ఇవ్వడంతో సుమారు 50 శాతం మంది హాజరు నమోదుకు ముందుకు రాలేదు. మిగతా 50 శాతం మంది హాజరు వేద్దామని యాప్‌లు ఓపెన్‌ చేస్తే ఓపెన్‌ కాలేదు. జిల్లాలో 64 శాతం మంది ఉపాధ్యాయులు హాజరు వేశారని డీఈవో అబ్రహం తెలిపారు. 


విలీన టీచర్లకు మరిన్ని కష్టాలు.. 


ఇటీవల 1 కి.మీ లోపు దూరంలో  ఉన్న ప్రాథమిక పాఠశాలలన్నీ ఆయా ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. దీంతో 3, 4, 5 తరగతులతో పాటు టీచర్లు కూడ ఉన్నత పాఠశాలల్లో విలీనం అయ్యారు. అయితే టీచర్ల హాజరు మాత్రం పాత ప్రాథమిక పాఠశాలల్లోనే ఉన్నట్టు చూపిస్తుంది. దీంతో వీరందరూ పాత ప్రాథమిక పాఠశాల ఆవరణలో యాప్‌లో రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. ఇకపై వారు ఆయా పాఠశాలలకు వెళ్లి అక్కడ యాప్‌లో హాజరు వేసుకుని తిరిగి విలీనమైన ఉన్నత పాఠశాలకు వచ్చి మరలా సాయంత్రం ప్రాథమిక పాఠశాలకు వెళ్లి తిరిగి హాజరు వేసుకోవాలి. దీంతో వారు రోజూ అదనంగా రెండు కిలోమీటర్లు దూరం వెళ్ల వలసి వస్తుందని.. సమయం వృథా అవుతుందని, ఆర్ధికంగా కూడ ఇబ్బంది అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


కోట్లు వృథాయేనా..


గతంలో రూ.కోట్లు ఖర్చు చేసి బయోమెట్రిక్‌  డివైజులు కొన్నారు.హైసూళ్లకు రెండూ, మూడు,  ఎలిమెంటరీ స్కూల్‌కు ఒకటి వంతున డివైజులు ఇచ్చారు. అవన్నీ పాఠశాలలో మూలుగుతున్నాయి. కొన్ని మర మ్మతుల్లో ఉన్నాయి. వాటిని వృథాగా వదిలేసి ఈ కొత్త  విఽధానం అమల్లోకి తేవడం ఇబ్బందికరంగా ఉందని  ఉపాధ్యాయులు అంటున్నారు. 


Updated Date - 2022-08-17T06:46:33+05:30 IST